'ఆర్ఆర్ఆర్'.. ఉగాది గ్రాండ్ న్యూ సెలబ్రేషన్ పోస్టర్!
on Apr 13, 2021
ఓవైపు కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ విలయ తాండవం చేస్తున్నప్పటికీ.. మరోవైపు తెలుగువారంతా నూతన సంవత్సరాది ఉగాదిని తమ ఇళ్లల్లోనే ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. నార్త్‌లో ఇదే రోజు గుడిపడ్వ పండుగను జనం సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎపిక్ ఫిల్మ్ 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' నుంచి గ్రాండ్ న్యూ పోస్టర్ రిలీజయ్యింది. ఉగాది ఉత్సవానికి తగ్గట్లు ఆ పోస్టర్లో జనం ఇద్దరు హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లను పైకెత్తేస్తూ తమ ఆనందోత్సాహాలను ప్రదర్శిస్తున్నారు.
ఆ పోస్టర్లో అల్లూరి సీతారామరాజు (చరణ్) ప్యాంటు-షర్టు ధరించి ఉంటే, కొమరం భీమ్ (తారక్) వైట్ అండ్ వైట్ జుబ్బా, పంచెకట్టుతో ఉన్నాడు. ఇద్దరి తలకూ పసుపు రంగు గుడ్డ కనిపిస్తోంది. ఇద్దరూ చాలా హాయిగా నవ్వుతుండటాన్ని బట్టి చిత్రంలో అది ఓ ఆనందకర క్షణాలకు సంబంధించిన పోస్టర్‌గా అర్థమవుతోంది. బహుశా ఓ పాటకు సంబంధించింది కావచ్చు.
అసలు రెండు వేర్వేరు ప్రాంతాలకు చెందిన రామరాజు, భీమ్ తమ ఇళ్లల్లోంచి వెళ్లిపోయి, ఒకచోట కలిశారనేది ఇంట్రెస్టింగ్ పాయింట్ అనుకుంటే, ఆ ఇద్దరిపై ఏవో సెలబ్రేషన్స్‌కు సంబంధించిన సీన్లో, పాటో తియ్యడం మరో ఇంట్రెస్టింగ్ పాయింట్. ఆ హీరోలతో రాజమౌళి ఎలాంటి మ్యాజిక్ చేశాడో సినిమా చూస్తేనే కానీ తెలీదు.
మేకర్స్‌తో పాటు డైరెక్టర్ యస్.యస్. రాజమౌళి, హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్, కీలక పాత్రధారి అజయ్ దేవ్‌గణ్, హీరోయిన్ అలియా భట్ ఈ పోస్టర్‌ను తమ ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా షేర్ చేసి, అందరికీ తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలిపారు.
2021లోనే దేశవ్యాప్తంగా సినీ ప్రియులు అత్యంత ఆత్రుతగా ఎదురుచూస్తున్న సినిమాగా పేరుపొందిన 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ ముగింపు దశలో ఉంది. కీరవాణి సంగీతం, కె.కె. సెంథిల్‌కుమార్ ఛాయాగ్రహణం అందిస్తోన్న ఈ మూవీకి సంబంధించి ఇప్పటివరకూ రిలీజ్ చేసిన పోస్టర్లు, టీజర్లు ఆడియెన్స్‌లో అంచనాలను ఆకాశమే హద్దు అన్నంతగా పెంచేశాయి. ఇప్పుడు ఉగాది సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ అభిమానుల్లో మరింత ఉత్తేజాన్ని నింపేలా ఉంది. అత్యంత భారీ బడ్జెట్‌తో దక్షిణాది భాషలన్నింటితో పాటు హిందీలోనూ ఏక కాలంలో అక్టోబర్ 13న విడుదలకు 'ఆర్ఆర్ఆర్' రెడీ అవుతోంది.