ENGLISH | TELUGU  

సంక్రాంతి సినిమాలకు పెద్ద గండం పొంచి ఉందా?

on Dec 26, 2022

టాలీవుడ్ ప్రేక్షకులకు, సినీ పరిశ్రమకు సంక్రాంతి అంటే అదో పెద్ద  క్రేజ్. ఈ పండుగ సీజన్లో భారీ చిత్రాలు రిలీజ్‌కు సిద్ద‌మై ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు సిద్దంగా  ఉంటాయి. ప్రేక్షకులు కూడా పండగ మూడ్ లో ఉంటారు. ఈ మూడ్‌ను  సెలబ్రేట్ చేసుకోవడం కోసం వారు  దియేటర్లకు క్యూ కడతారు. సాధారణంగా రెండు మూడు సినిమాలు ఒకేసారి విడుదలయితేనే లబోదిబో మంటారు. సరైన కలెక్షన్స్, థియేటర్స్ లేవంటారు. కానీ సంక్రాంతి పండుగకు అలా కాదు. ఈ పండుగకు ఏ విధంగా చూసుకున్నా నాలుగైదు సినిమాలను సంతృప్తి ప‌రిచే సత్తా ఉంటుంది.  తెలుగులో సంక్రాంతి ఎలాగో తమిళ్లో ఆ పండుగను పొంగల్ గా జరుపుకుంటారు. అక్కడ కూడా అంతే. తెలుగులో చూసుకుంటే సంక్రాంతి ఆ తర్వాత దసరా, వేసవి సెలవులనేవి చాలా ముఖ్యంగా సినీ ప్రియులు భావిస్తారు. ఇక విషయానికి వస్తే ఈ ఏడాది అంటే 2022 సంక్రాంతి సీజన్ లో భారీ చిత్రాలు పోటీ పడాలని భావించాయి. కానీ ఆయా చిత్రాలు కరోనా వలన వెనక్కి వెళ్లిపోయాయి. వాస్త‌వానికి  గత మూడు కరోనా వేవ్‌ల‌ సందర్భంలోనూ తెలుగు సినీ పరిశ్రమ బాగా కష్టాలను చవిచూసింది.

ఒక సినిమా విడుద‌ల ఆగిపోయిందంటే ఆ సినిమాకు పెట్టుబడి పెట్టే నిర్మాత నానా ఇబ్బందులు పడతాడు. తన సొంత డబ్బు తో పాటు  ఫైనాన్షియ‌ర్ల  దగ్గర తీసుకున్న పెట్టుబడికి వడ్డీలు విపరీతంగా పెరిగిపోతాయి. ఆ ఎఫెక్ట్ నిర్మాత, దర్శకుడు, హీరో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల  నుంచి లైట్ బాయ్‌ వరకు పడుతుంది. ఇంకా  ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ధియేట‌ర్ల‌లో  పనిచేసే సిబ్బంది, స్కూటర్, సైకిల్, కార్ స్టాండ్ ల వారు, తినుబండాలను అమ్ముకునే క్యాంటీన్ వాళ్ళు కూడా  ఇబ్బంది పడతారు. సినిమాలు ఆగిపోవ‌డం మూలంగా ఎంద‌రో దానిపై ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ఆధార‌ప‌డి జీవించే వారి జీవితాలు అత‌లాకుత‌లం అయిపోతాయి. 

2022లో సంక్రాంతికి రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఆశ ఎన్‌కౌంట‌ర్‌,  వ‌రుణ్‌సందేశ్ న‌టించిన ఇందువ‌న‌,  రానా దగ్గుబాటి నటించిన 1945, విజయ్ రాజా హీరోగా నటించిన వేయి శుభములు కలుగు గాక, ఆది సాయికుమార్ నటించిన అతిథిదేవోభవ, కళ్యాణ్ దేవ్ హీరోగా నటించిన సూపర్ మచ్చి, అశోక్‌ గల్లా నటించిన హీరో, కీర్తి సురేష్, ఆది పినిశెట్టి కలిసి నటించిన గుడ్ లక్ సఖి... వంటి చిన్న చిన్న చిత్రాలు విడ‌ద‌ల‌య్యాయి. ఇవేమీ పెద్దగా క్రేజ్‌ ఉన్న సినిమాలు కావు. ఉన్న వాటిల్లో కాస్త నాగార్జున- అక్కినేని నాగచైతన్యాలు కలిసిన నటించగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో సోగ్గాడే చిన్నినాయన కు సీక్వెల్‌ గా వచ్చిన బంగార్రాజు  మాత్రమే ప్రేక్షకులను ఆకర్షించింది.

ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికీ ఈ ఏడాది సంక్రాంతి చాలా చ‌ప్ప‌గానే  సాగింది. కానీ వచ్చే ఏడాది అంటే 2023 సంక్రాంతికి భారీ చిత్రాలు బరిలో నిలుస్తున్నాయి. దీంతో బాక్సాఫీస్ వద్ద థియేటర్ల విషయంలో పోటీ మామూలుగా లేదు. ఈసారి సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ నటించిన వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి ఒక్కరోజు గ్యాప్‌లో అంటే జనవరి 12, 13 తారీకుల్లో విడుదల కానున్నాయి. ఈ రెండు సినిమాలపై మంచి బ‌జ్ ఏర్పడి ఉంది. వీటితో పాటు తమిళ్ హీరో ద‌ళ‌ప‌తి విజయ్ నటిస్తున్న దిల్ రాజు చిత్రం వారసుడు, బోనీకపూర్ కోలీవుడ్ లో అజిత్ హీరోగా నిర్మిస్తున్న తునీవు చిత్రం తెగింపుగా రాబోతున్నాయి.

ఇక సంతోష్‌శోభ‌న్  వంటి యంగ్ హీరో నటిస్తున్న కళ్యాణం కమనీయం సినిమా జనవరి 14న రిలీజ్ కు రెడీ అవుతోంది. అంతా బాగానే ఉంది. కానీ ఈ సంక్రాంతికి సరికొత్త భయం మరలా మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా మరలా కరోనా కోరలు చాస్తోంది. పొంగల్ సినిమాలకు డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. కేంద్రం ఇప్పటికే మాస్కులు, భౌతిక దూరం పాటించండి అని ప్రకటనలు చేస్తోంది. ఆక్సిజన్ కొరత రాకుండా చర్యలు తీసుకోవాలని ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖకు ఆదేశించింది. దీంతో రాష్ట్ర‌ప్ర‌భుత్వాలు కూడా అప్ర‌మ‌త్తం అయ్యాయి. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ సైతం ప‌లు హెచ్చ‌రిక‌లు జారీ చేస్తోంది.  మరి ఇలాంటి ప‌రిస్థితుల్లో  సంక్రాంతి సినిమాల పరిస్థితి ఏంటి? అనే  అనుమానాలు మొదలయ్యాయి. అయితే మన దేశంలో మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలలో పెద్దగా కరోనా కేసులు నమోదు కావడం లేదు. బిఎఫ్ 7 అనే కొత్త వేరియంట్ ప్రస్తుతం ప్రమాదకరంగా మారింది. అయితే వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డిలపై కరోనా ఎఫెక్ట్ ఉండే అవకాశం లేదని అంటున్నారు. ఈ రెండు సినిమాలు కరోనా గండాన్ని అధిగమించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ రెండు సినిమాల బడ్జెట్ దాదాపు 250 కోట్లుగా తెలుస్తోంది. ఈ రెండు చిత్రాలను ఒకే నిర్మాణ సంస్థ అయిన‌ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించడం విశేషం. 

ఈ సినిమాల శాటిలైట్, డిజిటల్ హక్కులకు కూడా భారీ స్థాయిలో డిమాండ్ నెల‌కొని  ఉంది. ఈ రెండు చిత్రాలు రికార్డు స్థాయి థియేటర్లో విడుదలవుతున్నాయి. ఈ సినిమా ట్రైలర్లు కూడా జనవరి మొదటి వారంలో విడుదల కానున్నాయి. ఈ రెండు సినిమాలు సక్సెస్ సాధించాలని చిరంజీవి, బాలయ్య అభిమానులు కోరుకుంటున్నారు. ఈ రెండు చిత్రాల‌తో వీరు  మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేస్తున్నారు. అదే సమయంలో కరోనా ఎఫెక్ట్ మన రెండు తెలుగు రాష్ట్రాల మీద పెద్ద‌గా ఉండ‌క‌పోయినా  ప్రపంచంలో మాత్రం పలు దేశాలలో కరోనా ఫోర్త్ వేవ్ ఉగ్రరూపం చూపిస్తోంది. కరోనా బాధితుల‌తో  హాస్పిటళ్లు  నిండిపోతున్నాయి. మరణించిన వారి శవాలు గుట్టలు గుట్టలుగా పడుతున్నాయి. దాంతో మన దగ్గర పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చు కానీ ఓవర్సీస్ లో ఏమైనా గట్టి ఎఫెక్ట్ ఉంటుందా?  అనే  చర్చ సాగుతోంది. వాస్త‌వానికి కరోనా అనేది మన సినీ పరిశ్రమలో ఎన్నో కొత్త మార్పులకు నాంది పలికింది. కరోనా కారణంగానే మన తెలుగు సినిమాల‌కు  ఓటిటీ ప్రభావం ఎక్కువయింది. నాడు ప్రారంభమైన ఓటీటీ ప్ర‌భంజ‌నం  ఇప్పటికీ తనంతాను విస్తరించుకుంటూ పోతోంది.  కరోనా ప్రభావం వల్ల జనాలు థియేటర్లకు రాకపోవడం, థియేటర్లు కూడా  మూతపడటంతో ఓటీటీని చూసేవారు అధికమయ్యారు. మరి రాబోయే కాలంలో మ‌రిన్ని మార్పులు సంభ‌వించే అవ‌కాశం ఉంద‌ని సినీ విశ్లేష‌కులు భావిస్తున్నారు. మ‌రి క‌రోనా ఫోర్త్ వేవ్  విజృంభిస్తే ఈసారి టాలీవుడ్‌లో మ‌రెన్ని నూత‌న ప‌రిణామాలు చోటుచేసుకుంటాయో వేచిచూడాల్సి వుంది.!

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.