రామ్ `జగడం`కి 15 ఏళ్ళు!
on Mar 16, 2022

ఈ తరం దర్శకుల్లో బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ తీరే వేరు. విభిన్న కథాంశాలతో సినిమాలను రూపొందించడంలో తనకు తానే సాటి. అలా.. సుక్కు తెరకెక్కించిన డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ లో `జగడం` ఒకటి. ``చిన్నప్పటి నుంచి ఫైట్స్ ని అమితంగా ఇష్టపడే శ్రీను (రామ్ పోతినేని).. పెద్దయ్యాక గూండాగా ఎదగాలనుకుంటాడు. ఈ క్రమంలో అతనికి ఎదురయ్యే అనుభవాలేంటి?`` అనే పాయింట్ చుట్టూ అల్లుకున్న చిత్రమే `జగడం`. ఇందులో శ్రీనుగా తనదైన అభినయంతో ఆకట్టుకున్నాడు రామ్. `ఆర్య` (2004) వంటి బ్లాక్ బస్టర్ తరువాత సుకుమార్ దర్శకత్వం వహించిన సినిమా, `దేవదాసు` (2006) వంటి సంచలన విజయం అనంతరం రామ్ హీరోగా రూపొందిన చిత్రం.. `జగడం`నే కావడం విశేషం.
రామ్ కి జంటగా ఇషా సహాని నటించిన ఈ సినిమాలో ప్రదీప్ రావత్, ఎ.ఎస్. రవికుమార్ చౌదరి, సత్య ప్రకాశ్, రఘు బాబు, శరణ్య, నల్ల వేణు, ధన్ రాజ్, తాగుబోతు రమేశ్, చిత్రం శ్రీను, తనికెళ్ళ భరణి, నర్సింగ్ యాదవ్, తెలంగాణ శకుంతల, వేణుమాధవ్, పృథ్వీరాజ్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించగా.. ప్రకాశ్ రాజ్ అతిథి వేషంలో దర్శనమిచ్చారు.
రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ పాటలు, నేపథ్య సంగీతం `జగడం`కి ప్రధాన బలంగా నిలిచాయి. ``36 - 24 - 36`,, `` 5 ఫీట్ 8 ఇంచెస్``, ``వయోలెన్స్ ఈజ్ ఎ ఫ్యాషన్``, ఎవ్రీబడి రాక్ యువర్ బాడీ``, ``ము ము ముద్దంటే చేదా``.. ఇలా ఇందులోని పాటలన్నీ యువతరాన్ని ఉర్రూతలూగించాయి. ఆదిత్య బాబు నిర్మించిన `జగడం`కి ఆర్. రత్నవేలు ఛాయాగ్రహణం ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 2007 మార్చి 16న విడుదలై ఓ వర్గం ప్రేక్షకులను భలేగా ఆకట్టుకున్న `జగడం`.. నేటితో 15 వసంతాలు పూర్తిచేసుకుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



