ENGLISH | TELUGU  

పునీత్‌ రాజ్‌కుమార్‌కి అరుదైన గౌరవం.. కన్నడిగులను చూసి నేర్చుకోవాలి!

on Dec 24, 2022

 

ఏ మాట‌కామాట చెప్పుకోవాలి. తెలుగు వారిలో ఐక‌మ‌త్యం లేదు. త‌మ ఆత్మాభిమానానికి తూట్లు ప‌డుతున్నా స‌రే దున్న‌పోతు మీద వాన‌లా మెద‌ల‌కుండా ఉండిపోతారు. మ‌న ప్ర‌ముఖుల‌ను ముందుగా మ‌నం గౌర‌వించుకుని, త‌ద్వారా దేశ‌వ్యాప్త గౌర‌వం కోసం కృషి చేయ‌రు. ప్ర‌తి దానికి అత‌ను ఏ కుల‌స్థుడు, ఏ ప్రాంతానికి చెందిన వాడు.. ఆయ‌న ఏ రాజ‌కీయ పార్టీకి అనుకూలుడు అన్న‌వే ఆలోచిస్తారు. ఈ విషయంలో మ‌నం త‌మిళుల నుంచి, క‌న్న‌డిగుల నుంచి ఎంతో నేర్చుకోవాలి. త‌మిళ‌నాడులో నాటి ఎవ‌ర్‌గ్రీన్ స్టార్‌, న‌టుడి నుంచి ముఖ్య‌మంత్రి పీఠాన్ని అధిరోహించిన ఎంజీఆర్‌కు ప‌ట్టుబ‌ట్టి, అంద‌రు ఏక‌మై కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి ఆయ‌న‌కు భార‌తర‌త్న సాధించుకున్నారు. కానీ మ‌నం మాత్రం ఎంజీఆర్‌కి అన్ని విధాలుగా స‌రితూగే స్వ‌ర్గీయ ఎన్టీఆర్‌కు ఇప్ప‌టి వ‌ర‌కు భార‌తర‌త్న తెచ్చుకోలేక‌పోయాం. 

ఇక జ‌ల్లిక‌ట్టునే తీసుకుంటే మంచైనా చెడైనా స‌రే త‌మ సంప్ర‌దాయం, త‌మ వీర‌త్వానికి గుర్తు అయిన జ‌ల్లిక‌ట్టును నిషేధించాల‌ని నిర్ణ‌యించిన‌ప్పుడు సినీన‌టులు, ప్ర‌జ‌లు త‌మ విభేదాల‌ను మ‌రిచి చేసిన పోరాటం అద్భుతం. అదే ఏపీకి ప్ర‌త్యేక హోదాని పార్ల‌మెంట్ సాక్షిగా నాటి జాతీయ పార్టీలు, నాడు, నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌, బిజెపిలు హామీ ఇచ్చి త‌ర్వాత తుంగ‌లో తొక్కి ప్ర‌త్యేక ప్యాకేజ్ అన్నా స‌రే దానినో రాజ‌కీయ అస్త్రంగా, సెంటిమెంట్ గా ఎన్నిక‌ల‌లో ఓట్ల కోసం వాడుకుంటున్నారే గానీ దానిపై నోరెత్తి కేంద్రాన్ని ఒప్పించ‌లేక‌పోతున్నారు.

అదే క‌ర్ణాట‌క విష‌యానికి వ‌స్తే త‌మ సొంత భాషా చిత్రాల‌కు న‌ష్టం క‌లుగుతోంద‌ని అక్క‌డి సినీన‌టులు, ప్ర‌జ‌లు త‌మ ఉనికిని కాపాడుకోవ‌డం కోసం అంద‌రు కలిసి రోడ్డెక్కారు. డ‌బ్బింగ్ చిత్రాల‌కు థియేట‌ర్లు ఇవ్వ‌కూడ‌ద‌ని ఉద్య‌మం చేశారు. క‌న్న‌డ కంఠీర‌వ రాజ్‌కుమార్ సైతం రోడ్ల మీద‌కు వ‌చ్చి ఉద్య‌మంలో పాల్గొన్నారు. విచిత్రం ఏమిటంటే తెలుగు చిత్రాల ద్వారా క్రేజ్‌, డ‌బ్బు తెచ్చుకుంటున్న హీరోయిన్ ప్రేమ వంటి వారు కూడా ఉద్య‌మంలో పాల్గొన్నారు. ఇదే ఉద్య‌మం జ‌రిగే స‌మ‌యంలో ప్రేమ‌కు ప‌లు తెలుగు కొత్త చిత్రాల‌లో సిగ్గు లేకుండా అవ‌కాశం ఇచ్చారు. క‌న్న‌డ ఉద్యమానికి వ్య‌తిరేకంగా ఏదో 'మా' అధ్య‌క్షుడి హోదాలో ఉన్న మోహ‌న్ బాబు తూతూ మంత్రంగా ఓ ప్రెస్ మీట్ పెట్టారు. దానికి రాజ్‌కుమార్ స‌మ‌కాలీకుడైన ఏయ‌న్నార్ నోరు విప్ప‌లేదు. క‌నీసం ప్రెస్‌మీట్ పెట్టడం గానీ, మీడియా స్టేట్మెంట్ గానీ ఇవ్వ‌లేదు. నేడు క‌న్న‌డిగులు కేజీఎఫ్ కంటే కాంతార‌ను చూసి గ‌ర్వ‌ప‌డుతున్నారంటే అది త‌మ సంప్ర‌దాయానికి సంబంధించిన‌ది కావ‌డ‌మే. ఇక మ‌న మ‌హామ‌హుల చ‌రిత్ర‌ను మ‌న భావిత‌రం తెలుసుకునే అవ‌కాశ‌మే లేదు. 

విష‌యానికి వ‌స్తే.. దివంగత స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ కి అరుదైన గౌరవం లభించింది.  పునీత్‌ రాజకుమార్ కేవలం నటుడిగా మాత్రమే కాకుండా ఒక మానవతా వాదిగా ఎన్నో సామాజిక కార్యక్రమాలను చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇలా కన్నడ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో గొప్ప నటుడిగా ఎంతో పేరు సంపాదించుకున్న పునీత్ గత ఏడాది అక్టోబర్ నెలలో ఆకస్మిక మ‌ర‌ణం పొందిన సంగతి తెలిసిందే. తీవ్రమైన గుండెపోటుకు  గురైనటువంటి పునీత్ అర్ధాంతరంగా చనిపోవడాన్ని ఇప్పటికీ ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఆయన మరణాంతరం పునీత్ రాజ్ కుమార్ కు ఎన్నో గౌర‌వాలు లభించాయి. కొద్ది రోజుల క్రితం ఆయనకు కర్ణాటక రత్న అవార్డుతో కర్ణాటక ప్రభుత్వం సత్కరించింది. 

తాజాగా పునీత్‌కు మరొక అరుదైన గౌరవం లభించింది. పునీత్ మరణించిన తర్వాత ఆయన జీవిత చరిత్రను ఒక పాఠ్యాంశంగా చేర్చాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈయన నటుడిగా మాత్రమే కాకుండా ఎంతో మందికి సహాయ సహకారాలు చేసినటువంటి ఓ గొప్ప మానవతావాది.. ఇలాంటి గొప్ప వ్యక్తి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని పలువురు కోరుతున్నారు. ఈ క్రమంలోనే బెంగుళూరు యూనివర్సిటీ బీకాం సిలబస్ లోని వాణిజ్య కన్నడ త్రి అనే పాఠ్య పుస్తకంలో ఆయన జీవిత చరిత్రను ఒక పాఠ్యాంశంగా చేర్చింది. ఇలా డిగ్రీ మూడో సెమిస్టర్ విద్యార్థులు పునీత్‌ రాజ్ కుమార్ కు సంబంధించిన మరికొన్ని విషయాలను పాఠ్యాంశంగా చదువుకోనుండ‌టంతో  ఆయన అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇది నిజంగానే పునీత్ కు దక్కిన అరుదైన గౌరవం అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.