`ఆచార్య`లో సంగీత పాత్ర ఏంటంటే..!
on Jun 21, 2021
``ఒక్క ఛాన్స్..`` అంటూ `ఖడ్గం`లో సీతామహాలక్ష్మిగా మురిపించి.. కెరీర్ లో తొలి బ్రేక్ అందుకుంది సంగీత. అప్పటికే కొన్ని చిత్రాల్లో నటించినా రాని గుర్తింపు ఈ సినిమాతో సొంతం చేసుకుంది ఈ టాలెంటెడ్ యాక్ట్రస్. ఆపై `పెళ్ళాం ఊరెళితే`, `నా ఊపిరి`, `శివపుత్రుడు` (తమిళ్ డబ్బింగ్) చిత్రాలతో నటిగా మంచి మార్కులు సంపాదించుకుంది. పెళ్ళయ్యాక సినిమాలను తగ్గించుకున్న సంగీత.. `సరిలేరు నీకెవ్వరు`తో తెలుగునాట రి-ఎంట్రీ ఇచ్చింది. త్వరలో మెగాస్టార్ చిరంజీవి `ఆచార్య`లో ``లాహే లాహే`` అంటూ సందడి చేయబోతోంది.
ఇదిలా ఉంటే.. `ఆచార్య`లో సంగీత పాత్రకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అదేమిటంటే.. ఇందులో ఆమె నర్తకి పాత్రలో దర్శనమివ్వనుందని.. ఎమోషనల్ గా సాగే ఈ క్యారెక్టర్ ఇంట్రవెల్ ఎపిసోడ్ లో చనిపోతుందని సమాచారం. ఈ సీన్ తరువాతే మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ఎంట్రీ ఉంటుందని టాక్. మరి.. ఈ ప్రచారంలో నిజమెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే. చిత్రీకరణ తుదిదశకు చేరుకున్న `ఆచార్య`.. త్వరలో పునః ప్రారంభం కానుంది.
కాగా, `ఆచార్య`కి కొరటాల శివ దర్శకత్వం వహిస్తుండగా.. చిరుకి జంటగా కాజల్, చరణ్ జోడీగా పూజా హెగ్డే నటిస్తున్నారు. రెజీనా ఓ ప్రత్యేక గీతంలో మెరవనుంది. మెలోడీబ్రహ్మ మణిశర్మ ఈ సోషల్ డ్రామాకి బాణీలు అందిస్తున్నారు.