తెలుగు సూపర్‌స్టార్‌తో తమిళ సూపర్‌స్టార్ అనుభవం ఇది!
on Nov 15, 2022

సూపర్‌స్టార్ కృష్ణ, సూపర్‌స్టార్ రజినీకాంత్.. ఈ ఇద్దరూ కలిసి మూడు సినిమాలు.. 'అన్నదమ్ముల సవాల్', 'ఇద్దరూ అసాధ్యులే', 'రాం రాబర్ట్ రహీం'.. చేశారు. కృష్ణ కంటే రజినీ చాలా చిన్నవారైనా 'అన్నదమ్ముల సవాల్' సినిమాలో కృష్ణకు అన్నగా నటించారు రజినీ. ఆ సినిమా చేసే టైంకు కృష్ణ అగ్ర హీరో కాగా, రజినీ అప్పుడప్పుడే ఎదుగుతున్న నటుడు. అది సారథీ స్టూడియోస్ నిర్మించిన సినిమా కావడంతో, షూటింగ్ మద్రాసులో కాకుండా హైదరాబాద్‌లోనే ఎక్కువగా చేశారు.
ఎక్కువ రోజులు హైదరాబాద్‌లోనే ఉండాల్సి రావడంతో కృష్ణ మద్రాస్ నుంచి తన కారుని కూడా తెచ్చుకున్నారు. ఔట్‌డోర్‌కి వెళ్లేటప్పుడు తన సొంత కారునే ఆయన వాడేవారు. ఓ రోజు ఉదయం హీరో కృష్ణ షూటింగ్‌కు బయలుదేరుతుంటే రజినీకాంత్ ఆయన దగ్గరకి వచ్చారు. "అన్నయ్యా! కారులో మీతో పాటు లోకేషన్‌కి రావచ్చా?" అని అడిగారు. రజినీ అప్‌కమింగ్ యాక్టర్ అయినా ఎలాంటి భేషజం లేని మనిషి కావడంతో కృష్ణ వెంటనే నవ్వేసి, "తప్పకుండా.. పద వెళ్దాం" అన్నారు.
కారులో వెళ్లేటప్పుడు, "అన్నయ్యా! నా జీవితంలో ఇలాంటి కారు ఎప్పటికైనా కొంటానంటారా?" అనడిగారు రజినీ.
"నీ టాలెంట్ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. హీరోగా నువ్వు తప్పకుండా పైకి వస్తావు. డబ్బు, పేరు సంపాదిస్తావు" అని రజినీ భుజం తట్టారు కృష్ణ.
ఆయన నమ్మకం వమ్ము కాలేదు. రజినీ సూపర్‌స్టార్‌గా ఎదిగారు. డబ్బుకి డబ్బూ, పేరుకి పేరూ గడించారు. కృష్ణ లాగే ఎంత ఎదిగినా భేషజం లేకుండా ఒదిగి ఉండే మనిషిగా రజినీ మంచి పేరు తెచ్చుకున్నారు.
"కృష్ణగారు బంగారం లాంటి మనిషి. సినిమా పరిశ్రమలో ఓ వ్యక్తి ఐదు దశాబ్దాల పాటు నిర్విరామంగా కొనసాగడం మామూలు విషయం కాదు. ఆయనతో కలిసి మూడు సినిమాలు చేశాను. ఆ రోజుల్లో ఆయన నాపై చూపించిన ప్రేమ, ఆప్యాయతలను ఎప్పుడూ మర్చిపోలేను. కృష్ణగారి ప్రతిభ ఎలాంటిదో నాకు తెలుసు. చేసే ప్రతిపనిలోనూ ఆయన శైలి కనిపిస్తుంటుంది." అని ఒక సందర్భంలో చెప్పారు రజినీ.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



