ENGLISH | TELUGU  

'కమ్మరాజ్యంలో కడపరెడ్లు'పై సానుభూతి చూపిద్దాం!!

on Oct 29, 2019


ఒకప్పటి ట్రెండ్ సెట్టింగ్ డైరెక్టర్ రాంగోపాల్ వర్మ మెయిన్ స్ట్రీం సినిమాలు మానేసి, సెకండరీ గ్రేడ్ సినిమాలు చేసుకొనే డైరెక్టర్‌గా మారిపోతాడని ఎవరూ అనుకోలేదు. సమకాలీనంగా జరిగే ఘటనలు చూస్తూ, ఠక్కున ఏదో ఆలోచన వచ్చి, సినిమాలు అనౌన్స్ చెయ్యడం, తనో.. లేకపోతే.. తన శిష్య పరంపరలోని ఎవరో ఒకరి చేతో.. సినిమా తియ్యడం.. దాన్ని వీలైనంతగా కాంట్రవర్సీ చేసి, రిలీజ్ చెయ్యడం.. ఒక అలవాటుగా చేసుకున్నాడు. ఈ మధ్యకాలంలో అలా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' అనే సినిమా తీసి జనం మధ్యకు వదిలాడు. ఆ సినిమా విడుదలకు ముందు ఆయన మాటలు, ప్రకటనల పరంపరను గమనిస్తే చాలు.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును ఆయన టార్గెట్ చేసినట్లు ఇట్టే అర్థమైపోతుంది.

ఒకవైపు నట సార్వభౌముడిగా విశ్వవిఖ్యాతుడైన నందమూరి తారకరామారావు జీవితాన్ని ఆయన తనయుడు బాలకృష్ణ 'యన్.టి.ఆర్: కథానాయకుడు', 'యన్.టి.ఆర్: మహానాయకుడు' టైటిల్స్‌తో క్రిష్ డైరెక్షన్‌లో సినిమాలు చేస్తే, దాదాపు అదే సమయంలో ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి దృష్టికోణం నుంచి వర్మ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా తీసి, చంద్రబాబునాయుడుతో పాటు ఎన్టీఆర్ సంతానమంతా ఆయనను ఎలా వెన్నుపోటు పొడిచారో చూపించాడు. ఆ సినిమాను వర్మతో పాటు ఆయన శిష్యుడు అగస్త్య మంజు డైరెక్ట్ చేశాడు.

ఎన్నికల ముందు ఆ సినిమాని విడుదల చెయ్యడానికి వర్మ చేసిన ప్రయత్నాలు పాక్షికంగానే ఫలించాయి. తెలంగాణలో విడుదలైన ఆ మూవీని ఏపీలో ఎన్నికలయ్యేంతవరకు విడుదల కాకుండా ఎన్నికల కమిషన్ నిలిపేసింది. తెలంగాణలో విడుదలైన ఆ మూవీని ఆయన ఊహించినట్లు జనం తండోప తండాలుగా తరలిపోయి చూడలేదు. చాలా చిన్న సినిమాలని హిట్ చేసిన రీతిలో కూడా హిట్ చెయ్యలేదు. ఎన్నికలయిపోయి వై.ఎస్. జగన్మోహనరెడ్డి సారథ్యంలోని వైసీపీ ఊహాతీత మెజారిటీతో గెలిచి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ఆ తర్వాత ఏపీలో 'లక్ష్మీస్ ఎన్టీఆర్' మూవీని విడుదల చేశాడు వర్మ. అప్పటికే ఆ సినిమాపై ఆసక్తి తగ్గిపోయిన జనం తెలంగాణలో చూసినంతగా కూడా చూడలేదు. ఇది ఆర్జీవీని బాగా ఫ్రస్ట్రేట్ చేసినట్లు వినికిడి. అందుకే ఎన్నికలు, తదనంతర పరిణామాలపై 'కమ్మరాజ్యంలో కడపరెడ్లు' అనే మరింత వివాదాస్పద టైటిల్‌తో సినిమా తీశాడు. వర్మతో పాటు సిద్ధార్థ తాతోలు ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. ఇందులో చంద్రబాబునూ, ఆయన కొడుకు లోకేశ్‌నూ టార్గెట్ చేసినట్లు స్పష్టమవుతోంది. అంతే కాదు, పవన్ కల్యాణ్‌నూ వదల్లేదు. 'జనసేన'ను 'మన సేన'గా మార్చి, పవన్ ఆహార్యంతో ఉన్న కేరెక్టర్‌ను సృష్టించాడు. 'ఇక ప్రశ్నించే ప్రసక్తి లేదు.. చెయ్యడమే' అనే డైలాగ్‌ను అచ్చు పవన్ తరహాలోనే ఆ క్యారెక్టర్‌తో చెప్పించాడు వర్మ. అక్టోబర్ 27న విడుదల చేసిన ట్రైలర్‌ని చూస్తే మనకు ఈ సినిమాపై కాస్తంత అవగాహన కలుగుతుంది.

చంద్రబాబు పాత్రధారి లాంగ్ షాట్‌లో ఆయనలా కనిపిస్తున్నా, క్లోజప్ షాట్‌లో చూస్తే పోలికలు అలా లేవు. చంద్రబాబు తరహా గడ్డం వల్లే ఆయనలా ఆ పాత్రధారి కనిపిస్తున్నాడనుకోవాలి. ఈ మూవీలో హీరో.. వై.ఎస్. జగన్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కమ్మరాజ్యంలోకి కడపరెడ్లు ఎలా వచ్చారో ఆయన కేరెక్టర్‌తో ఈ సినిమాలో వర్మ చూపించాడని తెలుస్తోంది. జగన్ పాత్రను తమిళ నటుడు అజ్మల్ అమీర్ పోషించాడు. అయితే అతను ఏ యాంగిల్లో చూసినా జగన్‌లా కనిపించడం లేదు. అతని హావభావాలు, బాడీ లాంగ్వేజ్ మాత్రమే జగన్‌ను ప్రతిబింబిస్తున్నాయి. లోకేశ్ పాత్రధారి ఆకారం మాత్రం అలా ఉన్నా, ఫేస్‌లో ఎలాంటి పోలికలూ లేవు. సినిమాలో అలీ కూడా ఉన్నాడు. అసెంబ్లీ స్పీకర్ పమ్మినేని రామ్ రామ్ అనే పాత్రలో ఆయన కనిపించనున్నాడు. ఆ పేరు, ఆ పాత్ర ప్రస్తుత ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ ను స్ఫురింపజేస్తున్నాయి. అలీ కామిక్ ఆకారానికీ, సీతారాం రూపానికీ ఎలాంటి పోలికా లేదు.

గతంలో మహాకవులుగా పేరుపొందిన దేవులపల్లి కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ గురించి మహారచయిత గుడిపాటి వెంకటాచలం ఒక్క మాటలో చెప్పిన విషయం ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు. శ్రీశ్రీ ప్రఖ్యాత కవితా సంపుటి 'మహా ప్రస్థానం'కు రాసిన యోగ్యతాపత్రంలో "కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ, ప్రపంచపు బాధంతా శ్రీశ్రీ బాధ" అని అభివర్ణించారు చలం. అదేవిధంగా తన ఫ్రస్ట్రేషన్‌ను జనం ఫ్రస్ట్రేషన్‌గా ఊహించుకుంటూ, ఆ రకమైన సినిమాలు తీస్తూ, తన ఇగోను శాటిస్‌ఫై చేసుకొనే క్రమంలోనే ఈ తరహా సెకండరీ గ్రేడ్ సినిమాలు తీస్తూ వస్తున్నాడు రాంగోపాల్ వర్మ. 'శివ', 'క్షణ క్షణం', 'రంగీలా', 'సత్య', 'కంపెనీ', 'సర్కార్' లాంటి సినిమాలు తీసిన రాంగోపాల్ వర్మ ఎక్కడ.. 'ఐస్ క్రీమ్', '365 డేస్', 'గాడ్, సెక్స్ అండ్ ట్రూత్', 'ఆఫీసర్', 'లక్ష్మీస్ ఎన్టీఆర్', 'కమ్మరాజ్యంలో కడపరెడ్లు' లాంటి సినిమాలు తీస్తున్న రాంగోపాల్ వర్మ ఎక్కడ..! ఎక్కడ్నుంచి ఎక్కడికి పడిపోయాడు.. పాపం కదూ.. ఆయన సినిమాలు చూడకపోయినా వర్మపై సానుభూతి చూపిద్దాం.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.