జపాన్ లో 'ఆర్ఆర్ఆర్' సంచలనం.. భారీ కలెక్షన్స్ తో సరికొత్త రికార్డులు!
on Nov 1, 2022

జపాన్ లో భారీ ప్రమోషన్స్ తో అక్టోబర్ 21న 'ఆర్ఆర్ఆర్' విడుదలైన సంగతి తెలిసిందే. హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, దర్శకుడు రాజమౌళి విడుదలకు ముందు జపాన్ వెళ్లి బాగా ప్రమోట్ చేశారు. అందుకు తగ్గట్టే ఓపెనింగ్స్ భారీగానే వచ్చాయి. అంతేకాదు జపాన్ లో మొదటి వారం అత్యధిక కలెక్షన్లు రాబట్టిన ఇండియన్ చిత్రంగా 'ఆర్ఆర్ఆర్' సంచలనం సృష్టించింది.
జపాన్ లోని 44 నగరాల్లో 200 కి పైగా స్క్రీన్స్ లో విడుదలైన 'ఆర్ఆర్ఆర్' భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోందని హాలీవుడ్ మీడియా చెబుతోంది. ఈ వారం జపాన్ లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన టాప్-10 చిత్రాలలో చోటు దక్కించుకున్న ఒకే ఒక్క విదేశీ చిత్రం 'ఆర్ఆర్ఆర్' కావడం విశేషం. పలు హాలీవుడ్ చిత్రాలను సైతం వెనక్కి నెట్టి జపాన్ చిత్రాలతో పాటుగా అక్కడ కలెక్షన్లు రాబడుతుందని సమాచారం.
జపాన్ కరెన్సీ లో మొదటి వారం 'ఆర్ఆర్ఆర్' 73 మిలియన్లు(రూ.4 కోట్లకు పైగా గ్రాస్) వసూలు చేసింది. దీంతో జపాన్ లో మొదటి వారం అత్యధిక కలెక్షన్లు రాబట్టిన ఇండియన్ చిత్రంగా నిలిచింది. పది రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పటిదాకా 110 మిలియన్లు రాబట్టింది.
జపాన్ లో ఫుల్ రన్ లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన ఇండియన్ సినిమాలలో రజినీకాంత్ 'ముత్తు' మొదటి స్థానంలో ఉంది. 24 ఏళ్ళ క్రితం విడుదలైన ఈ చిత్రం ఏకంగా 400 మిలియన్లతో సత్తా చాటింది. ఆ తర్వాతి స్థానాల్లో 300 మిలియన్లతో 'బాహుబలి-2', 170 మిలియన్లతో '3 ఇడియట్స్', 130 మిలియన్లతో 'ఇంగ్లీష్ వింగ్లీష్' ఉన్నాయి. ఫుల్ రన్ లో 'ఇంగ్లీష్ వింగ్లీష్', '3 ఇడియట్స్' చిత్రాలను దాటుకొని 'ఆర్ఆర్ఆర్' మూడో స్థానంలో నిలిచే అవకాశముంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



