ఎన్టీఆర్ ను నాన్న దేవుడిగా చూసేవారు.. రవిబాబు ఎమోషనల్!
on Dec 26, 2022

నటుడు, నిర్మాత చలపతిరావు ఇక లేరు. దాదాపు ఆరు దశాబ్దాల సినీ జీవితంలో 12 వందలకు పైగా చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా, హాస్యనటునిగా పలు పాత్రలు పోషించారు. ఇక తన తండ్రి మరణం గురించి ఆయన వ్యక్తిత్వం గురించి కుమారుడు, నటుడు, నిర్మాత, దర్శకుడు రవిబాబు స్పందిస్తూ.. ఆయన జీవితంలో అందర్నీ ఎలా నవ్విస్తారో అలానే నవ్వుతూ అంతే సంతోషంగా వెళ్లిపోయారు. భోజనం ప్లేటు అలా పట్టుకొని సీట్లోనే వాలిపోయారు అని రవిబాబు తెలిపాడు.
ఇంకా రవి బాబు మాట్లాడుతూ మా నాన్న చలపతిరావు గురించి మా కంటే మీకే ఎక్కువగా తెలుసు. మా నాన్న ఎలా ఉంటారో చిన్నతనంలో మాకు తెలియదు. నేను ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత చలపతిరావు గురించి అందరూ చెప్పడం ద్వారానే చాలా తెలుసుకున్నాను. ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరితో నాన్నకు ఎంతో మంచి అనుబంధం ఉండేది. మాకు ఆరోగ్యం బాగా లేకపోతే హాస్పిటల్ లో చూపించారు. మాకు కష్టాలు వస్తే ఆదుకొన్నారు... అని వాళ్ళు చెబుతుంటే మా నాన్న ఇంత మంచి వాడా అని తెలిసింది. ఇలా తనదైన పద్ధతిలో అందరితో కలిసి మెలిసి అందరి చేత బాబాయి అనిపించుకున్నాడు. మా నాన్నకు జీవితంలో మూడే మూడు విషయాలు ఇష్టం. ఒకటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు.... రెండోది మంచి ఆహారం... మూడోది హాస్యం. హాస్యం అంటే ఎంత ఇష్టమంటే తనకు తెలియని వారిపై కూడా జోక్స్ వేసి నవ్వించడం కూడా నాకు బాగా తెలుసు. అందరితో నవ్వుతూ, సంతోషంగా ఉండేవారు. మంచి లైఫ్ లీడ్ చేశారు. రామారావును దేవుడిగా చూసేవారు. ఆయనతో సుదీర్ఘమైన అనుబంధం కొనసాగించారు. ఆయన సరదాగా ఉండి ఎలాంటి కష్టం తెలియకుండా మరణించారు. ఇంతకంటే మంచి మరణం ఎవరికి సంభవిస్తుంది...? అని రవిబాబు వేదాంత ధోరణిలో చెప్పుకొచ్చాడు.
చలపతిరావు మనసు ఎప్పుడు హ్యాపీగా ఉండేది. మనకు డబ్బు కీర్తి ఉంటుంది. కానీ ఆనందం అనేది కొనుక్కునేది కాదు. ఎంత డబ్బు పెట్టి కొన్న అది దొరకదు. అది ఆయనకు చాలా సహజంగా లభించింది. మా నాన్నగారు చాలా సంతోషంతో, ఎలాంటి నొప్పి బాధ లేకుండా వెళ్లిపోయారు. ఆయన జీవితాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించారు. ఆయన చివరిసారిగా నేను రూపొందిస్తున్న సినిమాలో ఐదు రోజుల క్రితం నటించారు. ఆయనను కష్టపెట్టకుండా కుర్చీలో కూర్చోబెట్టి షూట్ చేశాం. ఆయనకు అదే చివరి చిత్రం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని కోరుకుంటున్నాను అని రవిబాబు ఎమోషనల్ అయ్యాడు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



