'ఏజెంట్'తో రిస్క్ చేస్తున్న అఖిల్.. సంక్రాంతి పోరులో నలిగిపోతాడా?
on Nov 1, 2022

'అఖిల్'(2015) సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమైన అక్కినేని వారసుడు అఖిల్ మొదటి విజయాన్ని అందుకోవడానికి ఐదేళ్లకు పైగా పట్టింది. అతను హీరోగా నటించిన నాలుగో సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్'(2021)తో ఫస్ట్ హిట్ ని అందుకున్నాడు. ఆ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 'ఏజెంట్' అనే పాన్ ఇండియా రేంజ్ సినిమా చేస్తున్న అఖిల్.. దానిని సంక్రాంతికి విడుదల చేయడానికి సిద్ధమై పెద్ద రిస్క్ చేస్తున్నాడు.
సంక్రాంతికి ఫ్యామిలీ సినిమాలకు, మాస్ సినిమాలకు ఎక్కువ ఆదరణ ఉంటుంది. అలాంటిది అఖిల్ మాత్రం స్పై యాక్షన్ ఫిల్మ్ తో బరిలోకి దిగడానికి సిద్ధమవుతున్నాడు. దానికితోడు ఈసారి సంక్రాంతి పోరు భారీ స్థాయిలో ఉండబోతోంది. ప్రభాస్ 'ఆదిపురుష్' సంక్రాంతి రేసు నుంచి తప్పుకుందని తెలుస్తున్నప్పటికీ.. 'వాల్తేరు వీరయ్య'తో చిరంజీవి, 'వీర సింహా రెడ్డి'తో బాలకృష్ణ బరిలోకి దిగుతున్నారు. చిరు వర్సెస్ బాలయ్య పోరులో ప్రేక్షకులు ఇతర సినిమాలను పట్టించుకునే అవకాశాలు చాలా తక్కువ. సంక్రాంతి కాబట్టి ఫ్యామిలీ సినిమాలైతే హీరోలతో సంబంధం లేకుండా కాస్త ఆసక్తి చూపిస్తారు కానీ, స్పై ఫిల్మ్ అయితే ఏ మాత్రం ఆసక్తి చూపే అవకాశాలు లేవు.
మరోవైపు సంక్రాంతికి 'వారసుడు'తో తమిళ్ హీరో విజయ్ కూడా రాబోతున్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా కావడంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో విడుదలవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా నైజాంలో భారీ సంఖ్యలో థియేటర్స్ లో విడుదలయ్యే అవకాశముంది. అసలే చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు చాలా వరకు థియేటర్లను ఆక్రమిస్తాయి. దానికితోడు దిల్ రాజు కూడా 'వారసుడు'తో థియేటర్లను భారీగానే ఆక్రమిస్తాడు. ఆ లెక్కన చూస్తే అఖిల్ 'ఏజెంట్' సినిమాకి కావాల్సినన్ని థియేటర్లు దొరికే పరిస్థితి ఉండదు. దానికితోడు సంక్రాంతి సమయంలో అభిమానులు, మాస్ ప్రేక్షకులు 'వాల్తేరు వీరయ్య', 'వీర సింహా రెడ్డి' సినిమాలకు మొగ్గు చూపుతారు. ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా 'వారసుడు'కి ఓటేస్తారు. దాంతో అక్కినేని అభిమానులు మాత్రమే 'ఏజెంట్'ని పట్టించుకునే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఇలా సంక్రాంతి సమయంలో భారీ చిత్రాలతో పోటీకి దిగకుండా, 'ఏజెంట్' వేరే సమయంలో విడుదలైతే అన్ని వర్గాల ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించే అవకాశముంటుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



