రవితేజ వరుసగా సెకండ్ హిట్ కొడతాడా?
on Apr 13, 2021
వరుస ఫ్లాపులకు అడ్డుకట్ట వేసి, ఎట్టకేలకు క్రాక్ మూవీతో సూపర్ హిట్ కొట్టాడు మాస్ మహారాజా రవితేజ. వాస్తవానికి గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేసిన క్రాక్ మూవీ లాక్డౌన్ అనంతరం థియేటర్లు తెరుచుకున్నాక దేశంలోనే ఘన విజయం సాధించిన తొలి పెద్ద సినిమాగా రికార్డుల్లోకి ఎక్కింది. శ్రుతి హాసన్ నాయికగా నటించిన ఈ సినిమా నిర్మాతలకు, బయ్యటర్లకు భారీ లాభాలు అందించింది. కఠారి కృష్ణ అనే క్రూరమైన రౌడీ షీటర్ ఆటకట్టించిన పవర్ఫుల్ పోలీస్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్లో రవితేజ నటనకు ఆడియెన్స్ నీరాజనం పట్టారు. మాస్ మహారాజా ఈజ్ బ్యాక్ అని ఫ్యాన్స్ తెగ సంబరపడ్డారు.
అదే ఊపులో రవితేజ ఇప్పుడు వరుసగా సెకండ్ హిట్ సాధిస్తాడని వారు ఆశిస్తున్నారు. క్రాక్ తర్వాత రవితేజ నటించిన ఖిలాడి మూవీ రిలీజ్‌కు రెడీ అవుతోంది. రాక్షసుడు లాంటి హిట్ మూవీ తర్వాత రమేశ్ వర్మ డైరెక్ట్ చేస్తోన్న సినిమా కావడంతో ఖిలాడిపై మంచి అంచనాలే నెలకొన్నాయి. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్‌తో ఆ అంచనాలు మరింత పెరిగాయన్నది నిజం. డిస్కో రాజా తర్వాత మరోసారి డ్యూయల్ రోల్లో రవితేజ నటిస్తోన్న సినిమా ఖిలాడి. క్రైమ్, మిస్టరీ ఎలిమెంట్స్ మేళవించిన యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమాని రమేశ్ వర్మ రూపొందిస్తున్నాడు. టీజర్ కట్ చేసిన విధానం చూస్తే సినిమాని ఎప్పుడెప్పుడు చూద్దామా అనే కుతూహలం కలిగింది.
అనిల్ రావిపూడి రూపొందించిన రాజా ది గ్రేట్ మూవీ మంచి హిట్టవడంతో తర్వాత వచ్చిన అంచనాలను టచ్ చేసి చూడు సినిమా నిలబెట్టుకోలేక డిజాస్టర్ అయ్యింది. ఆ తర్వాత వచ్చిన నేల టిక్కెట్టు, అమర్ అక్బర్ ఆంటోని, డిస్కో రాజా సినిమాలు సైతం అదే బాటలో పయనించాయి. అలా నాలుగు వరుస ఫ్లాపులతో చిక్కుల్లో పడిన రవితేజను క్రాక్ మూవీ బయటపడేసింది. అది ఒక్క సినిమాకే పరిమితం కాదనీ, రవితేజ హిట్ బాటలోకి వచ్చేశాడనీ అనిపించుకోవాలంటే ఖిలాడి హిట్టవ్వాల్సిందే. మే 28న ఈ సినిమాని తీసుకు రావాలని నిర్మాతలు ప్రయత్నిస్తున్నారు. పరిస్థితులు సానుకూలంగా ఉండి, ఆ రోజు సినిమా వచ్చే అవకాశాలు ఎక్కువే. రవితేజ బాక్సాఫీస్ దగ్గర వరుసగా రెండో హిట్‌ని సాధిస్తాడో, లేదో.. లెటజ్ వెయిట్ అండ్ సీ.