ENGLISH | TELUGU  

'స‌డ‌క్ 2 'మూవీ రివ్యూ

on Aug 29, 2020

 

తారాగ‌ణం: స‌ంజ‌య్ ద‌త్‌, అలియా భ‌ట్‌, ఆదిత్య‌రాయ్ క‌పూర్‌, పూజా భ‌ట్‌, జిషు సేన్‌గుప్తా, మ‌క‌రంద్ దేశ్‌పాండే, గుల్ష‌న్ గ్రోవ‌ర్‌, ప్రియాంకా బోస్‌, మోహ‌న్ క‌పూర్‌
ర‌చ‌న‌: మ‌హేశ్ భ‌ట్‌, సుమిత్రా సేన్‌గుప్తా
మ్యూజిక్‌:  జీత్ గంగూలీ, అంకిత్ తివారీ
బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌: స‌ందీప్ చౌతా
సినిమాటోగ్ర‌ఫీ:  జే ఐ. ప‌టేల్‌
ఎడిటింగ్‌: స‌ందీప్ కురుప్‌
ద‌ర్శ‌క‌త్వం: మ‌హేశ్ భ‌ట్‌
విడుద‌ల‌:  డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్ (ఓటీటీ)


మ‌హేశ్ భ‌ట్ డైరెక్ట్ చేసిన 'స‌డ‌క్ 2' మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో రిలీజ‌య్యింది. సంజ‌య్ ద‌త్‌, పూజా భ‌ట్‌, స‌దాశివ్ ఆమ్రాపుర్క‌ర్ న‌టించిన 1991 నాటి క్లాసిక్ ఫిల్మ్ 'స‌డ‌క్‌'కు ఇది సీక్వెల్‌. దాన్ని రూపొందించిన మ‌హేశ్ భ‌ట్ దాదాపు రెండు ద‌శాబ్దాల విరామంతో మ‌ళ్లీ డైరెక్ష‌న్‌ను చేప‌ట్టి 'స‌డ‌క్ 2'తో మ‌న‌ముందుకు వ‌చ్చారు. అంత స్పెష‌ల్ 'స‌డ‌క్ 2'లో ఏముంది?

క‌థ‌

'స‌డ‌క్ 2' అనేది ర‌వి (సంజ‌య్ ద‌త్‌) అనే వ్య‌క్తి చుట్టూ తిరిగే క‌థ‌. అత‌ను ఒంట‌రివాడు. భార్య పూజ (పూజా భ‌ట్‌) చ‌నిపోయి ఉంటుంది. అయినా ఆమెతో ఊహ‌ల్లోనే సంభాషిస్తూ ఉంటాడు. ఆమె లేని లోటు భ‌రించ‌లేక ఓసారి త‌న జీవితాన్ని అంతం చేసుకోడానికి కూడా ప్ర‌య‌త్నించి విఫ‌ల‌మ‌వుతాడు. ఆర్య (అలియా భ‌ట్‌) అనే అమ్మాయి ఓ క్యాబ్ కోసం చూస్తుంటుంది. క్యాబ్ బుక్ చేసుకున్నానంటూ ర‌వి ఇంటికి వ‌స్తుంది. కానీ ర‌వి క్యాబ్ బిజినెస్‌ను అప్ప‌టికే మానేసి ఉంటాడు. అయిన‌ప్ప‌టికీ ఆర్య‌ను రాణీఖేత్‌కు తీసుకొని వెళ్ల‌డానికి ర‌వి ఒప్పుకుంటాడు.. కార‌ణం, అది అతడి భార్య చేసిన చివ‌రి బుకింగ్‌. త‌ర్వాత ఏం జ‌రిగింద‌న్న‌ది మిగ‌తా సినిమా.

విశ్లేష‌ణ‌

ఆర్య వెనుక కూడా ఓ క‌థ ఉంది. ఆమె ఓ ఇండ‌స్ట్రియ‌లిస్ట్ (జిషు సేన్‌గుప్తా) కూతురు. ఆమెకో స‌వ‌తి త‌ల్లి (ప్రియాంకా బోస్‌). ఆ స‌వ‌తి త‌ల్లి ఆర్య క‌న్న‌త‌ల్లిని హ‌త్య చేస్తుంది. 21 ఏళ్లు నిండేదాకా త‌న‌ను తాను కాపాడుకోవాల‌ని చూస్తుంటుంది ఆర్య‌. ఎందుకంటే అప్పుడే త‌న కుటుంబ ఆస్తుల‌కు ఆమె అస‌లైన య‌జ‌మానురాల‌వుతుంది. ఈ క‌థ వింటుంటే మ‌న‌కు 90ల నాటి సినిమాలు గుర్తుకు వ‌స్తే అది మ‌న త‌ప్పు కాదు. అప్పుడు ఎంట‌ర‌వుతాడు ఆర్య ల‌వ‌ర్ విశాల్ (ఆదిత్య రాయ్ క‌పూర్‌). అంకిత్ తివారీ పాడిన పాట బ్యాగ్రౌండ్‌లో వినిపిస్తుండ‌గా అత‌డిని ఇంట్ర‌డ్యూస్ చేశాడు ద‌ర్శ‌కుడు. సోష‌ల్ మీడియాలో త‌న‌ను ట్రోల్ చేసిన విశాల్‌తో గొడ‌వ ప‌డుతుంది ఆర్య‌. అలా ఘ‌ర్ష‌ణ‌తో మొద‌లైన వారి ప‌రిచ‌యం ప్రేమ‌గా మారుతుంది!  ఏనాటి క‌థ ఇది!! చాలా మంది హీరోల త‌ర‌హాలోనే విశాల్‌కు కూడా తాగ‌డ‌మంటే చాలా ఇష్టం.

సినిమా ఆద్యంతం స‌న్నివేశాలు స‌హ‌జంగా కాకుండా బ‌ల‌వంతంగా ఎవ‌రో తోస్తున్న‌ట్లు జ‌రుగుతుంటాయి. క‌థ కూడా అంతే. 'స‌డ‌క్' స్క్రీన్‌ప్లే బ‌లంతో, సీన్ల బ‌లంతో ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తే, 'స‌డ‌క్ 2'లో ఆ లోపం కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తుంది. 20 ఏళ్ల త‌ర్వాత మెగాఫోన్ ప‌ట్టుకున్న మ‌హేశ్ భ‌ట్‌లో అప్ప‌టి వాడి, వేడి క‌నిపించ‌లేదు. ఆ విష‌యం టేకింగ్‌లో స్ప‌ష్ట‌మ‌వుతోంది. అస‌లే తీవ్ర నెగ‌టివిటీ మ‌ధ్య రిలీజైన సినిమా కావ‌డం 'స‌డ‌క్ 2'కు పెద్ద మైన‌స్ కాగా, క‌థ‌లో, క‌థ‌నంలో అనేక బొక్క‌ల‌తో సినిమా త‌యార‌వ‌డం మ‌రింత మైన‌స్ కానున్న‌ది.

రానున్న రోజుల్లో సోష‌ల్ మీడియాలో ఈ సినిమా గురించి జోక్స్ విప‌రీతంగా పేల‌తాయ‌ని చెప్ప‌డానికి సందేహించాల్సిన ప‌ని లేదు. ప‌నిలో ప‌నిగా, మీమ్స్ కూడా బాగానే వ‌స్తాయి. సినిమాలో కుంభ‌క‌ర్ణ్ అనే పెంపుడు గుడ్ల‌గూబ కూడా ఉంది. దాని పేరుకు త‌గ్గ‌ట్లే 'స‌డ‌క్ 2'లో క‌థ‌నం కుంభ‌క‌ర్ణుడి నిద్ర‌ను గుర్తుకు తెస్తుంది. సంజ‌య్ ద‌త్‌, అలియా భ‌ట్ మ‌ధ్య స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించిన తీరు చూస్తే.. మ‌నం చూస్తోంది ద గ్రేట్ మ‌హేశ్ భ‌ట్ మూవీనేనా అనిపించ‌డం ఖాయం. "భ‌ట్ జీ.. మ‌మ్మ‌ల్ని ఏ దారి (స‌డ‌క్‌)లోకి తీసుకుపోతున్నావ్?" అని కూడా అడ‌గాల‌నిపిస్తుంది.

తారల అభిన‌యం

ఈ సినిమాలో ప్ర‌ధాన పాత్ర‌ధారుల్లో ఎవ‌రి న‌ట‌న‌నూ వంక పెట్ట‌డానికి లేదు. ర‌వి పాత్ర‌ను సంజ‌య్ ద‌త్ త‌న‌దైన త‌ర‌హాలో చేసుకుపోయాడు. యువ‌కుడైన ర‌వి తీరు వేరు, ఈ మ‌ధ్య వ‌య‌స్కుడి తీరు వేరు. అయినా త‌న‌కిచ్చిన పాత్ర‌లో సునాయాసంగా ఇమిడిపోయాడు. ఆర్య‌గా అలియా భ‌ట్ క్యూట్‌గానే ఉంది, అలాగే చేసింది. విశాల్‌గా ఆదిత్య‌రాయ్ కూడా త‌న ప‌రిధి మేర‌కు చేశాడు. అయినా కానీ వాళ్ల పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కులు స‌హానుభూతి చెంద‌క‌పోవ‌డానికి కార‌ణం.. ఆక‌ర్ష‌ణీయంగా, ఆస‌క్తిక‌రంగా లేని క‌థ‌, క‌థ‌నాలే. ఇందుకు బాధ్య‌త వ‌హించాల్సింది మ‌హేశ్ భ‌ట్. ఆర్య తండ్రిగా జిషు సేన్‌గుప్తా ఫ‌ర్వాలేదు. గురూజీగా మ‌క‌రంద్ దేశ్‌పాండేలోని న‌టుడు వృథా అయ్యాడు. ఆర్య స‌వ‌తి త‌ల్లిగా ప్రియాంకా బోస్‌ను భ‌రించ‌లేం.

తెలుగువ‌న్ ప‌ర్‌స్పెక్టివ్‌

స‌డ‌క్ అంటే దారి క‌దా.. ఒరిజిన‌ల్ ర‌హ‌దారి అయితే, ఈ 'స‌డ‌క్ 2' మాత్రం ముళ్ల‌దారి. ఆ దారిలో న‌డ‌వాల‌నుకొనేవారికి ప‌ల్లేరుగాయ‌లో, తుమ్మ‌ముళ్లో గుచ్చుకోవ‌డం ఖాయం. ఆ నొప్పి భ‌రించాల‌నుకొనేవాళ్లు ఈ సినిమా చూసేందుకు ధైర్యం చేయ‌వ‌చ్చు.

రేటింగ్‌: 1.25/5

- బుద్ధి య‌జ్ఞ‌మూర్తి

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.