సీనియర్ నటుడు చలపతిరావు కన్నుమూత
on Dec 24, 2022

తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ మరణం మరువకముందే మరో సీనియర్ నటుడు చలపతి రావు(78) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ అర్థరాత్రి హైదరాబాద్ లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
చలపతిరావు 1944 మే 8న కృష్ణాజిల్లా పామర్రు మండలంలోని బల్లిపర్రులో జన్మించారు. 'గూఢచారి 116'(1966) చిత్రంతో నటుడిగా వెండితెరకు పరిచయమైన ఆయన.. ఐదు దశాబ్దాలకు పైగా సాగిన సినీ కెరీర్ లో కొన్ని వందల చిత్రాల్లో నటించారు. సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు మూడు తరాల హీరోలతో కలిసి నటించిన ఆయన.. మూడు తరాల ప్రేక్షకులకూ దగ్గరయ్యారు. యమగోల, దాన వీర శూర కర్ణ, నిన్నే పెళ్ళాడతా, నువ్వే కావాలి, ఆది, అల్లరి ఇలా ఎన్నో విజయవంతమైన చిత్రాలలో విభిన్న పాత్రలు పోషించి మెప్పించారు.
అనారోగ్య కారణాలతో ఆయన ఈమధ్య ఎక్కువగా బయటకు రాలేదు. సినిమాలు కూడా పూర్తిగా తగ్గించేశారు. అయితే ఆరోగ్యం సహకరించకపోయినా ఇటీవల కూడా ఒకటి అరా షూటింగ్స్ లో పాల్గొని నటనపై తనకున్న ఇష్టాన్ని చాటుకున్నారు. బంజారాహిల్స్ లో తన కుమారుడు, దర్శకుడు రవిబాబు ఇంట్లో ఉంటున్న ఆయన గుండెపోటుతో మరణించారు. ఆయన కుమార్తె అమెరికా నుండి వచ్చాక అంత్యక్రియలు జరుగుతాయి. ఈరోజు మధ్యాహ్నం వరకు ఆయన భౌతిక కయాన్ని తన కుమారుడు రవి బాబు ఇంట్లోనే అభిమానుల సందర్శన కోసం ఉంచి.. మధ్యాహ్నం 3గంటల నుండి అయన పార్ధివ దేహాన్ని ఫిల్మ్ నగర్ మహా ప్రస్థానం ఫ్రీజర్ లో ఉంచనున్నారు. బుధవారం రోజున మహా ప్రస్థానం లో అంత్యక్రియలు జరుగుతాయి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



