శోభన్ బాబు `సంపూర్ణ రామాయణము`కి 50 ఏళ్ళు!
on Mar 16, 2022
.webp)
తెలుగునాట శ్రీరాముడి పాత్రని ధరించి అమితంగా ఆకట్టుకున్న కథానాయకుల్లో నటభూషణ శోభన్ బాబు ఒకరు. దిగ్గజ దర్శకులు బాపు కాంబినేషన్ లో శోభన్ శ్రీరాముడిగా నటించిన `సంపూర్ణ రామాయణము`(1972).. అప్పట్లో విశేషాదరణ పొందింది. అంతకుముందు బాపు దర్శకత్వం వహించిన `బుద్ధిమంతుడు` (1969)లో శ్రీకృష్ణుడిగా ఆకట్టుకున్న శోభన్ బాబు.. అదే బాపు రూపొందించిన `సంపూర్ణ రామాయణము`లో శ్రీరాముడిగానూ అలరించడం విశేషం. అంతేకాదు.. బాపు తొలిసారిగా తెరకెక్కించిన పూర్తి స్థాయి పౌరాణిక చిత్రమిదే కావడం మరో విశేషం. వాల్మీకి రామాయణం ఆధారంగా రూపొందిన `సంపూర్ణ రామాయణము`ని.. శ్రీరామని జననం నుండి అజ్ఞాతవాసానంతరం పట్టాభిషేకం వరకు సాగే పలు రసవత్తర ఘట్టాలతో ఆద్యంతం ఆసక్తికరంగా తీర్చిదిద్దారు బాపు. ఆరుద్ర, ముళ్ళపూడి వెంకట రమణ సంభాషణలు ఈ చిత్రానికి అదనపు ఆకర్షణగా నిలిచాయి.
సీతగా చంద్రకళ నటించిన ఈ సినిమాలో రావణుడిగా ఎస్వీ రంగారావు, లక్ష్మణుడిగా నాగరాజు, ఆంజనేయుడిగా ఆర్జా జనార్ధన్ రావు, భరతుడిగా చంద్రమోహన్, దశరథుడిగా గుమ్మడి, కైకేయిగా జమున, మండోదరిగా కృష్ణ కుమారి, వశిష్ఠుడిగా చిత్తూరు వి. నాగయ్య, మేఘనాథుడిగా కైకాల సత్యనారాయణ, మంధరగా ఛాయాదేవి, విభీషణునిగా దూళిపాళ, పరశురాముడిగా ముక్కామల, కౌసల్యగా హేమలత, శబరిగా పండరీబాయి అభినయించారు.
స్వరబ్రహ్మ కేవీ మహదేవన్ సంగీతసారథ్యంలో రూపొందిన పాటలన్నీ ప్రజాదరణ పొందాయి. మరీముఖ్యంగా.. ``రామయ తండ్రి ఓ రామయ తండ్రి``, ``రామ లాలి మేఘశ్యామ లాలి`` గీతాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. నిడమర్తి పద్మాక్షి నిర్మించిన `సంపూర్ణ రామయాణము`.. 1972 మార్చి 16న విడుదలై 10 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. నేటితో ఈ క్లాసిక్ 50 వసంతాలు పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



