అలలా ఎగసి.. అనంత లోకాలకు తరలిపోయిన ఆర్తీ అగర్వాల్ జయంతి నేడు!
on Mar 5, 2020

అపురూప సౌందర్యానికి చిలిపిదనం, ముగ్ధత్వం తోడైతే.. ఆ రూపం కచ్చితంగా ఆర్తీ అగర్వాల్ అవుతుంది. వెండితెర వెలుగు జిలుగుల వెనుక పలికే విషాద రాగానికి నిలువెత్తు నిదర్శనం కూడా ఆర్తీ అగర్వాల్. వెంకటేశ్‌తో నటించిన 'నువ్వు నాకు నచ్చావ్' మూవీతో టాలీవుడ్‌లో అడుగుపెట్టి రాత్రికి రాత్రే యువతరం కలల రాణిగా ఆవిర్భవించిన ఆమె, కేవలం 14 ఏళ్ల కెరీర్‌తోటే ఈ లోకాన్ని వీడి వెళ్లడం కంటే విషాదం ఇంకేముంటుంది. ఆమె మరణానికి దారి తీసిన పరిస్థితులు, అంతకు ముందు జీవితంలో ఆమె ఎదుర్కొన్న క్లిష్ట సందర్భాలు తెలుసుకుంటే గుండెలు పిండేసినట్లు అయిపోతాయి.
అమెరికాలోని న్యూజెర్సీలో స్థిరపడిన గుజరాతీ దంపతులు కౌశిక్ అగర్వాల్, వీమా అగర్వాల్ దంపతులకు 1984 మార్చి 5న జన్మించింది ఆర్తి. ఆమెకు అదితి అనే చెల్లెలు కూడా ఉంది. ఫిలడెల్ఫియాలో ఒక స్టేజ్ షోలో ఆర్తీ డాన్స్ చూసి ముచ్చటపడ్డ వారిలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా ఉన్నారు. బాలీవుడ్‌కు వస్తే ఆమె నటిగా రాణిస్తుందని కౌశిక్ అగర్వాల్‌తో ఆయన చెప్పారు. దాంతో.. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఒక వెలుగు వెలగాలనే కోటి ఆశల్ని మోసుకుంటూ ముంబై వచ్చి యాక్టింగ్‌లో ట్రైనింగ్ తీసుకుంది. 2001లో ఆమె ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. జాయ్ అగస్టీన్ డైరెక్ట్ చేసిన 'పాగల్‌పన్' అనే హిందీ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. అందులో ఆమె అందచందాలు, అభినయం ఆకట్టుకున్నాయి. ఆ వెంటనే టాలీవుడ్ నుంచి పిలుపు అందింది. అది వెంకటేశ్ హీరోగా నటిస్తున్న 'నువ్వు నాకు నచ్చావ్' సినిమా. వెంకటేశ్ స్టార్ హీరో అని తెలియగానే వెంటనే ఒప్పేసుకుంది ఆర్తి. అందులో నందిని పాత్రలో ఆర్తీ ఇంకా మన కళ్ల ముందు మెదులుతూనే ఉంది. థియేటర్లలో ఎంత బ్లాక్‌బస్టర్ అయ్యిందో, టీవీలో అంతకంటే ఎక్కువ ఆదరణ పొందిన ఆ సినిమా ఇప్పటికి ఎన్నిసార్లు టెలికాస్ట్ అయ్యిందో లెక్కలేదు. అపురూప సౌందర్యం, అయస్కాంత శక్తితో కుర్రకారు కలల రాకుమారి అయిపోయింది ఆర్తి.
కొంతకాలం దాకా ఆమె వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం కలగలేదు. ఒక్క పవన్ కల్యాణ్ మినహా అప్పటి స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్, మహేశ్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ సరసన నాయికగా నటించింది. వాటిలో 'ఇంద్ర', 'పలనాటి బ్రహ్మనాయుడు', 'నేనున్నాను', 'వసంతం', 'బాబీ', 'అల్లరి రాముడు' వంటి సినిమాలు ఉన్నాయి.
ఆర్తీ అగర్వాల్ తన కెరీర్‌లో 'రాముడు' అనే టైటిల్ వచ్చే మూడు సినిమాల్లో నటించడం ఒక విశేషం. జూనియర్ ఎన్టీఆర్‌తో 'అల్లరి రాముడు', సునీల్‌తో 'అందాల రాముడు' సినిమా చేసిన ఆమె ప్రభాస్ జోడీగా 'అడవి రాముడు' సినిమా చేసింది. ఒకప్పటి కమర్షియల్ బ్లాక్‌బస్టర్ 'అడవి రాముడు' సినిమాలో ఎన్టీఆర్, జయప్రద జంట నటించిన సూపర్ హిట్ సాంగ్ 'ఆరేసుకోబోయి పారేసుకున్నాను హరి'ని ఈ 'అడవి రాముడు'లో రిక్రియేట్ చేయడం గమనార్హం. ప్రభాస్, ఆర్తీ జోడీపై తీసిన ఈ పాట కూడా అలరించింది.
ఆ రోజుల్లో ఉదయ్ కిరణ్ ఒక సంచలన హీరో. ఆర్తీ తరహాలోనే వచ్చీ రాగానే స్టార్ అయిపోయిన ఉదయ్.. తర్వాత కాలంలో కెరీర్‌లో ఎదుగుదల లేక, డిప్రెషన్‌కు గురై ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడటం మనకు తెలుసు. ఉదయ్‌తోనూ ఆర్తీ ఒక సినిమాలో నటించింది. అది.. 'నీ స్నేహం'. మెగాస్టార్ చిరంజీవితో చేసిన బ్లాక్‌బస్టర్ మూవీ 'ఇంద్ర' తర్వాత ఆర్తీ నటించిన సినిమా 'నీ స్నేహం'. అందులో 'చినుకు తడికి చిగురు పూవమ్మా', 'వేయి కన్నులతో వేచి చూస్తున్నా' పాటలు బాగా పాపులర్ అయ్యాయి. మాధవ్‌ను అపార్థం చేసుకొని, శ్రీనుతో పెళ్లికి సిద్ధపడి, ఆ తర్వాత తన అజ్ఞాత ప్రేమికుడు మాధవేననే నిజం తెలుసుకొనే అమృత పాత్రలో ఆర్తి రాణించింది.
2005 మార్చిలో తెలుగుదేశంతా ఒక్కసారి ఉలిక్కిపడింది. కారణం.. ఆర్తీ అగర్వాల్ క్లీనింగ్ కెమికల్ తాగి ఆత్మహత్యా యత్నం చేసిందనే వార్త. హీరో తరుణ్‌తో తనకు సంబంధం ఉన్నట్లు జరుగుతున్న ప్రచారంతో విసిగిపోయి ఆ పని చేసినట్లు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఆమె తెలిపింది. తరుణ్‌తో ఆమె ప్రేమలో పడిందని, ఆ ఇద్దరూ కలిసి తిరుగుతున్నారనీ ఫిలింనగర్‌లో జోరుగా ప్రచారమైన మాట నిజం. తెలుగులో ఆమె రెండో సినిమా 'నువ్వు లేక నేను లేను' హీరో తరుణే. అప్పుడు చిగురించిన స్నేహం, క్రమేణా ప్రేమగా మారిందని అంటారు. ఆ తర్వాత ఆ ఇద్దరూ కలిసి 'సోగ్గాడు' సినిమా చేశారు. ఆ సినిమా మరో ఎనిమిది రోజుల్లో విడుదల అవుతుందనంగా ఆర్తి ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. ఆమె జీవితంలోని మరో కోణం తొలిసారి బయటి ప్రపంచానికి తెలిసిన సందర్భం అది.
మరో ఏడాది పూర్తవకముందే, అంటే 2006 ఫిబ్రవరి 15న అనుమానాస్పద స్థితిలో తన నివాసం మెట్లపై నుంచి జారి కిందపడటంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. ఆమె జుట్టు కూడా డాక్టర్లు తొలగించారు. ఆ ఘటన వెనుక రకరకాల వదంతులు వినిపించాయి. ఆ గాయం నుంచి కోలుకున్న ఆర్తీ.. తలకు విగ్గుపెట్టుకొని మరీ 'అందాల రాముడు' సినిమాలో కమెడియన్ నుంచి హీరోగా మారిన సునీల్ సరసన నటించింది. బహుశా సునీల్‌తో నటించడం వల్లే కావచ్చు.. ఆమెకు మళ్లీ స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు రాలేదు. ఐదేళ్ల స్వల్ప కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఒక వెలుగు వెలిగిన ఆర్తీ కెరీర్ మసక బారడం మొదలైంది.
ఆమె కూడా జీవితంలో స్థిరపడాలని నిర్ణయించుకొని న్యూజెర్సీకే చెందిన ప్రవాస భారతీయుడు ఉజ్వల్ నికంను 2007 నవంబర్‌లో వివాహం చేసుకుంది. దురదృష్టవశాత్తూ ఆ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. ఇద్దరి మనసులు కలవక విడాకులు తీసుకున్నారు. ఇలా వ్యక్తిగత జీవితంలో తగిలిన దెబ్బలు, కెరీర్ ఆశాజనకంగా లేకపోవడంతో కొంత కాలం అమెరికాలోనే ఉన్న ఆమె తిరిగి హైదరాబాద్ వచ్చి 'వనకన్య వండర్ వీరుడు', 'రణం 2' వంటి చిన్న సినిమాలు చేసింది. చివరగా 'జంక్షన్‌లో జయమాలిని' అనే సినిమా కోసం బరువు తగ్గడానికి చేసిన ప్రయత్నం ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది. అమెరికాలో లైపోసక్షన్ సర్జరీ చేయించుకున్న ఆమె, అది వికటించడంతో హార్ట్ ఎటాక్‌కు గురై 2015 జూన్ 6న న్యూజెర్సీలోని తన ఇంట్లోనే అనూహ్యంగా కన్ను మూసింది.
ఇప్పటికీ మనం 'నువ్వు నాకు నచ్చావ్'లోని నందిని పాత్రను, ఆ పాత్రలో ఆర్తీని చూసి ప్రేమలో పడుతూనే ఉన్నాం. ఆమె ఆకర్షణ అలాంటిది. వి మిస్ యు ఆర్తీ అగర్వాల్.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



