`తుపాకి` సీక్వెల్ లో కమల్ హాసన్?
on Jun 21, 2021
కోలీవుడ్ స్టార్ విజయ్ కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచే సినిమాల్లో `తుపాకి` ఒకటి. పాన్ - ఇండియా డైరెక్టర్ ఎ.ఆర్. మురుగదాస్ రూపొందించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ తోనే.. తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు విజయ్. అలాంటి.. `తుపాకి`కి కొనసాగింపు చిత్రం చేయాలన్నది మురుగదాస్ ఆలోచన. వాస్తవానికి ఈ సీక్వెల్ ని విజయ్ తోనే చేయాలని `గజిని` కెప్టెన్ భావించారు. అయితే, ప్రస్తుతం విజయ్ చేతిలో రెండు సినిమాలు ఉండడంతో.. మురుగదాస్ మరో ఐడియాలో ఉన్నారట.
అదేమిటంటే.. ఇదే సీక్వెల్ ని లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్ లో తీర్చిదిద్దే దిశగా ప్రణాళిక రచిస్తున్నారట. అంతేకాదు.. కమల్ ఏజ్, ఇమేజ్ కి తగ్గట్టుగా `తుపాకి` కొనసాగింపు చిత్రాన్ని రూపొందించే కోణంలో ప్లాన్ చేస్తున్నారట మురుగదాస్. త్వరలోనే `తుపాకి` సీక్వెల్ పై క్లారిటీ వచ్చే అవకాశముంది. మరి.. కమల్ - ఎ.ఆర్. మురుగదాస్ ఫస్ట్ కాంబినేషన్ మూవీ ఏ స్థాయిలో రంజింపజేస్తుందో చూడాలి.
కాగా, ప్రస్తుతం కమల్ హాసన్ చేతిలో `విక్రమ్` ఉంది. `ఖైదీ`, `మాస్టర్` చిత్రాల దర్శకుడు లోకేశ్ కనకరాజ్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని రూపొందిస్తున్నాడు. ఈ ఏడాది దీపావళికి లేదా వచ్చే సంవత్సరం పొంగల్ కి ఈ సినిమాని రిలీజ్ చేయాలని లోకేశ్ ప్లాన్ చేస్తున్నారట.