ENGLISH | TELUGU  

'మాస్ట‌ర్' మూవీ రివ్యూ

on Jan 13, 2021

 

సినిమా పేరు:  మాస్ట‌ర్‌
తారాగ‌ణం: విజ‌య్‌, విజ‌య్ సేతుప‌తి, మాళ‌వికా మోహ‌న‌న్‌, ఆండ్రియా జెర్మియా, శంత‌ను భాగ్య‌రాజ్‌, అర్జున్ దాస్‌
డైలాగ్స్‌: రాజేశ్ ఎ. మూర్తి
సాహిత్యం: అనంత శ్రీ‌రామ్‌, కృష్ణ‌కాంత్‌, శ్రీ సాయికిర‌ణ్‌
మ్యూజిక్‌: అనిరుధ్ ర‌విచంద‌ర్‌
సినిమాటోగ్ర‌ఫీ: స‌త్య‌న్ సూర్య‌న్‌
ఎడిటింగ్‌: ఫిలోమిన్ రాజ్‌
ఆర్ట్‌: స‌తీశ్ కుమార్‌
స్టంట్స్‌: స‌్ట‌న్ శివ‌
నిర్మాత‌: జేవియ‌ర్ బ్రిట్టో
ర‌చ‌న‌-ద‌ర్శ‌క‌త్వం: లోకేశ్ క‌న‌క‌రాజ్‌
బ్యాన‌ర్స్‌: ఎక్స్‌బీ ఫిల్మ్ క్రియేట‌ర్స్‌, సెవ‌న్ స్క్రీన్స్ స్టూడియో, ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్‌
విడుద‌ల తేది: 13 జ‌న‌వ‌రి 2021

ద‌ళ‌ప‌తి విజ‌య్ హీరోగా, 'ఖైదీ' ఫేమ్ లోకేశ్ క‌న‌గ‌రాజ్ డైరెక్ష‌న్‌లో 'మాస్ట‌ర్' మూవీ రూపొందుతోంద‌నే విష‌యం తెలిసిన‌ప్ప‌ట్నుంచీ దానిపై వెల్లువెత్తిన అంచ‌నాలు అంబ‌రాన్ని అంటాయి. 'ఖైదీ'తో లోకేశ్ వేసిన ముద్ర అలాంటిది మ‌రి. ఎప్పుడో విడుద‌ల కావాల్సిన ఈ సినిమా క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా వాయిదాప‌డి, ఎట్ట‌కేల‌కు ఇప్పుడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ప్రేక్ష‌కుల అంచ‌నాల‌కు అనుగుణంగా మాస్ట‌ర్ ఉన్నాడా? ప‌దండి చూద్దాం...

క‌థ‌
వ‌రంగ‌ల్‌లోని సెయింట్ జేవియ‌ర్‌ కాలేజీలో ప్రొఫెస‌ర్ ప‌నిచేసే జె.డి. (విజ‌య్‌) అనే వ్య‌క్తి సింగిల్‌గా బ‌తుకుతుంటాడు. స్టూడెంట్స్ ఎఫైర్స్ డిపార్ట్‌మెంట్‌కు డీన్ కూడా అయిన అత‌డికి స్టూడెంట్స్‌లో ఉండే ఫాలోయింగ్ మామూలుది కాదు. సాయంత్రం ఆరైతే చాలు.. మ‌నోడు మందులో మునిగి తేలుతుంటాడు. స్టూడెంట్స్ ఎల‌క్ష‌న్స్‌లో జె.డి. మ‌ద్ద‌తిచ్చిన అమ్మాయి గెలిచి, అపోజిష‌న్ అబ్బాయి ఓడిపోయిన‌ప్పుడు త‌ట్టుకోలేని అత‌ని తండ్రి కాలేజీలో బీభ‌త్సం సృష్టిస్తే, స్టూడెంట్స్ స‌హ‌కారంతో వారి ఆట క‌ట్టిస్తాడు జె.డి. అత‌డిని ఓ బాల‌నేర‌స్తుల అబ్జ‌ర్వేష‌న్ హోమ్‌కు మూడు నెల‌ల పాటు మాస్ట‌ర్‌గా పంపిస్తారు. ఒక‌ప్పుడు ఆ గృహంలో గ‌డిపి, త‌ర్వాత గ్యాంగ్‌స్ట‌ర్‌గా మారిన భ‌వానీ (విజ‌య్ సేతుప‌తి), అక్క‌డి పిల్ల‌లకు మ‌త్తుమందు అల‌వాటు చేసి, వారిచేత అరాచ‌కాలు చేయిస్తున్న విష‌యం తెలుసుకుంటాడు జె.డి. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది? ఆ హోమ్‌లో మాస్ట‌ర్‌కు ఎలాంటి అనుభ‌వాలు ఎదుర‌య్యాయి?  జె.డి., భ‌వానీ మ‌ధ్య యుద్ధం ఏ తీరానికి చేరింద‌నేది మిగ‌తా క‌థ‌.

విశ్లేష‌ణ‌
కార్తీని 'ఖైదీ'గా చూపి, ఇటు విమ‌ర్శ‌కుల‌, అటు ప్రేక్ష‌కుల అభిమానాన్ని అమితంగా పొందిన లోకేశ్ క‌న‌క‌గ‌రాజ్‌, విజ‌య్‌ను 'మాస్ట‌ర్‌'గా జ‌న‌రంజ‌కంగా తీర్చిదిద్ద‌డంలో ఘోరంగా విఫ‌ల‌మ‌య్యాడు. 'ఖైదీ'కి స్క్రీన్‌ప్లే బ‌ల‌మైతే, 'మాస్ట‌ర్‌'కు అదే స్క్రీన్‌ప్లే గుదిబండ‌. ఆరంభంలో విజ‌య్ సేతుప‌తి గ్యాంగ్‌స్ట‌ర్‌గా మార‌డానికి దారితీసిన ప‌రిస్థితుల‌ను ఇంప్రెసివ్‌గా తీసిన లోకేశ్‌.. విజ‌య్ ఎంట్రీ సీన్ ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేస‌రికి దారి త‌ప్పాడు. నిర్ల‌క్ష్యానికి ప‌రాకాష్ఠ‌గా కనిపించే అత‌డి వ్య‌క్తిత్వం, ప్ర‌వ‌ర్త‌న చూస్తే.. అత‌డిని స్టూడెంట్స్ అంత‌గా ఎందుకు ఆరాధిస్తున్నార‌నే విష‌యం మ‌న‌కు అర్థం కాదు.

కాలేజీలో ఓ మంత్రి పాల్గొన్న కార్య‌క్ర‌మానికి త‌న ఇంటి ద‌గ్గ‌ర మ‌త్తులో మునిగి ప‌డుకొని ఉన్న జె.డి.ని తీసుకురావ‌డానికి స్టూడెంట్స్ ఒక డ్రమ్స్ బృందాన్ని తీసుకువెళ్లి, డ్ర‌మ్స్ వాయిస్తూ, నిద్ర‌లేపి, అక్క‌డ్నుంచే డాన్స్ చేయించుకుంటూ కాలేజీకి తీసుకువ‌చ్చే సీన్‌ను పావుగంట సేపు లాగి లాగి చూపించ‌డంతోటే మొద‌లైన చికాకు.. చివ‌రి దాకా కొన‌సాగింది. అనేక స‌న్నివేశాల్ని అన‌స‌వ‌రంగా లాగ‌డం వల్ల క‌థనంలో ఆస‌క్తి సన్న‌గిల్లుతూ పోయింది. భ‌వానీ పాత్ర‌కు సంబంధించిన స‌న్నివేశాల్ని గ‌గుర్పాటు క‌లిగేలా చిత్రించిన ద‌ర్శ‌కుడు, జె.డి. పాత్ర‌ను ఆక‌ర్ష‌కంగా చిత్రించ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు. అత‌డు ఎందుకు సాయంత్ర‌మ‌య్యేస‌రికి మ‌త్తులో చిత్త‌వుతుంటాడ‌నే విష‌యాన్ని క‌న్విన్సింగ్‌గా అత‌ను చూపించ‌లేదు. అత‌ను స్టూడెంట్‌గా ఉన్న‌ప్పుడు అత‌ను బాగా ఇష్ట‌ప‌డే ప్రొఫెస‌ర్ చ‌నిపోవ‌డంతో, అలా త‌యార‌య్యాడంటూ ఓ డైలాగ్‌తో చెప్పి స‌రిపుచ్చారు. దీంతో ఎమోష‌న‌ల్‌గా జె.డి. క్యారక్ట‌ర్‌తో మ‌నం క‌నెక్ట్ కాలేం. చివ‌రి దాకా ఇదే ప‌రిస్థితి.

ఫ‌స్టాఫ్ బోరింగ్‌గా ఉంద‌నుకుంటే, సెకండాఫ్ దానికి తీసిపోన‌ట్లు కొన‌సాగింది. అబ్జ‌ర్వేష‌న్ హోమ్‌లో జ‌రిగే దారుణాలు జుగుప్స క‌లిగించే రీతిలో క‌నిపిస్తాయి. అలా అక్క‌డ జ‌రిగిన ఓ దారుణంతో జె.డి. మ‌త్తు వ‌దులుతుంది. ఆ త‌ర్వాత‌నైనా క‌థ‌నం ఇంట్రెస్ట్‌గా సాగుతుంద‌నుకుంటే అలా జ‌ర‌గ‌లేదు. క్లైమాక్స్ కూడా ఆక‌ట్టుకోలేక‌పోయింది. లారీకీ, డైరెక్ట‌ర్ లోకేశ్‌కూ ఏదో క‌నెక్ష‌న్ ఉన్న‌ట్లుంది. 'ఖైదీ'లో చివ‌రాఖ‌రి దాకా హీరో లారీ తోలుతూ క‌నిపించ‌డం చూశాం. ఇందులోనూ క్లైమాక్స్‌ను 40 లారీల‌తో చిత్రించాడు. పైగా భ‌వానీ ల‌క్ష్యం లారీ ఓన‌ర్స్ అసోసియేష‌న్ ప్రెసిడెంట్ కావ‌డం. ఉన్న రెండు పాట‌లూ ఆక‌ట్టుకోలేదు. పైకి చూస్తే.. క‌థ‌లో మంచి పాయింటే ఉంది. కానీ దాని ప్రెజెంటేష‌న్‌లో లోకేశ్‌లోని రైట‌ర్‌, డైరెక్ట‌ర్‌.. ఇద్ద‌రూ ఫెయిల‌య్యారు. అక్క‌డ‌క్క‌డా డైలాగ్స్ అల‌రిస్తాయి. ముఖ్యంగా భ‌వానీ నోట ప‌లికించే డైలాగ్స్ ఆక‌ట్టుకున్నాయి. సినిమాలో వినోదం పాలు బాగా తక్కువై, క్రైమ్ అండ్ యాక్ష‌న్ పార్ట్ ఎక్కువైంది. వాటినైనా ఆక‌ట్టుకొనేలా తియ్య‌లేక‌పోయాడు లోకేశ్‌. క‌నీసం ఓ అర‌గంట నిడివిని త‌గ్గించిన‌ట్ల‌యితే కొంత త‌ల‌నొప్పి త‌గ్గి ఉండేది.

ప్ల‌స్ పాయింట్స్‌
విజ‌య్ సేతుప‌తి న‌ట‌న‌
సినిమాటోగ్ర‌ఫీ, బ్యాగ్రౌండ్ స్కోర్‌
అక్క‌డ‌క్క‌డా మెరిసిన డైలాగ్స్‌

మైన‌స్ పాయింట్స్‌
మాస్ట‌ర్ క్యారెక్ట‌ర్‌ను మ‌ల‌చిన విధానం
ల్యాగింగ్ స్క్రీన్‌ప్లే
ప్రీ క్లైమాక్స్‌, క్లైమాక్స్ ఆక‌ట్టుకోలేక‌పోవ‌డం
ఎమోష‌న‌ల్ లింక్ మిస్స‌వ‌డం
ఎంట‌ర్‌టైన్‌మెంట్ లేక‌పోవ‌డం

న‌టీన‌టుల అభిన‌యం
కాలేజీలో ప్రొఫెస‌ర్ జె.డి.గా క‌నిపించిన‌ప్పుడు విజ‌య్ ఆహార్యం ఆక‌ట్టుకోలేదు. అత‌డికి ఆ వేషం న‌ప్ప‌లేద‌నేది నిజం. అబ్జ‌ర్వేష‌న్ హోమ్‌కు వ‌చ్చి, మ‌నిషి మారాక, వేష‌మూ మారిన‌ప్పుడే అత‌ను బాగున్నాడు. న‌టన‌కు వంక పెట్టాల్సింది లేక‌పోయినా, పాత్ర తీరు వ‌ల్ల మొత్తానికి 'మాస్ట‌ర్‌'గా విజ‌య్ అల‌రించ‌లేక‌పోయాడు. భ‌వానీగా విజ‌య్ సేతుప‌తి చెల‌రేగిపోయాడు. ప‌చ్చినెత్తురు తాగే రాక్ష‌సుడిలాంటి క్రూరుడి పాత్ర‌ను సునాయాసంగా చేసుకుపోయాడు. నిజానికి ఈ సినిమా విజయ్‌ది కాదు, విజ‌య్ సేతుప‌తిదే. కాలేజీ లెక్చ‌ర‌ర్ చారుల‌త‌గా మాళ‌వికా మోహ‌న‌న్ బాగానే న‌ప్పింది. భ‌వానీ త‌ర‌పున హోమ్‌లో అరాచ‌కాలు చేసే దాస్‌గా అర్జున్ దాస్, ప్రొఫెస‌ర్‌గా ఆండ్రియా, స్టూడెంట్స్‌గా శంత‌ను భాగ్య‌రాజ్‌, గౌరీ కిష‌న్ త‌మ పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు.

తెలుగువ‌న్ ప‌ర్‌స్పెక్టివ్‌
'ఖైదీ' తీసిన ద‌ర్శ‌కుడేనా ఈ సినిమా తీసింది? అనే ప్ర‌శ్న వేసుకొనేలా చేసింది 'మాస్ట‌ర్‌'. టైటిల్ రోల్‌ను మ‌ల‌చిన విధానం కానీ, క‌థ‌నం కానీ ఏమాత్రం ఆక‌ట్టుకోని త‌ల‌నొప్పి సినిమా మాస్ట‌ర్‌.

రేటింగ్‌: 2/5

- బుద్ధి య‌జ్ఞ‌మూర్తి


Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.