ఒకే ఏడాది మూడు విషాదాలు.. మహే'శో'కం
on Nov 14, 2022

మనిషి జీవితంలో కష్టాలు, కన్నీళ్లు సహజం. ఎంతటి గొప్పవారైనా వీటికి అతీతులు కాదు. అయితే ఆ కష్టాలన్నీ ఒకేసారి వస్తేనే తట్టుకోవడం కష్టం. ఇప్పుడు హీరో మహేష్ బాబు అంతటి కష్టంలోనే ఉన్నాడు. ఒకే ఏడాది ముగ్గురు సొంతవారిని కోల్పోయి మాటల్లో చెప్పలేనంత బాధని అనుభవిస్తున్నాడు.
ఈ 2022 సంవత్సరంలో ఘట్టమనేని కుటుంబంలో వరుస విషాదాలు చోటుచేసుకున్నాయి. ఏడాది ప్రారంభంలోనే జనవరి 8న మహేష్ సోదరుడు రమేష్ బాబు కన్నుమూశారు. అన్నయ్యతో మహేష్ కి ఎంతో అనుబంధం ఉండేది. మహేష్ నటించిన 'అర్జున్', 'అతిథి' వంటి సినిమాలను కూడా రమేష్ నిర్మించారు. తన సినీ ప్రయాణంలో ఎంతో తోడుగా నిలిచిన అన్నయ్య మృతి చెండంతో మహేష్ విషాదంలో మునిగిపోయాడు.
సోదరుడు మరణించిన బాధ నుంచి మహేష్ పూర్తిగా బయటపడకముందే తొమ్మిది నెలలకే ఆయన తల్లి ఇందిరాదేవి సెప్టెంబర్ 28న మరణించారు. అమ్మంటే మహేష్ కి ప్రాణం. తాను ఎంత పెద్ద హీరో అయినా తల్లి ముందు పసిపిల్లాడిలా మారిపోయేవాడు. ఆమె చేయి పట్టుకొని నడిచేవాడు. ఎప్పుడైనా పనిలో ఒత్తిడికి లోనైతే వెంటనే వెళ్లి అమ్మ చేతి కాఫీ తాగి, ఆమెతో కాసేపు మాట్లాడి.. నూతనోత్సాహంలో పని చేసేవాడు. అమ్మంటే మహేష్ కి మాటల్లో చెప్పలేని ఎమోషన్. ఆమె దూరమైనప్పుడు మహేష్ ఎంతగానో బాధపడ్డాడు.
ఆ రెండు మరణాలు మహేష్ ని బాగా కృంగదీశాయి. ఆ బాధ నుంచి మహేష్ బయటపడి ఎప్పటిలా నవ్వుతూ ఉండాలని అభిమానులు కోరుకుంటున్న సమయంలో.. ఊహించని విధంగా ఈరోజు(నవంబర్ 15) తెల్లవారుజామున ఆయన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ తుదిశ్వాస విడిచారు. సూపర్ స్టార్ నటవారసుడిగా పరిచయమై సూపర్ స్టార్ స్థాయికి ఎదిగాడు మహేష్. ఆయన ఎదుగుదల చూసి కృష్ణ ఎంతో పొంగిపోయేవారు. కుమారుడు పాన్ ఇండియా స్టార్ గా మారే సమయంలో కృష్ణ ఈ లోకాన్ని విడిచి వెళ్లారు.
ఇలా వరుస విషాదాలు మహేష్ ని శోకసంద్రంలో ముంచాయి. తల్లి మరణించి రెండు నెలలు కూడా తిరక్కుండానే తండ్రి మరణించడం మహేష్ తీరని లోటు. ఈ బాధని తట్టుకునే శక్తి మహేష్ కి లభించాలని, ఆయన ఈ బాధ నుంచి త్వరగా బయటకు రావాలని కోరుకుందాం.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



