'ఆర్ ఆర్ ఆర్'కు కొత్త రిలీజ్ డేట్?
on Jan 18, 2020
2020 సంవత్సరంలో మోస్ట్ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియా ఫిల్మ్ ఏదంటే ఎవరైనా ఠక్కున చెప్పే పేరు 'ఆర్ ఆర్ ఆర్'. నంబర్ వన్ ఇండియన్ డైరెక్టర్ యస్.యస్. రాజమౌళి డైరెక్షన్‌లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తోన్న ఈ మల్టీస్టారర్ ఎప్పుడు తమ ముందుకు వస్తుందా అని దేశవ్యాప్తంగా సినీ ప్రియులు అత్యంత ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. జూలై 30న ఈ సినిమాని రిలీజ్ చేస్తామని రాజమౌళి, నిర్మాత డీవీవీ దానయ్య చాలా కాలం క్రితమే ప్రకటించారు. ఇటీవల ఈ సినిమా విడుదలలో జాప్యం జరిగే అవకాశం ఉందంటూ ప్రచారంలోకి రాగా, అంతర్గత సంభాషణల్లో యూనిట్ సభ్యులు మాత్రం అనుకున్న సమయానికే సినిమా వస్తుందని చెబుతూ వచ్చారు. ఆఖరికి తారక్ సైతం తన అభిమానులతో జూలై 30నే ఈ సినిమా విడుదలవుతుందని చెప్పినట్లు వార్తలు వచ్చాయి.
అయితే తాజా రిపోర్టుల ప్రకారం 'ఆర్ ఆర్ ఆర్' రిలీజ్ డేట్ మారనున్నది. ఈ విషయాన్ని బాలీవుడ్ ట్రేడ్ అనలిస్టులు తరణ్ ఆదర్శ్, కోమల్ నహతా తమ ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా వెల్లడించారు. తరణ్ ఆదర్శ్ అయితే సినిమా పేరు వెల్లడించకుండా "సౌత్ ఇండియా బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ తీసున్న బిగ్ ఫిలింకు కొత్త రిలీజ్ డేట్.. అందిన సమాచారం ప్రకారం ఆ మూవీ 2020 అక్టోబర్‌లో రిలీజవుతుంది. ఆ సినిమా ఏదో మీరే ఊహించండి" అని ట్వీట్ చేశాడు. మరోవైపు కోమల్ నహతా డైరెక్టుగా "యస్.యస్. రాజమౌళి 'ఆర్ ఆర్ ఆర్' 2020 అక్టోబర్‌లో రిలీజవుతుంది అంతర్గత వర్గాలు ధ్రువీకరించాయి" అని పోస్ట్ చేశాడు. అయితే దీనిపై సినిమా యూనిట్ నుంచి ఇంతదాకా ఎలాంటి స్పందనా వ్యక్తం కాలేదు. అక్టోబర్ 2 గాంధీ జయంతి కాబట్టి, ఆ రోజున ఈ సినిమా విడుదలవుతుందని కూడా ప్రచారంలోకి వచ్చింది. చూద్దాం.. ఈ ప్రచారం ఏ మేరకు నిజమవుతుందో!

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
