ENGLISH | TELUGU  

'రెడ్' మూవీ రివ్యూ

on Jan 14, 2021

 

సినిమా పేరు: రెడ్‌
తారాగ‌ణం: రామ్‌, నివేదా పేతురాజ్‌, మాళ‌వికా శ‌ర్మ‌, అమృతా అయ్య‌ర్‌, ప‌విత్రా లోకేశ్‌, స‌త్యా, సంప‌త్ రాజ్‌, పోసాని కృష్ణ‌ముర‌ళి, వెన్నెల కిశోర్‌, సోనియా అగ‌ర్వాల్‌, ర‌విప్ర‌కాశ్‌, హెబ్బా ప‌టేల్ (స్పెష‌ల్ అప్పీరెన్స్‌)
క‌థ‌: మ‌గిళ్ తిరుమేని
సంగీతం: మ‌ణిశ‌ర్మ‌
సినిమాటోగ్ర‌ఫీ: స‌మీర్ రెడ్డి
ఎడిటింగ్‌: జునైద్ సిద్దిఖి
ఆర్ట్‌: ఎ.ఎస్‌. ప్ర‌కాశ్‌
స్టంట్స్‌: పీట‌ర్ హెయిన్‌
నిర్మాత‌: స‌్ర‌వంతి ర‌వికిశోర్‌
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: తిరుమ‌ల కిశోర్‌
బ్యాన‌ర్‌: శ్రీ స్ర‌వంతీ మూవీస్‌
విడుద‌ల తేదీ: 14 జ‌న‌వ‌రి 2021

త‌మిళంలో స‌క్సెస్ అయిన 'తాడ‌మ్' మూవీకి రీమేక్‌గా రామ్ పోతినేనితో రెడ్ మూవీని ఎనౌన్స్ చేసిన‌ప్పుడు ఒరిజిన‌ల్ గురించి తెలిసిన‌వాళ్లు ఒకింత ఆశ్చ‌ర్యానికి గుర‌య్యారు. రామ్ ఇప్ప‌టివ‌ర‌కూ ఈ త‌ర‌హా పాత్ర‌లు చెయ్య‌లేదు. కెరీర్ తొలినాళ్ల‌లో క్రైమ్ ఓరియంటెడ్ స్టోరీతో చేసిన 'జ‌గ‌డం' ఫ్లాపయ్యింది. యాక్ష‌న్ బేస్డ్ ల‌వ్ స్టోరీలు, రొమాంటిక్ కామెడీలు అత‌డికి వ‌ర్క‌వుట్ అవుతూ వ‌చ్చాయి. ఇప్పుడు డ్యుయెల్ రోల్‌లో క్రైమ్ బేస్డ్ స్టోరీని అత‌డు ఎలా లాక్కొస్తాడోన‌నే కుతూహ‌లం క‌లిగింది. రామ్‌తో ఇదివ‌ర‌కు 'నేను.. శైల‌జ‌', 'ఉన్న‌ది ఒక‌టే జింద‌గి' సినిమాలు తీసిన తిరుమ‌ల కిశోర్ డైరెక్ష‌న్‌లో స్ర‌వంతి ర‌వికిశోర్ నిర్మించిన ఈ సినిమా ప్రేక్ష‌కుల ఊహ‌ల‌కు త‌గిన‌ట్లే ఉందా?

క‌థ‌
'రెడ్' అనేది అచ్చు గుద్దిన‌ట్లు ఒకేలా క‌నిపించే ఇద్ద‌రు యువ‌కుల క‌థ‌. ఒక‌డు సొంతంగా ఓ బిల్డింగ్ క‌న్‌స్ట్ర‌క్ష‌న్ కంపెనీ మొద‌లుపెట్టిన సివిల్ ఇంజ‌నీర్ సిద్ధార్థ (రామ్‌) అయితే, మ‌రొక‌డు డ‌బ్బు కోసం చిన్న చిన్న మోసాలు చేస్తూ బ‌తికే పేకాట వ్య‌స‌న‌ప‌రుడైన ఆదిత్య (రామ్‌). ఈ ఇద్ద‌రి క‌థ‌లూ ప్యార‌ల‌ల్‌గా న‌డుస్తుంటాయి. త‌న ఆఫీస్ ఉండే బిల్డింగ్‌లోనే మ‌రో సంస్థ‌లో ప‌నిచేసే మ‌హిమ (మాళ‌విక శ‌ర్మ‌) అనే అమ్మాయితో ప్రేమ‌లో ప‌డ‌తాడు సిద్ధార్థ. ఆమె కూడా అత‌డి ప్రేమ‌ను అంగీక‌రిస్తుంది. ఒక‌సారి ఆమె త‌న ఫ్రెండ్స్‌తో క‌లిసి హాలిడే ట్రిప్‌కు వెళ్తుంది. ఆ త‌ర్వాత ఓ హ‌త్య‌కేసులో ల‌భించిన ఫొటో ఆధారంగా సిద్ధార్థను అదుపులో తీసుకుంటారు పోలీసులు. అప్పుడే పోలీసుల‌కు ఒక డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఆదిత్య దొరుకుతాడు. ఒకే పోలిక‌ల‌తో ఉన్న ఆ ఇద్ద‌రిలో ఒక‌రు క‌చ్చితంగా ఆ హ‌త్య చేశార‌ని పోలీసుల‌కు తెలుసు. ఆ ఒక్క‌రు ఎవ‌ర‌నేది పోలీసులు క‌నిపెట్ట‌గ‌లిగారా?  సీఐ ఉద్దేశ‌పూర్వ‌కంగా సిద్ధార్థ‌ను ఎందుకు టార్గెట్ చేశాడు?.. ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం మిగ‌తా క‌థ‌.

విశ్లేష‌ణ‌
ఒరిజిన‌ల్ 'తాడ‌మ్‌'కు కొన్ని మార్పులు చేసి, స్క్రీన్‌ప్లే రాసుకున్నాడు ద‌ర్శ‌కుడు కిశోర్‌. ఎలాంటి క‌న్‌ఫ్యూజ‌న్ లేకుండా భిన్న మ‌న‌స్త‌త్వాలు క‌లిగిన సిద్ధార్థ‌, ఆదిత్య పాత్ర‌ల‌ను అత‌ను మ‌లిచాడు. ఫ‌స్టాఫ్‌ సిద్ధార్థ‌, మ‌హిమ ల‌వ్ స్టోరీతో, ప‌విత్ర (ప‌విత్రా లోకేశ్‌) స‌హాయంతో స‌త్యాతో క‌లిసి డ‌బ్బు కోసం ఆదిత్య చేసే చిల్ల‌ర మోసాల‌తో రొమాంటిక్‌గా, స‌ర‌దాగా సాగుతుంది. సెకండాఫ్ అంతా మ‌ర్డ‌ర్ కేసు చుట్టూ న‌డుస్తుంది. ఫ‌స్టాఫ్ ముగిసే ముందు నుంచీ క‌థ‌కు పోలీస్ స్టేష‌నే కేంద్రం. బోర్ కొట్టించ‌ని క‌థ‌నంతో ఈ స‌న్నివేశాల‌ను క‌ల్పించాడు డైరెక్ట‌ర్‌. సిద్ధార్థ, మ‌హిమ మ‌ధ్య సీన్లు ఆక‌ట్టుకుంటాయి. ఐడెంటిక‌ల్ ట్విన్స్ అయిన‌ప్ప‌టికీ రెండు భిన్న ధ్రువాలుగా సిద్ధార్థ‌, ఆదిత్య ఎందుకు త‌యార‌య్యారనే నేప‌థ్యం క‌న్విన్సింగ్‌గా అనిపిస్తుంది.

ఒక వ్య‌స‌నానికి బానిస అయిన స్త్రీ జీవితం ఎలా త‌యార‌వుతుందో, ఆ వ్య‌స‌నం మంచిది కాద‌ని తెలిసినా, దాన్నుంచి బ‌య‌ట‌ప‌డ‌లేని బ‌ల‌హీన‌త్వంతో ఆమె ఎలా స‌త‌మ‌త‌మ‌వుతుందో ఆ క‌వ‌ల‌ల త‌ల్లి (సోనియా అగ‌ర్వాల్) పాత్ర మ‌న‌కు తెలియ‌జేస్తుంది. ఆ పాత్ర కొంత‌మందికి సానుభూతినీ, కొంత‌మందికి జుగుప్సనూ క‌లిగిస్తుంది. ఆదిత్యపై ఇష్టాన్ని పెంచుకొని, డ‌బ్బు కోసం అబ‌ద్ధం ఆడుతున్నాడ‌ని తెలిసినా, అత‌డు అడిగిన డ‌బ్బు ఇచ్చే గాయ‌త్రి (అమృతా అయ్య‌ర్‌) మంచిత‌నం ముచ్చ‌ట‌గా అనిపిస్తుంది. హ‌త్య‌కేసును ఇన్వెస్టిగేట్ చేసే స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్ యామిని (నివేదా పేతురాజ్‌) నిజాయితీ మ‌న‌ల్ని ఆక‌ట్టుకుంటుంది. ఫ‌స్టాఫ్‌లో స‌త్యా, సెకండాఫ్‌లో వెన్నెల కిశోర్ ఉన్న‌ప్ప‌టికీ హాస్యం పండ‌లేదు.

హ‌త్య‌కేసులో పోలీసులు చేసే ఇన్వెస్టిగేష‌న్‌, ఆ సంద‌ర్భంగా వ‌చ్చే స‌న్నివేశాలు ఆస‌క్తిని రేకెత్తిస్తూ, హ‌త్య చేసింది సిద్ధార్థా, ఆదిత్యా.. అనే క్యూరియాసిటీని రేకెత్తించ‌డంలో డైరెక్ట‌ర్ స‌క్సెస‌య్యాడు. అయితే సెకండాఫ్‌లో స్క్రీన్‌ప్లేను మ‌రింత గ్రిప్పింగ్‌గా రాసుకొని ఉండాల్సింది. డైలాగ్స్ చాలావ‌ర‌కు ఒరిజిన‌ల్‌లో ఉన్న‌వే. త‌మిళ డైలాగ్స్‌ను తెలుగులో రాసుకున్న‌ట్లే అనిపించాయి. చివ‌ర‌లో గాయ‌త్రితో ఆదిత్య "రామాయ‌ణాన్ని ఓ మ‌గాడు కాకుండా ఆడ‌ది రాసున్న‌ట్ల‌యితే సీత‌ను రాముడు అనుమానించేవాడు కాదేమో" అని చెప్ప‌డం స్త్రీకి ఈ సినిమా ఇచ్చిన గౌర‌వాన్ని ప‌ట్టిస్తుంది.

ఉన్నవి మూడు పాట‌లే.. అవి క‌థ‌నానికి అడ్డు త‌గ‌ల‌క‌పోవ‌డం రిలీఫ్‌. మణిశ‌ర్మ మ్యూజిక్‌లో మాస్ సాంగ్ డించ‌క్ డించ‌క్‌, క్లాస్ సాంగ్ నువ్వే నువ్వే ఆక‌ట్టుకున్నాయి. ఎప్ప‌ట్లా మ‌ణిశ‌ర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు మెయిన్ ఎస్సెట్‌. చాలా సీన్ల‌ను త‌న బీజీయంతో ఉత్కంఠ‌భ‌రితంగా ఆయ‌న త‌యారుచేశాడు. స‌మీర్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ, జునైద్ సిద్దిఖి ఎడిటింగ్ ప్ర‌భావ‌వంతంగా ఉన్నాయి. పోలీస్ స్టేష‌న్ సీన్ల‌లో ఎ.ఎస్‌. ప్ర‌కాశ్ ఆర్ట్ వ‌ర్క్ సూప‌ర్బ్‌.

ప్ల‌స్ పాయింట్స్‌
రామ్ చేసిన పాత్ర‌లు, అత‌ని అభిన‌యం
ఫ‌స్టాఫ్ ల‌వ్ స్టోరీ, సెకండాఫ్‌లో పోలీస్ స్టేష‌న్ సీన్లు
మ‌ణిశ‌ర్మ మ్యూజిక్‌, స‌మీర్ రెడ్డి సినిమాటోగ్ర‌ఫీ

మైన‌స్ పాయింట్స్‌
ఫ్లాష్‌బ్యాక్ సీన్లు
ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కు స్కోప్ త‌క్కువ ఇవ్వ‌డం
సెకండాఫ్ స్క్రీన్‌ప్లే గ్రిప్పింగ్‌గా లేక‌పోవ‌డం

న‌టీన‌టుల అభిన‌యం
భిన్న మ‌న‌స్త‌త్వాలు క‌లిగిన సిద్ధార్థ‌, ఆదిత్య పాత్ర‌లు రెండింటిలోనూ రామ్ పోతినేని ఒదిగిపోయాడు. సిద్ధార్థ‌గా ఎంత క్లాస్‌గా ఆక‌ట్టుకున్నాడో, మాస్ రోల్ ఆదిత్య‌గానూ అంత‌గా అల‌రించాడు. ఆ పాత్ర‌ల్లోని వేరియేష‌న్‌కు త‌గ్గ‌ట్లు త‌న బాడీ లాంగ్వేజ్‌ను అత‌ను మార్చిన విధానం ప్ర‌శంస‌నీయం. రెడ్ మూవీని అనాయాసంగా త‌న భుజాల‌పై మోశాడు. హావ‌భావాల ప్ర‌ద‌ర్శ‌న‌లో అత‌ను సాధించిన ప‌రిణ‌తికి ఈ సినిమా ఓ చ‌క్క‌ని నిద‌ర్శ‌నం.

హీరోయిన్లు ముగ్గురూ.. నివేదా పేతురాజ్‌, మాళ‌వికా శ‌ర్మ‌, అమృతా అయ్య‌ర్ ఆక‌ట్టుకున్నారు. ముగ్గురిలో నివేద‌కు ఎక్కువ సీన్లు ల‌భించాయి. య‌స్సై యామినిగా ఆమె ఆహార్యం, హావ‌భావాలు ఉన్న‌త స్థాయిలో ఉన్నాయి. మాళ‌విక త‌న బ్యూటీతో ఆక‌ట్టుకుంటే, త‌క్కువ సీన్ల‌తోటే అమృత త‌న క్యూట్ డైలాగ్స్‌, అమాయ‌క‌పు చూపుల‌తో అల‌రించింది. మూడంటే మూడు సీన్లతో వెన్నెల కిశోర్, అర‌డ‌జ‌ను సీన్ల‌తో స‌త్యా త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. ప‌విత్రా లోకేశ్‌లోని న‌టిని స‌రికొత్త‌గా ప్రెజెంట్ చేసింది ఈ సినిమా. ఇందులో చేసిన సీఐ త‌ర‌హా పాత్ర‌లు సంప‌త్ రాజ్‌కు కొట్టిన పిండి. ప్రేక్ష‌కుల సానుభూతిని పొందే పాత్ర‌లో సోనియా అగ‌ర్వాల్ రాణించింది. పోసానికి న‌టించ‌డానికి త‌గ్గ పాత్ర ల‌భించ‌లేదు. డించ‌క్ డించ‌క్ సాంగ్‌లో హెబ్బా ప‌టేల్ అందాలు ర‌సికుల‌ను అల‌రిస్తాయి.

తెలుగువ‌న్ ప‌ర్‌స్పెక్టివ్‌
యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ల‌ను ఇష్ట‌ప‌డే ప్రేక్ష‌కుల‌కు సంతృప్తినిచ్చే సినిమా 'రె'డ్. రామ్ ఫ్యాన్స్‌ను మ‌రింత‌గా ఈ సినిమా అల‌రిస్తుంది. స్లోగా సాగే సెకండాఫ్ ఫ్యామిలీ ఆడియెన్స్‌ను అంత‌గా మెప్పించ‌క‌పోవ‌చ్చు. ఓవ‌రాల్‌గా ఓసారి చూడ‌ద‌గ్గ సినిమా.

రేటింగ్‌: 2.5/5

- బుద్ధి య‌జ్ఞ‌మూర్తి


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.