సెల్యులాయిడ్ స్వప్న లోకం.. 30 ఏళ్ల 'జగదేకవీరుడు అతిలోకసుందరి'
on May 8, 2020
1990 మే 9.. వెండితెరపై ఒక స్వప్న ప్రపంచం ఆవిష్కృతమైంది. టాప్ హీరో, టాప్ హీరోయిన్, టాప్ డైరెక్టర్, టాప్ ప్రొడ్యూసర్, టాప్ మ్యూజిక్ డైరెక్టర్ కలయికతోఒక చిరస్మరణీయ వినోద తరంగం ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించింది. దాని పేరు.. జగదేకవీరుడు అతిలోకసుందరి. ఆ సినిమా తెలుగునాట సృష్టించిన ప్రభంజనం ఎలాంటిదో వర్ణించడానికి మాటలు చాలవు. అది విడుదలైన సమయంలో ఉన్నవాళ్లందరికీ అదొక మరపురాని అనుభవం. ఆ రోజుల్లో 'జగదేకవీరుడు అతిలోకసుందరి' దృశ్యకావ్యాన్ని చూడని, చూడలేకపోయిన తెలుగువాళ్లని వేళ్లమీద లెక్కించవచ్చంటే అతిశయోక్తి కాదు. తన కెరీర్‌లోనే నంబర్ వన్ మూవీ అని మెగాస్టార్ గర్వంగా చెప్పుకొనే దృశ్య కావ్యం! బ్లాక్‌బస్టర్లు ఎన్నో వస్తాయి కానీ, జనరేషన్లు మారినా ఎవర్‌గ్రీన్‌గా ఉండే బ్లాక్‌బస్టర్ల లిస్ట్‌లో ఫస్ట్ ఉండే సినిమా 'జగదేకవీరుడు అతిలోకసుందరి'.
సినిమా తీసే, సినిమా చూసే విధానాన్ని మార్చిన ఈ సినిమా ఎలా పుట్టింది?
అశ్వినీదత్‌కు ఏ నాటినుంచో ఎన్టీఆర్ 'జగదేకవీరుని కథ' లాంటి ఫాంటసీ సినిమా చిరంజీవితో చేయాలనీ, అదీ తను ప్రేమగా బావ అని పిలుచుకొనే రాఘవేంద్రరావు మాత్రమే తీయగలరనీ గట్టి నమ్మకం. 'ఆఖరి పోరాటం' వంటి హిట్ మూవీ తర్వాత చిరంజీవితో సినిమా అనుకున్నారు దత్. తనకు క్లోజ్ ఫ్రెండ్ అయిన రచయిత, కో డైరెక్టర్ శ్రీనివాస చక్రవర్తిని రాఘవేంద్రరావుతో తిరుమల పంపించారు. సరిగ్గా ఇద్దరూ తిరుమలపై ఉండగా శ్రీనివాస చక్రవర్తి.. "దేవకన్య భూమి మీదకు వచ్చినప్పుడు ఆమె ఉంగరం పోతుంది, అది చిరంజీవి గారికి దొరుకుతుంది" అని జస్ట్ ఊహామాత్రంగా చెప్పారు. అది రాఘవేంద్రరావుకు బాగా నచ్చింది. దత్ కలకు దగ్గరగా ఉంది. ఆయనకీ నచ్చింది.
మరి జగదేకవీరుడికి జోడీగా అతిలోకసుందరి ఎవరు? అందరి మదిలో మెదిలిన పేరు ఒక్కటే. వైజయంతీ ఆస్థాన నాయిక, వెండితెర దేవత.. శ్రీదేవి! క్రేజీ కాంబినేషన్ సెట్టయింది. దానికి తగ్గట్టు కథను తయారుచేయడానికి వైజయంతీ మూవీస్ ఆఫీసులో రచయితల కుంభమేళా ప్రారంభమైంది. యండమూరి వీరేంద్రనాథ్, జంధ్యాలతో మొదలై సత్యమూర్తి, విజయేంద్రప్రసాద్, తమిళ రచయిత క్రేజీ మోహన్.. ఇలా ఇంతమంది రచయితల సైన్యం సిద్ధమైంది.
అంతే కాదు.. చిరంజీవి కూడా నెల రోజుల పాటు అక్కడకు వెళ్లి కథా చర్చల్లో పాల్గొని తన సలహాలు కూడా ఇచ్చేవారు. 'దేవకన్యను అతిలోకసుందరిగా చూపిస్తున్నప్పుడు నేను కొంచెం మాసిన గడ్డంతో సామాన్య మానవుని లుక్‌లో ఉంటేనే బాగుంటుంది, అందరూ కనెక్టవుతారని ఆయన సలహా ఇచ్చారు.
ఇంకోవైపు, బాంబేలో తన కాస్ట్యూమ్స్ తనే స్వయంగా డిజైన్ చేసుకొని కుట్టించారు శ్రీదేవి. ఇలా అందరూ కలసి, తమ సమష్టి కృషితో ఈ అందమైన చందమామ కథని తెలుగు సినీ చరిత్రలో మరచిపోలేని ఒక అద్భుత చిత్ర కావ్యంగా మలచారు.
ఈ సెల్యులాయిడ్ వండర్ వెనుక ఎంతోమంది ఛాంపియన్స్ ఉన్నారు.. సినిమాలోని ప్రతి ఫ్రేమ్‌నీ మ్యాజికల్‌గా చూపించిన సినిమాటోగ్రాఫర్ విన్సెంట్.. అందమైన సెట్స్‌తో మైమరపింపజేసిన ఆర్ట్ డైరెక్టర్ చలం.. ఎడిటింగ్ స్కిల్‌తో సినిమాకి సూపర్ టెంపోనిచ్చిన కోటగిరి వెంకటేశ్వరరావు.. మాటలతో మెస్మరైజ్ చేసిన జంధ్యాల.. పాటలతో పండగ చేసిన వేటూరి..
వీళ్లందరి కష్టానికి ప్రాణం పోశారు ఒక లెజెండ్.. ఒకే ఒక్క మ్యాస్ట్రో ఇళయరాజా! ప్రతి పాట వెనుకా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. ఒక పాట ట్యూన్‌ని ఇళయరాజా కంపోజ్ చేశారు. కానీ పాట విని, 'అన్నీ మెలోడీ క్లాస్ సాంగ్స్ అయిపోతున్నాయ్.. చిరంజీవి, శ్రీదేవి అంటే మాస్ సాంగ్ ఎక్స్‌పెక్ట్ చేస్తారు కదా?'.. అని గట్టిగానే అభ్యంతరం వచ్చింది.
రాఘవేంద్రరావు ఆలోచనలో పడ్డారు. కానీ అశ్వినీదత్‌కు ఇళయ రాజా ట్యూన్ మార్చడం ఇష్టం లేదు. అప్పుడు వేటూరి, "ఇదే ట్యూన్‌ని మాస్ సాంగ్ చేస్తాను చూడండి".. అన్నారు. అలా 'అబ్బ నీ తీయనీ దెబ్బ' సాంగ్ రాశారు. క్లాస్ ట్యూన్‌ని తెలుగు సినిమా హిస్టరీలో బిగ్గెస్ట్ మాస్ ట్యూన్‌గా తయారు చేశారు ఆ ఇద్దరు లెజెండ్స్.. ఇళయరాజా అండ్ వేటూరి. ఇందులో మరో విషయం ఏంటంటే.. ఈ పాటని డైరెక్టర్ రాఘవేంద్రరావు మైసూర్, బెంగళూర్‌లలో జస్ట్ రెండే రోజుల్లో ఫినిష్ చేశారు.
అయితే దేవకన్య ఇంద్రజ మొదటిసారి మానస సరోవరానికి వచ్చినప్పుడు, 'అందాలలో మహోదయం' పాట పిక్చరైజ్ చేయడానికి రాఘవేంద్రరావు 11 రోజులు టైమ్ తీసుకున్నారు.
ఇక 'ధినక్ తా ధినక్ రో'.. పాటకు చెన్నైలోని వాహినీ స్టూడియోలో భారీ సెట్ వేశారు. షూటింగ్ అయిపోగానే శ్రీదేవి ఒక హిందీ సినిమా షూటింగ్‌కు ఫారిన్ వెళ్లిపోవాలి. సరిగ్గా అదే టైమ్‌కు చిరంజీవికి 104 డిగ్రీల హై ఫీవర్! ఒళ్లు కాలిపోతోంది. ఓ పక్కన రిలీజ్ డేట్ మే 9! ఒక్క రోజు తేడా వచ్చినా మొత్తం తేడా వచ్చేస్తుంది. అప్పుడు చిరంజీవి హై ఫీవర్‌తోనే షూటింగ్‌కు రెడీ అయ్యారు. ఆయన కోసం సెట్‌లోనే ఒక డాక్టర్‌ను ఏర్పాటు చేశారు. శ్రీదేవితో చిరంజీవి డాన్స్.. అసలెక్కడైనా చిన్న తేడా అయినా కనీసం కనిపించిందా స్క్రీన్ మీద! అదీ చిరంజీవి అంటే!!
అందుకే.. ఒక్కటి కాదు, ఎన్నో యాంగిల్స్‌లో 'జగదేకవీరుడు అతిలోకసుందరి' తెలుగు సినిమా చరిత్రలోనే ఒక వండర్, ఒక మైల్ స్టోన్! ఎవరూ ఎప్పటికీ రిపీట్ చేయలేని హిస్టారికల్ ల్యాండ్ మార్క్. ఈ మే 9వ తేదీకి విడుదలై ముప్పై ఏళ్లు. అసలు ముప్పై ఏళ్ల క్రితం మే 9న ఏమైందో తెలుసా? తుఫాను తాకిడిలోనూ ఈ మూవీ కలెక్షన్ కుంభవృష్టి కురిపించింది. చిరంజీవి సినిమాల కమర్షియల్ రేంజ్‌ను సమూలంగా మార్చేసి ఆయనను కొత్త ఎత్తుకు తీసుకువెళ్లింది. ఇక శ్రీదేవిని చూడ్డానికి రెండు కళ్లూ చాలవనిపించింది. దేవకన్య అంటే ఇలాగే ఉంటుంది.. అని అఖిల ప్రజానీకం ఆమోదించింది. అతిలోకసుందరిగా శ్రీదేవి కాకుండా ఇంకెవరైనా అయితే.. అమ్మో.. ఊహించుకోడానికే కష్టం. ఇవాళ ఆ అతిలోకసుందరి భౌతికంగా మన మధ్యలేకపోయినా ఈ సినిమాతో ఆమె మన మనసుల్లో జీవించే ఉంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
