ఆ ఘటనతో సూసైడ్ చేసుకోవాలనుకున్న చలపతిరావు!
on Dec 26, 2022

తెలుగు ఇండస్ట్రీ లో ఈ ఏడాది చివర పలు విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవలే రెబల్ స్టార్ కృష్ణంరాజు, సూపర్ స్టార్ కృష్ణ మరణించారు. ఇక మూడు నాలుగు రోజుల క్రితమే విలక్షణ నటుడు, నవరస నటనా సార్వభౌమ, సీనియర్ యాక్టర్ అయిన కైకాల సత్యనారాయణ పరమపదించారు. ఇది మరువకముందే ఇప్పుడు మరో ప్రముఖ విలక్షణ నటుడు చలపతిరావు గుండెపోటుతో ప్రాణాలు విడిచారు. చలపతిరావు ఎన్నో వందల చిత్రాలలో నటించారు. ఆయన కరడు కట్టిన విలన్ గా, కామెడీ విలన్ గా మెప్పించారు. గత కొంతకాలంగా హాస్య పాత్రలు, హీరోలు, హీరోయిన్లకు తండ్రి పాత్రలు ఇతర వేషాలతో కామెడీని అద్భుతంగా పండిస్తున్నాడు. అల్లరి సుభాషినితో పలు చిత్రాల్లో ఆయన పండించిన హాస్యం ఎందరికో విపరీతంగా నచ్చింది. తనదైన టైమింగ్ తో ఆయన కామెడీ చేసే విధానం ఆహా అనిపించింది. ఇంత మంచి హాస్యనటుడిని కూడా మన సరిగా వినియోగించుకోలేదేమో అనే బాధ కలిగితే అది తప్పు కాదు. ఇక తెలుగు ఇండస్ట్రీలో అత్యధిక సార్లు ఆడవారిని రేప్ చేసిన సినీ విలన్ గా ఆయనపై ఓ బ్రాండ్ ఉంది. దాన్ని ఆయన తమాషాగా నేను తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే అత్యధిక మానభంగాలు చేశాను సుమా! అనేవాడు. అందరూ ఆయన్ని బాబాయి.... బాబాయి అని పిలిచేవారు. 50 ఏళ్లకు పైగా తనదైన విలక్షణతో ప్రేక్షకులను అలరించాడు.
సాధారణంగా నటులు ప్రేక్షకులను ఆరాధించేందుకు ఎన్నో సాహసాలు చేస్తుంటారు. కానీ వాళ్ళ నిజ జీవితాల్లో ఎన్నో విషాదకర సంఘటనలు ఉంటాయి. అలాగే చలపతిరావు లైఫ్ లోను ఇలాంటి ఎన్నో సంఘటనలు చోటు చేసుకున్నాయి. భార్య మృతి నుండి ఎన్నో విషాదాలు వచ్చాయి. అయినప్పటికీ ఆయన తుది శ్వాస విడిచే వరకు ప్రేక్షకులను అలరించే ప్రయత్నం చేశారు. చలపతిరావు కెరీర్‌పరంగా సత్తా చాటుతున్న సమయంలోనే ఇందుమతిని వివాహం చేసుకున్నారు. వీళ్లకు వెంటవెంటనే ముగ్గురు పిల్లలు జన్మించారు. వారి పేర్లు రవిబాబు, మాలినీ దేవి, శ్రీదేవి. ఆ తర్వాత ఉదయాన్నే నీళ్లు వేడి చేసేందుకు కట్టెల పొయ్యి దగ్గరకు వెళ్లిన ఇందుమతి చీర అంటుకుని మరణించింది. ఈ ఘటనతో చలపతిరావు చాలా కాలం కోలుకోలేకపోయారు. భార్య చనిపోయిన తర్వాత కూడా చలపతిరావు రెండో పెళ్లి మాత్రం చేసుకోలేదు. మొదట్లో కుటుంబ సభ్యులు ఒత్తిడి తెచ్చినా ఆయన ఒప్పుకోలేదు. ఆ తర్వాత ఏకంగా కొడుకు రవి బాబే తన తండ్రికి మళ్ళీ పెళ్లి చేయడానికి విశ్వప్రయత్నాలు చేశాడు. కానీ చలపతిరావు మాత్రం తన భార్యపై ఉన్న ప్రేమతో దానికి నో చెప్పాడు. అలా చనిపోయే వరకు ఒంటరి జీవితాన్నే గడిపారు.
ఇక ఆయన నాగచైతన్య, రకుల్‌ప్రీత్‌సింగ్ నటించిన రారండోయ్ వేడుక చూద్దాం అనే సినిమా ఫంక్షన్లో ఆడవాళ్ళ పై కొన్ని వ్యాఖ్యలు చేయడం వివాదంగా మారింది. ఆ వేడుకలో ఆడవారి గురించి యాంకర్ అడిగిన చిలిపి ప్రశ్నకు చలపతిరావు ఇచ్చిన సమాధానం వివాదాస్పదమైంది. ఆ సమయంలో మహిళా సంఘాలు ఆయనపై పెద్ద ఎత్తున ఉద్యమించాయి. సోషల్ మీడియాలో ఆయనపై అనుచిత పోస్టులు కనిపించాయి. దీంతో చలపతిరావు ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే ఒకసారి తెలిపారు. చలపతిరావు ఈమధ్య కాలంలోనే ఓ సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలో ప్రమాదానికి గురయ్యారు. దీంతో ఆయన రెండు కాళ్లు పనిచేయలేదు. ఫలితంగా చాలా కాలం పాటు వీల్ చైర్‌కే పరితమయ్యారు. అప్పుడే కంటిచూపు సమస్యను కూడా ఎదుర్కొన్నారు. ఆ తరువాత బోయపాటి శ్రీను వినయ విధేయ రామ మూవీలో అవకాశం ఇచ్చి ఆయనకు మరో లైఫ్ ఇచ్చారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



