చలపతిరావు జీవితం సినిమాగా వచ్చింది.. అది మీకు తెలుసా!
on Dec 26, 2022

విలక్షణనటుడు, నిర్మాత చలపతిరావు కన్నుమూశారు. ఆయనకు స్వర్గీయ ఈవీవీ సత్యనారాయణ తో ఎంతో మంచి అనుబంధం ఉండేది. దాదాపుగా ఈవీవీ సినిమాలన్నింటిలో చలపతిరావు నటించారు. 1966 లో నటుడిగా తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టారు. స్వర్గీయ ఎన్టీఆర్ స్ఫూర్తితో నటుడుగా కొనసాగారు. ఎన్టీఆర్ అంటే చలపతిరావుకి చెప్పలేనంత ఇష్టం. ఎన్టీఆర్ తో సుదీర్ఘమైన అనుబంధం ఉంది. దాదాపు చలపతిరావు 1200 చిత్రాల్లో నటించారు. ఆయన ఇటీవల చివరిసారిగా అక్కినేని నాగార్జున నటించిన బంగార్రాజు సినిమాలో కనిపించారు. ఆయన చివరి చిత్రాన్ని కుమారుడు రవి బాబు దర్శకత్వంలో చేశారు. ఈ చిత్రం ఇంకా షూటింగ్ దశలో ఉంది.
చలపతిరావు వ్యక్తిగత విషయానికి వస్తే కెరీర్ ఉన్నత స్థాయిలో ఉండగానే ఇందుమతి అనే అమ్మాయిని వివాహం చేసుకున్నారు. చలపతిరావు ఇందుమతి దంపతులకు రవిబాబు, మాలినీ దేవి, శ్రీదేవి సంతానంగా కలిగారు. ఆయన జీవితం ప్రశాంతంగా సాగుతున్న సమయంలో భార్య అగ్ని ప్రమాదంలో మరణించడంతో చలపతిరావు జీవితంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భార్య ఇందుమతి మరణం తర్వాత తన కన్న బిడ్డలకు అన్ని తానై వ్యవహరించారు. పిల్లల్ని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకొన్నారు. మరో యువతిని పెళ్లి చేసుకుంటే నా బిడ్డల పరిస్థితి ఏమవుతుందో అనే బెంగతో ఆయన రెండో వివాహానికి దూరంగా ఉన్నారు. ఈ విషయం ఆయన సన్నిహితులకు తెలుసు. చాలామంది రెండో వివాహం చేసుకోవాలని సూచించిన దాని జోలికి వెళ్లకపోవడం చలపతిరావు వ్యక్తిత్వానికి, ప్రేమ- ఆప్యాయతలకు నిదర్శనమని సినీవర్గాలు చెప్పుకుంటాయి.
తన తండ్రి చలపతిరావు ఒంటరితనాన్ని చూసి తట్టుకోలేక కుమారుడు రవిబాబు.. పలుమారు రెండో పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు. అయితే తన కుమారుడి కోరికను ఆయన సున్నితంగా తిరస్కరించారు. పలుమార్లు నాన్నకు పెళ్లి చేయాలని తన ప్రయత్నాన్ని రవిబాబు కొనసాగించారు. అయితే తండ్రికి పెళ్లి చేయాలనే కోరిక మాత్రం రవిబాబు తీర్చుకోలేకపోయాడు. అయితే తండ్రి వదిలే తుది శ్వాస వరకు రవిబాబు ఆయన బాగోగులు చూసుకుంటూ ఉండడం విశేషంగా చెప్పుకోవాలి.
చలపతిరావు, ఆయన కుమారుడు రవిబాబు జీవిత కథను ఆధారంగా చేసుకుని ప్రముఖ దర్శకుడు ఈవీవీ సత్యనారాయణ ఓ చిత్రాన్ని తీశారు. అదే మా నాన్నకు పెళ్లి అనే సినిమా. భార్యావియోగంతో ఒంటరైన తండ్రికి పెళ్లి చేయాలనే కొడుకు ప్రయత్నంగా ఈ మూవీని రూపొందించారు. 1997లో వచ్చిన ఈ చిత్రంలో చలపతిరావు పాత్రలో రెబల్ స్టార్ కృష్ణంరాజు, రవిబాబు పాత్రలో శ్రీకాంత్ ఇంకా సిమ్రాన్, అంబికా, చలపతిరావు, కోట శ్రీనివాసరావు, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు. ఈ సినిమా ద్వారానే ఎమ్మెస్ నారాయణకు మంచి పాపులారిటీ లభించింది. ఈ చిత్రాన్ని రోజా మూవీస్ పతాకంపై అర్జునరాజు నిర్మించారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



