'బాబా'లో రజనీ యోగా పాఠాలు!
on Jun 21, 2021
సాధారణంగా టాలీవుడ్లో కానీ, బాలీవుడ్లో కానీ హీరోలు, హీరోయిన్లు జిమ్‌కు వెళ్లకుండా ఒక్కరోజు కూడా ఉండలేరు. హీరోలు కండలు పెంచడానికి, హీరోయిన్లు స్లిమ్‌గా, అందంగా కనిపించడానికి జిమ్‌లకు వెళ్తుంటారు. కానీ టాలీవుడ్లో అనుష్క, బాలీవుడ్లో శిల్పాశెట్టి మాత్రం యోగాతోనే అంతా మేనేజ్ చేసేస్తుంటారు. శిల్పాశెట్టి, కరీనా కపూర్ లాంటి వాళ్లు చేసేది పవర్ యోగా. మరేవిధమైన యోగా కంటే కూడా చాలా తక్కువ సమయంలో ఎక్కువగా శరీర బరువు తగ్గించుకోడానికి పవర్ యోగా ఉపయోగపడుతుందనేది వాళ్లు చెప్పే మాట.
శిల్పాశెట్టి అయితే కేవలం యోగా చేయడమే కాక, నేర్పిస్తుంది కూడా. ఆమె యోగా సీడీలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. పవర్ యోగా చేయడం వల్ల ఇటు శరీరం మీద, అటు మనసు మీద కూడా మంచి నియంత్రణ వస్తుందని ఆమె చెబుతారు. ఇది చేయడం వల్లే తన వయసు ఎంతన్నది ఎవరూ చెప్పలేకపోతున్నారని శిల్పాశెట్టి అంటారు. బరువు తగ్గడం, రక్తప్రసరణ మెరుగుపడటం, శరీరంలోని విషపదార్థాలు తొలగిపోవడం, పలు రకాల వ్యాధులు సహజ పద్ధతిలో తగ్గడం, ఏకాగ్రత పెరగడం, రోగనిరోధక వ్యవస్థ బలోపేతం కావడం, ఒత్తిడి తగ్గడం లాంటి అనేక ఉపయోగాలు కూడా శిల్పాశెట్టి చెప్పే పవర్ యోగా వల్ల వస్తాయంటున్నారు.
ఇక అనారోగ్య కారణాల రీత్యా రాజకీయాల్లోకి రాలేనని తేల్చేసిన సూపర్‌స్టార్ రజనీకాంత్, తన వార్షిక చెకప్ కోసం అమెరికా బయలుదేరి వెళ్లారు. మూత్రపిండాల మార్పిడి శస్త్ర చికిత్స చేసుకున్నప్పట్నుంచీ ఆయన ప్రతి ఏటా ఈ చెకప్ చేసుకుంటున్నారు. ఆయనకూ, యోగాకూ అవినాభావ సంబంధం ఉంది. మెడిటేషన్ ప్రాక్టీస్ చేసే ఆయన 'బాబా' సినిమాలో భారతీయ మహిళలు.. అందునా దక్షిణాది మహిళలు చేసే కొన్ని పనులకు, వాటిలో ఇమిడి ఉన్న యోగాసనాలకు గట సంబంధం గురించి వివరంగా చెబుతారు.
"వాకిలి చిమ్మి, వంగొని ముగ్గు వేయడం కూర్మాసన ఉద్ఘటాసనం. అది వెన్నెముకకు మంచిది. బట్టలు ఉతికి, పిండి ఆరేయడం అర్ధ ఉద్ధారాసనం. అది చేతివేళ్లకు, నరాలకు మంచిది. నీళ్లబిందె చంకన పెట్టుకొని నడవడం తాడాసనం. నడుముకు మంచిది. మోకాళ్ల మీద కూర్చుని నమస్కారం చేయడం అస్థినిషితం." అని ఆయన వివరిస్తారు.