'దర్బార్'తో రజనీ రికార్డులు బ్రేక్ చేస్తాడా?
on Oct 29, 2019

"దర్బార్ మూవీ తర్వాత తలైవర్ రజనీకాంత్ ఎన్ని సినిమాలు చేస్తారో నాకు నిజంగా తెలీదు. కాబట్టి ఇదివరకెప్పుడూ లేని రీతిలో థియేటర్ దగ్గర ఈ మూవీని నేను సెలబ్రేట్ చేసుకుంటాను" - ఇది ఒక రజనీకాంత్ వీరాభిమాని మాట. సోషల్ మీడియాలో ఈ తరహా కామెంట్స్ విరివిగా కనిపిస్తున్నాయి. ఎ.ఆర్. మురుగదాస్ డైరెక్ట్ చేస్తున్న 'దర్బార్' మూవీ తర్వాత రజనీకాంత్ మరో మూడు నాలుగు సినిమాల కంటే ఎక్కువ చేయరనే ప్రచారం తమిళనాట విరివిగా నడుస్తోంది. ఆ తర్వాత ఆయన క్రియాశీల రాజకీయాల్లోకి వస్తారనేది ఆ ప్రచార సారాంశం. అందుకే 'దర్బార్' నుంచి విడుదలయ్యే ప్రతి సినిమానీ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకోవాలని తలైవర్ ఫ్యాన్స్ డిసైడ్ చేసుకున్నారు.
అందులో భాగంగా 'దర్బార్' మూవీ విడుదలకు ముందే బ్లాక్‌బస్టర్ అయినట్లు సంబరాలు చేసుకుంటున్నారు. 'చంద్రముఖి'లో జంటగా నటించిన తర్వాత రజనీ, నయనతార జోడీగా చేసిన సినిమా కావడంతో అంచనాలూ అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. వాళ్లిద్దరి కెమిస్ట్రీ సినిమాకి టానిక్‌లా పనిచేస్తుందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు. మధ్యలో 'కథానాయకుడు' సినిమాలో కొద్ది నిమిషాల సేపు ఆ ఇద్దరూ హీరో హీరోయిన్లుగా ఒక సినిమా షూటింగ్‌లో నటిస్తూ కనిపించారు. అలాగే తొలిసారిగా మురుగదాస్ డైరెక్షన్‌లో రజనీ నటిస్తున్న సినిమా కావడం కూడా 'దర్బార్' అమితాసక్తిని రేకెత్తిస్తోంది.
ఇప్పటివరకూ ఈ మూవీకి సంబంధించి బయటకు వచ్చిన రజనీకాంత్ లుక్ ఫొటోలు విపరీతంగా వైరల్ అయ్యాయి. మొదట పోలీస్ యూనిఫాంలో లాఠీ పట్టుకొని ఉన్న ఆయన స్టిల్ బయటకు రాగానే ఫ్యాన్స్ చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. గడ్డంతో ఉన్న ఆయన రూపం కూడా అందర్నీ అమితంగా ఆకట్టుకుంది. ఇప్పుడు దీపావళి సందర్భంగా రివాల్వర్‌తో కాలుస్తున్నట్లున్న ఆయన లుక్ సైతం ఆన్‌లైన్‌లో బాగా వైరల్ అయ్యింది. 'బాషా' కాలం నాటి రజనీ కనిపిస్తున్నాడని వాళ్లు ఫీలవుతున్నారు.
'దర్బార్'లో ఆదిత్య అరుణాచలం అనే పోలీసాఫీసర్ రోల్‌లో రజనీ కనిపించనున్నాడు. అన్ని వయసుల వారినీ ఆకట్టుకొనేలా ఈ సినిమాని తీర్చిదిద్దుతున్నానని ఒక ఇంటర్వ్యూలో మురుగదాస్ తెలిపాడు. టైటిల్‌ను బట్టి ఇందులో పొలిటికల్ యాంగిల్ ఉంటుందేమోననే సందేహాలకు ఆయన చెక్ పెట్టాడు. పాలిటిక్స్‌తో 'దర్బార్'కు ఎలాంటి కనెక్షనూ ఉండదని ఆయన స్పష్టం చేశాడు. కాగా 2018 తరహాలోనే 2020లో రెండు సినిమాలతో ఫ్యాన్స్ ముందుకు వస్తున్నాడు రజనీ. 'దర్బార్' రిలీజవగానే 'విశ్వాసం' ఫేం శివ డైరెక్షన్‌లో నటించేందుకు తలైవర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అది కూడా 2020లోనే రిలీజవనునంది. 2018లోనూ 'కాలా', '2.0' సినిమాలతో అభిమానుల్ని రజనీ అలరించిన విషయం తెలిసిందే.
2019లో పొంగల్‌కు 'పేట' మూవీతో వచ్చి తమిళ అభిమానుల్ని ప్రపంచవ్యాప్తంగా అలరించాడు రజనీ. తెలుగునాట ఎక్కువ థియేటర్లు లభ్యం కాకపోవడం, 'ఎఫ్ 2' మూవీ సెన్సేషనల్ హిట్ కావడంతో ఇక్కడ ఆశించినంత కలెక్షన్లు రాలేదు. ఇప్పుడు 'దర్బార్'ను సైతం 2020 పొంగల్‌కే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. యాక్షన్ డ్రామాగా మురుగదాస్ రూపొందిస్తోన్న ఈ సినిమాకు అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ ఒక మ్యాజిక్‌లా పనిచేస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.
కచ్చితంగా 'దర్బార్' మూవీ తమిళనాట సరికొత్త బాక్సాఫీస్ రికార్డుల్ని సృష్టిస్తుందని విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. అయితే తెలుగులో 'దర్బార్'కు రెండు కొదమ సింహాల్లాంటి సినిమాలు పోటీగా నిలిచాయి. ఒకటి మహేశ్ మూవీ 'సరిలేరు నీకెవ్వరు' కాగా, ఇంకొకటి అల్లు అర్జున్ సినిమా 'అల.. వైకుంఠపురములో'. తెలుగునాట ఎంతో క్రేజ్, మాస్ ఇమేజ్ ఉన్న మహేశ్, బన్నీ సినిమాలు రెండూ బాక్సాఫీస్‌ను దద్దరిల్లేలా చేస్తాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగులో 'పేట' తరహాలోనే 'దర్బార్'కూ క్లిష్టమైన పోటీ తప్పదు. ఆ పోటీని ఆయన ఎలా తట్టుకుంటాడో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



