‘పోకిరి’ డేట్‌కే ‘సర్కారు వారి పాట’?
on Jun 4, 2020

‘పోకిరి’.. ప్రిన్స్ మహేశ్ బాబుని కాస్తా సూపర్ స్టార్ మహేశ్ బాబుగా మార్చిన సినిమా. “ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా బుల్లెట్ దిగిందా లేదా?”, “ఎవడు కొడితే మైండ్ బ్లాక్ అవుద్దో ఆడే పండుగాడు”, “ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను”.. ఇలా సెన్సేషనల్ పంచ్ డైలాగ్స్‌తో బాక్సాఫీస్ వద్ద సరికొత్త బెంచ్ మార్క్‌ని క్రియేట్ చేసిన సినిమా ఇది. మహేశ్ బాబు, ‘ఇస్మార్ట్’ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఫస్ట్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ‘ఇండస్ట్రీ హిట్’గా నమోదయింది. అలాంటి ‘పోకిరి’ విడుదలైన ఏప్రిల్ 28.. మహేశ్‌కి, అతని అభిమానులకి ఎంతో ప్రత్యేకమైన రోజు. అయితే అంతటి స్పెషల్ డేట్‌కి మహేశ్ నుంచి మరో సినిమా రిలీజ్ కానేలేదు. కాగా, త్వరలోనే ఆ ముచ్చట తీరనుందని టాలీవుడ్ టాక్.
ఆ వివరాల్లోకి వెళితే.. బ్లాక్‌బస్టర్ మూవీ ‘గీత గోవిందం’ తరువాత టాలెంటెడ్ డైరెక్టర్ పరశురామ్ దాదాపు రెండేళ్ళ విరామం అనంతరం మెగా ఫోన్ పట్టి.. సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో రూపొందిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌కి వెళ్లనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. వచ్చే ఏడాది వేసవిలో థియేటర్లలో సందడి చేయనుందని సమాచారం. అంతేకాదు.. అన్నీ కుదిరితే ‘పోకిరి’ రిలీజ్ డేట్ అయిన ఏప్రిల్ 28న ఈ సినిమాని విడుదల చేసే దిశగా చిత్ర నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్ చేస్తున్నాయని వినికిడి. అదే గనక నిజమైతే.. గురువు పూరీ జగన్నాథ్ లక్కీ డేట్‌కి శిష్యుడు పరశురామ్ అదే మహేశ్ బాబు కాంబినేషన్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నట్టే.
మరి.. పూరి, మహేశ్ ఫస్ట్ కాంబినేషన్ ఫిలిమ్ ‘పోకిరి’ ఏప్రిల్ 28న రిలీజై ఎలాగైతే సెన్సేషన్ క్రియేట్ చేసిందో.. పూరి శిష్యుడు పరశురామ్ – మహేశ్ ఫస్ట్ కాంబినేషన్‌లో రాబోతున్న ‘సర్కారు వారి పాట’ కూడా అదే బాట పడుతుందేమో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



