'తిమ్మరుసు'ను చూడ్డానికి రమ్మంటూ దేవి థియేటర్ దగ్గర హీరో సత్యదేవ్!
on Jul 29, 2021

సత్యదేవ్ హీరోగా నటించిన 'తిమ్మరుసు' మూవీ జూలై 30 (శుక్రవారం) థియేటర్లలో విడుదలవుతోంది. థియేటర్లు తెరుచుకోవచ్చని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు చాలా రోజుల క్రితమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా, ఇంతదాకా పలు థియేటర్లు తెరుచుకొనే లేదు. రేపు 'తిమ్మరుసు'తో పాటు, తేజ సజ్జా హీరోగా నటించిన 'ఇష్క్' సినిమా కూడా రిలీజవుతోంది. వీటితో థియేటర్లను ఓపెన్ చేయడానికి ఎగ్జిబిటర్లు రెడీ అవుతున్నారు. అయితే సినిమా హాళ్లకు వచ్చి సినిమాలను చూసే మూడ్ ప్రస్తుతం జనానికి ఉందా అనే సందేహం చాలా మందిని వెన్నాడుతోంది.
దీంతో థియేటర్లకు వచ్చి సినిమాను చూడమని హీరోలే ప్రేక్షకుల్ని కోరుతున్నారు. 'తిమ్మరుసు' సినిమాతో రేపు హైదరాబాద్‌లోని అతిపెద్ద సింగిల్ స్క్రీన్ థియేటర్ అయిన దేవి 70 ఎంఎం రి-ఓపెన్ అవుతోంది. ఈ సందర్భంగా ఆ థియేటర్‌కు వెళ్లి, తన సినిమా పోస్టర్ పక్కన కూర్చొని ఫొటో దిగిన హీరో సత్యదేవ్.. ఆ ఫొటోను తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసి, థియేటర్‌కు వచ్చి తమ సినిమా చూడమని ప్రేక్షకులకు పిలుపునిస్తున్నాడు.
'బ్లఫ్ మాస్టర్', 'ఉమామహేశ్వరాయ ఉగ్రరూపస్య' వంటి వైవిధ్యమైన చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్న సత్యదేవ్ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం 'తిమ్మరుసు'. ఈస్ట్‌కోస్ట్ ప్రొడక్షన్స్, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్స్‌పై మహేశ్ కోనేరు, సృజన్ ఎరబోలు ఈ చిత్రాన్ని నిర్మించారు. శరణ్ కొప్పి శెట్టి దర్శకుడు.
బుధవారం జరిగిన ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌లో హీరో సత్యదేవ్ మాట్లాడుతూ, "ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఓపెన్ యూనివర్సిటీ. ఇక్కడ క్వాలిఫికేషన్స్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్, మార్కులు ఏమీ ఉండవు. ప్యాషన్ అనే క్వాలిఫికేషన్‌తో రావాలి. 99 మంది మనకు ఇండస్ట్రీ గురించి ఎన్నో చెబుతారు. కానీ ఒకరు మాత్రమే ఏం కాదు.. ముందుకెళ్లు అని చెబుతాడు. ఆ ఒకరెవరో కాదు.. మనకు మనమే. ఎంటైర్ వరల్డ్‌లో.. కోవిడ్ ఫస్ట్ వేవ్ తర్వాత థియేటర్స్‌లో వచ్చిన సినిమాలన్నీ హిట్ కావడం మన తెలుగు ఇండస్ట్రీలోనే సాధ్యమైంది. తెలుగు ప్రేక్షకులు మంచి సినిమాను ఎంకరేజ్ చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. అది చాలా సార్లు ప్రూవ్ అయ్యింది. ఇప్పుడు సెకండ్ వేవ్ తర్వాత మొదటగా వస్తున్న సినిమా మా 'తిమ్మరుసు'. శరణ్ కొప్పిశెట్టి ఎప్పుడూ చాలా కూల్‌గానే కనపడతాడు. తను 'తిమ్మరుసు'ను అద్భుతంగా చేశాడు. శ్రీచరణ్ పాకాల.. ఫాస్టెస్, సిన్సియర్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాకు చాలా చక్కగా మ్యూజిక్ అందించాడు. నేషనల్ అవార్డ్ విన్నర్ అప్పూ ప్రభాకర్ ఈ సినిమాకు వర్క్ చేశాడు. కంఫర్ట్ జోన్ దాటి ఈ సినిమాలో ఫైట్స్ చేశాను. 39 రోజుల్లో సినిమా పూర్తయ్యింది. సెకండ్ వేవ్‌లో ముందుగా వస్తోన్న ఈ సినిమాను ఆదరించి సపోర్ట్ చేయాలని ప్రేక్షకులకు కోరుకుంటున్నాను." అని చెప్పాడు.
సత్యదేవ్ సరసన నాయికగా 'టాక్సీవాలా' ఫేమ్ ప్రియాంక జవాల్కర్ నటించిన ఈ మూవీలో బ్రహ్మాజీ, అజయ్, ప్రవీణ్, ఆదర్శ్ బాలకృష్ణ, ఝాన్సీ, వైవా హర్ష, సంధ్యా జనక్ తదితరులు ఇతర కీలక పాత్రధారులు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



