శివాజీ, పూనమ్ కౌర్ జంటగా 'నిక్కీ అండ్ నీరజ్' మూవీ చేశారని మీకు తెలుసా?
on Aug 29, 2020

అవును. 'నిక్కీ అండ్ నీరజ్ మూవీ' 2007 ఫిబ్రవరిలో వచ్చింది. అంటే పదమూడున్నరేళ్ల క్రితం అన్న మాట. ఈ సినిమాలో పూనమ్ కౌర్ తన ఒరిజినల్ నేమ్‌తో కాకుండా దీప అనే స్క్రీన్ నేమ్‌తో నటించిందనే విషయం కూడా ఇవాళ చాలా మందికి తెలీదు. పూర్ణ అడపాల అనే డైరెక్టర్ తీసిన ఈ మూవీలో సుమన్, జయప్రకాశ్ రెడ్డి, అజయ్ కీలక పాత్రలు పోషిస్తే, ఎమ్మెస్ నారాయణ, ఎల్బీ శ్రీరామ్, అలీ, వేణుమాధవ్ కమెడియన్ల పాత్రలు చేశారు.
ఒక తహసిల్దార్ కొడుకైన నీరజ్ ప్రసాద్ (శివాజీ) తండ్రికి తగ్గ తనయుడిగా కాకుండా, పేకాట రాయుడిలా మారితే, అమెరికా నుంచి వచ్చిన నీహారిక అలియాస్ నిక్కీ (పూనమ్ కౌర్ అలియాస్ దీప) బుద్ధి చెబుతుంది. ఆమెను తొలి చూపులోనే నీరజ్ ప్రేమిస్తే, ఆమె మాత్రం అతడిని ఏమాత్రం లక్ష్యపెట్టదు. గాయనిగా పేరు తెచ్చుకోవాలన్నది నిక్కీ లక్ష్యమైతే, ఆమె ప్రేమ పొందడమే తన లక్ష్యమన్నట్లు వ్యవహరిస్తాడు నీరజ్. వీళ్ల మధ్యలో విలన్ అజయ్. అతను నిక్కీకి బావ వరస. ఆమెను పెళ్లాడాలని తహతహ లాడుతుంటాడు. చివరకు ఏమవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కదా.
ఈ సినిమాలో ఎస్పీ బాలు కూడా ఓ అతిథి పాత్రలో దర్శనమిస్తారు. వందేమాతరం శ్రీనివాస్ సంగీతం అందించిన ఈ సినిమాకి వేటూరి లాంటి లెజెండరీ లిరిసిస్ట్ పాటలు రాశారు. హీరో పాత్రకు దశ, దిశ లేకపోవడం, హాస్య సన్నివేశాలు హాస్యాన్ని కాకుండా అపహాస్యాన్ని అందివ్వడం, విసుగెత్తించే కథనం కారణంగా 'నిక్కీ అండ్ నీరజ్' మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. హీరోయిన్‌గా కెరీర్‌ను కొనసాగించాలనే తపనను కనపర్చిన పూనమ్ కౌర్‌కు దీప అనే స్క్రీన్ నేమ్ కలిసి రాలేదు. తర్వాత కాలంలో ఆమె తన అసలు పేరుతోనే నటిస్తూ వచ్చిన విషయం తెలిసిందే.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



