ప్లాన్ ప్రకారమే రాహుల్ సిప్లిగంజ్‌పై దాడి?
on Mar 5, 2020

బుధవారం రాత్రి రాహుల్ సిప్లిగంజ్‌పై దాడి మాటా మాటా పెరగడం వల్ల జరిగింది కాదనీ, పక్కా ప్లాన్ ప్రకారమే జరిగిందంటూ ఒక వాదన వినిపిస్తోంది. రాహుల్‌పై దాడికి పాల్పడినవాళ్లు వికారాబాద్‌కు చెందిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి బంధువులని తెలిసింది. గతంలో ఒక యువతి విషయంలో రాహుల్ గ్రూపుకూ, అతనిపై దాడి చేసిన గ్రూపుకూ మధ్య వివాదం తలెత్తి, గొడవకు కారణమైందని వినిపిస్తోంది. ఆ వ్యవహారాన్ని మనసులో పెట్టుకున్న ఆ గ్రూపు ఒక పథకం ప్రకారం పబ్‌లో రాహుల్‌తో గొడవకు దిగి, బీర్ బాటిళ్లతో దాడి చేశారని సమాచారం. బీర్ బాటిల్‌తో ఒక వ్యక్తి రాహుల్ తలపై కొట్టడం, మరో వ్యక్తి రాహుల్‌ని పట్టుకొని ముఖంపై పిడిగుద్దులు కురిపించడంతో అతనికి గాయాలయ్యాయి.
ఈ ఘటన అనంతరం గచ్చిబౌలిలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో రాహుల్ చికిత్స చేయించుకుంటున్నాడు. తనపై జరిగిన దాడి గురించి అతను పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం చర్చనీయాంశమైంది. అయినప్పటికీ ఈ వ్యవహారం బహిర్గతం కావడం, రాహుల్‌పై దాడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు సుమొటోగా కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వారు పబ్ నిర్వాహకుల్ని ప్రశించినట్లు సమాచారం.
రాహుల్ తల్లి అయితే ఈ గొడవ గురించి తమకేం తెలియదని చెప్తుండటం గమనార్హం. "ఒక మీటింగ్ ఉందని రాహుల్ నిన్న సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి వాళ్ల నాన్న ఫోన్ చేస్తే వర్క్‌లో ఉన్నానని చెప్పాడు. రాహుల్‌పై దాడి జరిగిందని పొద్దున టీవీలో చూసే దాకా మాకు తెలీదు. రాహుల్ హాస్పిటల్లో ఉన్నాడని తెలిసింది. వాళ్ల డాడీ వెళ్లాడు. ఏ హాస్పిటల్ అనేది కూడా నాకు తెల్వదు. నన్ను రెడీగా ఉండమని, తాను వచ్చి తీసుకుపోతానని ఆయన చెప్పాడు. రాహుల్‌ను ఎవరు, ఎందుకు కొట్టారో నాకు తెల్వదు" అంటూ ఆమె మీడియాతో చెప్పారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



