'సామాన్యుడు' మూవీ రివ్యూ
on Feb 4, 2022

సినిమా పేరు: సామాన్యుడు
తారాగణం: విశాల్, డింపుల్ హయాతి, యోగిబాబు, బాబూరాజ్ జాకబ్, తులసి, రవీనా రవి, ఆర్.ఎన్.ఆర్. మనోహర్
సంగీతం: యువన్ శంకర్ రాజా
సినిమాటోగ్రఫీ: కెవిన్ రాజ్
ఎడిటింగ్: ఎన్.బి. శ్రీకాంత్
ఆర్ట్: ఎస్.ఎస్. మూర్తి
నిర్మాత: విశాల్
దర్శకత్వం: శరవణన్
బ్యానర్: విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ
విడుదల తేదీ: 4 ఫిబ్రవరి 2022
యాక్షన్ హీరోగా తమిళ్ తో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న విశాల్ గతేడాది నవంబర్ 4 న 'ఎనిమి' సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఆ సినిమాతో అంతగా ఆకట్టుకోలేక పోయిన విశాల్ సరిగ్గా మూడు నెలలకు నేడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అదే 'సామాన్యుడు'. శరవణన్ ఈ మూవీతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. పాండెమిక్ కారణంగా ఆలస్యమైన ఈ సినిమా నేడు విడుదలైంది. మరి ఈ సినిమా ఏ మేరకు అలరించిందో చూద్దాం.
కథ:
ఒక సాధారణ హెడ్ కానిస్టేబుల్ కొడుకు అయిన పోరస్(విశాల్) పోలీస్ ఆఫీసర్ అవ్వాలని కలలు కంటుంటాడు. సొసైటీలో డబ్బు, పలుకుబడి ఉన్న ఎందరో నేరస్తులు.. కొందరు పోలీసుల డబ్బు ఆశని, ప్రాణ భయాన్ని అడ్డుపెట్టుకొని విచ్చలవిడిగా నేరాలు చేస్తుంటారు. తన కళ్ళ ముందే అలాంటివి జరుగుతున్నా ఏమీ చేయలేకపోతున్న పోరస్.. మంచి పోలిస్ ఆఫీసర్ అయ్యి ఇలాంటి వాటికి అడ్డుకట్ట వేయాలి అనుకుంటాడు. అయితే సాఫీగా సాగిపోతున్న తన జీవితంలో కొన్ని అనుకోని సంఘటనలు జరుగుతాయి. తన చెల్లి హత్య చేయబడటం, ఆమె ప్రియుడు అనుమానస్పదంగా మృతి చెందడంతో.. పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేని పోరస్.. పోలీస్ కాకముందే డ్యూటీ చేయడం(క్రిమినల్స్ ని పట్టుకోవడం) మొదలు పెడతాడు. పోరస్ చెల్లిని హత్య చేసింది ఎవరు? హత్యకు కారణమేంటి? ఆ హత్యకు కారణమైన వారిని పోరస్ అంతమొందించాడా అనేది మిగిలిన కథ.
ఎనాలసిస్:
ముందుగా దర్శకుడిని ఓ విషయంలో మెచ్చుకోవాలి. కొత్తదనం లేని కథ, ఆసక్తికరంగా సాగని కథనంతో విశాల్ ని ఒప్పించడం గ్రేట్ అనే చెప్పొచ్చు. ఈ సినిమాలో ఏం నచ్చి తానే ఈ సినిమాను నిర్మించాడో విశాల్ కే తెలియాలి. పేరుకి యాక్షన్ థ్రిల్లర్ సినిమా అయినా.. సినిమాలో ఎక్కడా థ్రిల్లింగ్ ఎలెమెంట్స్ లేవు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు సినిమా చాలా సాదాసీదాగా సాగిపోయింది.
పోరస్-చెల్లెలి మధ్య బాండింగ్, పోరస్-లవర్(డింపుల్ హయాతి)ల ప్రేమతో ఫస్ట్ హాఫ్ ప్రారంభమవుతుంది. అయితే ఆ సీన్స్ ఏవీ ఆకట్టుకునేలా ఉండవు. అక్కడక్కడా కమెడియన్ యోగిబాబు చెప్పే మాటలు నవ్విస్తాయి తప్ప, ఒక్క సీన్ లో కూడా కొత్తదనం లేదు. హీరో, హీరోయిన్ చిన్నప్పటి నుంచి ప్రేమించుకోవడం, హీరో సెటిల్ అవ్వలేదని హీరోయిన్ తండ్రి వేరే సంబంధాలు చూడటం, వాటిని హీరోయిన్ చెడగొట్టడం ఇలా పరమ రొటీన్ సీన్స్ తో హీరో-హీరోయిన్ ట్రాక్ నడుస్తుంది. హీరో చెల్లెలు, ఇంటి పక్కన ఉండే ఫ్రెండ్ ఫైజల్ లవ్ చేసుకోవడం, ఆ ఏరియాలో ఉండే గుణ అనేవాడు లవ్ చేస్తున్నాను అంటూ ఆమెని టార్చర్ చేయడం, చివరికి ఆమె సూసైడ్ అటెంప్ట్ చేయడం వంటి రొటీన్ ట్రాక్ మరోవైపు నడుస్తుంటుంది. హీరో చెల్లెలి సూసైడ్ అటెంప్ట్ తర్వాత ఆమె కిడ్నాప్ తో కథనంలో కాస్త స్పీడ్ పెరిగి ఆమె మరణంతో ఫస్ట్ హాఫ్ ముగుస్తుంది.
ఇక సెకండ్ హాఫ్ లో తన చెల్లెలి చావుకి కారణమైన వారిని పట్టుకునే పనిలో ఉంటాడు పోరస్. మొదట తన చెల్లెలి చావుకి కారణం గుణ అని, అలాగే తన చెల్లెలి చావుని తట్టుకోలేక ఫైజల్ సూసైడ్ చేసుకున్నాడని పోరస్ అనుకుంటాడు. కానీ ఇద్దరివి హత్యలే అని, దీని వెనక వేరే ఎవరో ఉన్నారని తెలిసి.. వారిని వెతికే పనిలో పడతాడు పోరస్. కానీ ఆ ప్రాసెస్ ఏ మాత్రం ఆసక్తికరంగా సాగలేదు. హీరో తన ఇంటలిజెన్స్ తో క్రిమినల్స్ ని పట్టుకోవాల్సిన సీన్స్ చాలా సిల్లీగా ఉన్నాయి. దానికితోడు సినిమాలో చాలా సీన్స్ ఆర్టిఫిషియల్ గా ఉన్నాయి. హీరో చెల్లి ఇప్పుడు కిడ్నాప్ కావాలి కాబట్టి మెడికల్ షాప్ కి రావాలి, విలన్ కి విషయం తెలిసిపోయింది కాబట్టి హీరోకి ఇప్పుడు ఏదైనా ఐడియా రావాలి అన్నట్టుగా సీన్స్ సాగాయి. చాలా సీన్స్ లో లాజిక్స్ కూడా ఉండవు. ఇక స్క్రీన్ ప్లే కూడా ప్రేక్షకుల కోణంలో నడవడంతో తర్వాత ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ ప్రేక్షకుల్లో కలగదు.
ఈ సినిమాలో అంతోఇంతో చెప్పుకునేది ఉంది అంటే హీరో పేరే. సినిమా ప్రారంభమైనప్పటి నుంచి హీరో పేరు పోరస్ ఏంటి? ఆ పేరు ఎందుకు పెట్టారు? అనే ఆసక్తి కలుగుతుంది. అయితే చివరిలో ఆ పేరు వెనక స్టొరీ చెప్తాడు విశాల్. 'పోరస్' అంటే పురుషోత్తముడు అని, ఆయన 'అలెగ్జాండర్'తో పోరాడిన ప్రాచీన భారతదేశానికి చెందిన ఒక గొప్ప రాజు అని చెప్తాడు.
హీరోకి పోరస్ అనే విభిన్న పేరు పెట్టి, ఆ పేరు గురించి తెలుసుకోవాలని ప్రేక్షకులలో ఆసక్తి కలిగేలా చేసిన డైరెక్టర్.. సినిమాని మాత్రం ఆసక్తికరంగా మలచడంలో పూర్తిగా విఫలమయ్యాడు.
ప్లస్ పాయింట్స్:
పెద్దగా లేవు
మైనస్ పాయింట్స్:
కథ, కథనం, దర్శకత్వం
నిర్మాణ విలువలు
నటీనటుల పనితీరు:
పేరులో కొత్తదనం ఉన్నా, పాత్రలో కొత్తదనం లేని తనకు బాగా అలవాటైన 'పోరస్' పాత్రలో విశాల్ ఏ మాత్రం కష్టపడకుండా నటించాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ డింపుల్ హయాతి పాత్రకు అంతగా ప్రాధాన్యత లేదు. ఒక సాంగ్, రెండు సీన్స్ అన్నట్లుగా ఏదో అలా మెరిసింది. యోగిబాబు తన కామెడీతో ఎప్పటిలాగానే నవ్వించే ప్రయత్నం చేశారు. బాబూరాజ్ జాకబ్, తులసి, రవీనా రవి, ఆర్.ఎన్.ఆర్. మనోహర్ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్:
సామాన్య ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెట్టే సినిమా 'సామాన్యుడు'.
రేటింగ్: 1.75/5
-గంగసాని
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



