స్టార్ హీరోలపై బాలు సంచలన వ్యాఖ్యలు
on Jan 23, 2017

ప్రముఖ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రమణ్యం మన స్టార్ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగు సినిమాలకు జాతీయ అవార్డులు రావడం లేదని కబుర్లు చెప్పడం మానేసి, ఆ స్థాయి ఉన్న సినిమాల్ని తీయమని ఛాలెంజ్ చేశారు. తెలుగుజాతి గొప్పదనం చాటి చెప్పే ఒక్క సినిమా అయినా తీయమని, కమర్షియల్ సినిమాలతో కొట్టుకుపోవొద్దని అగ్ర కథానాయకుల్ని కోరారు బాలు. `దంగల్` లాంటి సినిమాలు చేయగలిగే సత్తా ఉన్న కథానాయకులు తెలుగులో ఉన్నారా అంటూ ప్రశ్నించారు. నాలుగు సినిమాల్లో మూడు తమకు నచ్చిన సినిమాల్ని తీసుకొని.. కనీసం ఒక్కటి తెలుగు జాతి కోసం, తెలుగు జాతి గౌరవాన్ని పెంచడం కోసం తీయమని సలహా ఇచ్చారు.
మిథునం లాంటి మంచి సినిమా తీస్తే. .. కనీసం పది థియేటర్లు కూడా దొరకని దౌర్భాగ్య స్థితి దాపురించిందని, దీనికి కారణం ఎవ్వరని ప్రశ్నించారు బాలు. మంచి సినిమాలు తీస్తే డబ్బులు రావని అంటుంటారని, ఫక్తు ఫార్ములాలతో తీసిన ప్రతీ సినిమాకీ డబ్బులు వస్తున్నాయా అని ప్రశ్నించారు బాలు. పనిలో పనిగా సినీ అభిమానులకూ చురకలు వేశారు. అభిమానులంతా హీరోల్ని ప్రశ్నించే స్థాయికి ఎదగలాని, ఎవరో చప్పట్లు కొట్టారని, తాము కూడా కొట్టేస్తున్నారని... ఫలానా సినిమా నచ్చలేదనో, ఫలానా పాట నచ్చలేదనో నిర్మొహమాటంగా హీరోల్ని నిలదీసి అడగాలని ప్రేక్షకులకు సూచించారు బాలు. మరి గాన గంధర్వుడి మాటలైనా మన హీరోల చెవులకు ఎక్కుతాయా? వాళ్లలో మార్పు మొదలవుతుందా? దీనిపై మన హీరోలు, దర్శకులు ఎలా స్పందిస్తారో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



