అన్నమయ్య సంకీర్తనతో వీడియో.. వివాదంలో శ్రావణ భార్గవి!
on Jul 20, 2022

గాయని శ్రావణ భార్గవి ఓ వివాదంలో చిక్కుకుంది. డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా అయిన ఆమె తోటి గాయకుడు హేమచంద్రను కొన్ని సంవత్సరాల క్రితం వివాహం చేసుకుంది. ప్రస్తుతం సింగర్‌గా డిమాండ్ లేని ఆమె, టీవీలోని పాటల కార్యక్రమాల్లో, కచేరీల్లో పాటలు పాడుకుంటూ వస్తోంది. అయితే సోషల్ మీడియాలో మాత్రం ఆమె మంచి యాక్టివ్. ఇటీవల హేమచంద్రతో ఆమె విడిపోనున్నదంటూ జోరుగా ప్రచారం సాగింది. అయితే అదంతా వట్టిదేనని ఆ ఇద్దరూ తేల్చేశారు. కాగా ఇప్పుడు అన్నమయ్య సంకీర్తనలకు సంబంధించి వివాదంలో చిక్కుకుంది శ్రావణ భార్గవి.
తొలి తెలుగు వాగ్గేయకారునిగా అన్నమాచార్యులుకు ఉన్న కీర్తి ప్రతిష్ఠలు అసామాన్యమైనవి. స్వయానా తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని తన సంకీర్తనలతో మెప్పించిన మహాగాయకునిగా ఆయనను అభిమానులు కీర్తిస్తూ ఉంటారు. అలాంటి అన్నమయ్య సంకీర్తన విషయంలో శ్రావణ భార్గవి చేసిన వీడియోపై ఆయన వంశస్తులు ఆగ్రహిస్తున్నారు.
శ్రీవారికి అభిషేకం చేస్తూ అన్నమయ్య పెద్ద కుమారుడు పెదతిరుమలాచార్యులు భక్తి పారవశ్యంతో పాడిన కీర్తనను ఆమె రకరకాల భంగిమలతో కాళ్లు ఊపుతూ పాడి, దాన్ని వీడియోగా చిత్రీకరించడంపై అన్నమయ్య వంశానికి చెందిన హరినారాయణాచార్యులు తప్పు పట్టారు. తన అందాన్ని వర్ణించుకోడానికి ఆ కీర్తనను వాడడం సరికాదని అన్నారు. దీని గురించి శ్రావణ భార్గవితో మాట్లాడామనీ, కానీ ఆమె నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చిందనీ ఆయన చెప్పారు. ఈ విసయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారుల దృష్టికి తీసుకు వెళ్తామనీ, అవసరం అయితే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని ఆయన హెచ్చరించారు.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



