మెగా కాంపౌండ్ నుంచి దర్శకులకు వరుస షాక్ లు!
on Nov 1, 2022

మెగా ఫ్యామిలీకి చెందిన చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేయడానికి దర్శకులు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే కొంతకాలంగా మెగా కాంపౌండ్ నుంచి దర్శకులకు వరుస షాక్ లు తగులుతున్నాయి. సినిమా చేయడానికి అంగీకరిస్తున్నారు. అధికారిక ప్రకటన కూడా వస్తుంది. కానీ కొంతకాలానికి అసలు ఆ సినిమా ఉందో లేదో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని సినిమాలైతే ఆగిపోయినట్టు అధికారిక ప్రకటనలు కూడా వస్తున్నాయి.

కుర్ర హీరోలకు కూడా సాధ్యం కాని విధంగా చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన బాబీ దర్శకత్వంలో 'వాల్తేరు వీరయ్య', మెహర్ రమేష్ దర్శకత్వంలో 'భోళా శంకర్' చేస్తున్నాడు. అలాగే యువ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు గతేడాది డిసెంబర్ లో అధికారిక ప్రకటన వచ్చింది. ఈ చిత్రాన్ని ప్రకటించి దాదాపు ఏడాది అవుతున్నా ఇంతవరకు ఎలాంటి అప్డేట్ లేదు. ఇటీవల ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందన్న వార్తలు కూడా వినిపించాయి. మొదటి రెండు చిత్రాలు 'ఛలో', 'భీష్మ'తో సూపర్ హిట్స్ అందుకొని మూడో సినిమాకే చిరంజీవిని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకొని సంబరపడ్డ వెంకీకి తీరా ఇంతకాలం ఎదురుచూశాక మెగా షాక్ తగిలిందని అంటున్నారు. ప్రస్తుతం ఆయన మరో హీరోతో సినిమా చేసే ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు సమాచారం.

ఓ వైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో 'హరి హర వీరమల్లు' చేస్తున్నాడు. ఈ సినిమా అనుకున్న దానికంటే చాలా ఆలస్యమవుతూ వస్తోంది. ఆ తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో 'భవదీయుడు భగత్ సింగ్' చేయాల్సి ఉంది. 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్ బస్టర్ పవన్-హరీష్ కలయికలో రానున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే పరిస్థితి కనిపించడం లేదు. 2019లో వచ్చిన 'గడ్డలకొండ గణేష్' తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక్క సినిమా కూడా పట్టాలెక్కలేదు. 'భవదీయుడు భగత్ సింగ్' ప్రకటన వచ్చి కూడా ఏడాది దాటిపోయింది. అసలు ఈ ప్రాజెక్ట్ ఉంటుందో లేదో.. ఒకవేళ ఉన్నా ఎప్పుడు మొదలవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో హరీష్ ఇప్పుడు మరో మెగా హీరో వరుణ్ తేజ్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్లు న్యూస్ వినిపిస్తోంది. అలాగే సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కూడా పవన్ ఒక సినిమా చేస్తున్నట్టు అప్పట్లో ప్రకటన వచ్చింది. కానీ అసలు ఈ ప్రాజెక్ట్ ఒకటి ఉందన్న విషయమే అందరూ మర్చిపోయారు. ప్రస్తుతం అక్కినేని అఖిల్ తో 'ఏజెంట్' చిత్రాన్ని చేస్తున్న సురేందర్ ఆ తర్వాత ఏం చేస్తాడో చూడాలి.

ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే ప్రస్తుతం తన 15వ సినిమాని శంకర్ దర్శకత్వంలో చేస్తున్నాడు. అలాగే తన 16వ సినిమాని యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో చేస్తున్నట్టు ప్రకటన వచ్చింది. కానీ తాజాగా ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టు చరణ్ పీఆర్ టీమ్ ప్రకటించింది. గౌతమ్ ప్రస్తుతం దిల్ రాజు నిర్మాణంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా చేయడానికి సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.

మొత్తానికి మెగా హీరోలను దర్శకత్వం వహించే ఛాన్స్ వచ్చిందని ఆనందపడాలో లేక అసలు ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందో లేదోనని ఆందోళన పడాలో తెలియని పరిస్థితి దర్శకుల్లో నెలకొందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



