'వకీల్ సాబ్' టీజర్.. హీరో వర్షిప్ మూవీగా మారిన లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్!
on Jan 14, 2021
పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ పోషిస్తోన్న 'వకీల్ సాబ్' టీజర్ సంక్రాంతి పర్వదినం సందర్భంగా గురువారం సాయంత్రం విడుదలైంది. బాలీవుడ్లో హిట్టయిన 'పింక్' మూవీకి ఇది రీమేక్. లైంగిక వేధింపులకు గురైన ముగ్గురు యువతులు ఓ వయసుమళ్లిన లాయర్ సాయంతో ఎలా కోర్టులో న్యాయం పొందారనేది ఆ చిత్ర కథాంశం. సినిమా అంతా తాప్సీ, కృతి కుల్హరి, ఆండ్రియా తరియాంగ్ పోషించిన అమ్మాయిల చుట్టూనే తిరుగుతుంది. అమితాబ్ బచ్చన్ లాయర్‌గా సపోర్టింగ్ రోల్లో దర్శనమిస్తారు. అందులో ఆయన రౌడీలతో ఫైట్లు గట్రా ఏమీ చేయరు. అన్యాయానికి గురైన అమ్మాయిల తరపున వాదించడమే ఆయన పని.
కానీ అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్‌ను పవన్ కల్యాణ్ చేస్తున్నారంటే.. సమ్‌థింగ్ స్పెషల్ ఉండాలి కదా! ఆయన సపోర్టింగ్ క్యారెక్టర్లో కనిపిస్తే ఫ్యాన్స్ ఊరుకుంటారా? అందుకే ఫిమేల్ సెంట్రిక్ మూవీ కాస్తా తెలుగుకు వచ్చేసరికి హీరో వర్షిప్ మూవీగా మారిపోయింది. ఆ విషయం ఈ రోజు రిలీజ్ చేసిన టీజర్‌తో స్పష్టమైంది. చిత్రమేమిటంటే ఒక నిమిషం నిడివి కలిగిన ఈ టీజర్లో అసలు ప్రధాన పాత్రధారులైన అమ్మాయిలెవరూ కనిపించలేదు. కేవలం 'వకీల్ సాబ్' మాత్రమే వీరత్వం ప్రదర్శిస్తూ కనిపించారు. నిజానికి వేధింపులకు గురయ్యే అమ్మాయిలుగా నివేదా థామస్, అంజలి, అనన్య నటించారు. వారినెవరినీ ఈ టీజర్లో చూపించలేదు. కోర్టులో "అబ్జక్షన్ యువరానర్" అంటూ వాదిస్తూ కనిపించిన పవన్ కల్యాణ్.. ఆ తర్వాత మెట్రో ట్రైన్లో రౌడీలను చితకబాదుతూ, "కోర్టులో వాదించడమూ తెలుసు.. కోటు తీసి కొట్టడమూ తెలుసు" అంటూ డైలాగ్ చెప్పారు.
టీజర్ రిలీజవడం ఆలస్యం.. ఫ్యాన్స్ దాన్ని ఆన్లైన్లో వైరల్ చేశారు. శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేసిన ఈ మూవీని దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమన్ మ్యూజిక్ ఇస్తున్న ఈ మూవీకి పి.ఎస్. వినోద్ సినిమాటోగ్రాఫర్. అన్నట్లు ఈ మూవీలో పవన్ జోడీగా శ్రుతి హాసన్ నటిస్తున్నారు. ఆ ఇద్దరికీ ఓ డ్యూయెట్ కూడా పెట్టారు. ఒరిజినల్లో అయితే లాయర్ భార్య మంచానికి అతుక్కుపోయిన ఓ రోగిలా మనకు కనిపించారనేది గమనార్హం. ఏదేమైనా ఓ లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్‌ను హీరో ఓరియంటెడ్ ఫిల్మ్‌గా మార్చడంలోనే మన టాలీవుడ్ టాలెంట్ ఏమిటో అర్థమవుతోంది. ఛాలెంజ్‌లను టేకప్ చేయడంలో మనవాళ్లను మించినవాళ్లెవరు! 'వకీల్ సాబ్' చేయబోయే ప్రి బిజినెస్‌కు కానీ, విడుదలయ్యాక చేసే కలెక్షన్‌కు కానీ ఒరిజినల్ ఏమాత్రం మ్యాచ్ కాలేదు. కాదంటారా?