నటశేఖరునికే సాధ్యమైన విషయాలు! అందుకే దేవుడులాంటి మనిషి అయ్యారు!!
on Nov 14, 2022
.webp)
ఐదు దశాబ్దాల కెరీర్‌లో 365 సినిమాల్లో నటించిన నటశేఖర కృష్ణ షూటింగ్ అంటే ఎంతో ఉత్సాహం చూపించేవారు. రోజుకు మూడు షిఫ్టులు చేసిన రోజులు ఎన్నో! ఆయన నిద్రపోతున్నప్పుడు కూడా డ్రస్ వేసుకొని పడుకుంటే షూట్ చేసుకున్న నిర్మాతలున్నారు. మా డ్రస్ వేసుకొని పడుకోండి అని అడిగిన వాళ్లున్నారు. మూడు షిఫ్టులు చేస్తున్నప్పుడు కూడా ఎవరో వచ్చి "మాది ఓ షాట్ మిగిలిపోయింది" అని చెప్పి, విగ్గు, డ్రస్ తెచ్చి అడిగితే పక్కకు వెళ్లి ఆ సీన్ చేసిన ఘటనలూ ఉన్నాయి. చాలామందికి ఇది అతిశయోక్తిగా అనిపించవచ్చు కానీ, అది షూటింగ్ సాక్షిగా నిజం.
ఓ మాస్ హీరో అయి వుండి 'మీనా' లాంటి నవలా చిత్రంలో పంచె కట్టుకొని రైతుగా నటించడం, అందులోనూ డ్యూయెట్లు లేకుండా నటించడం కృష్ణకే సాధ్యమైంది. 200వ సినిమా 'ఈనాడు' లో హీరోయినే లేకుండా, డ్యాన్సులు లేకుండా చేయడం సాహసమే కదా! 'మొనగాడు వస్తున్నాడు' మూవీలో ఆయనకు ఒక్క పాటా ఉండదు. పాటలన్నీ హీరోయిన్ల మీదే ఉంటాయి. ఓవైపు జేమ్స్‌బాండ్, కౌబాయ్, క్రైం థ్రిల్లర్స్ చేస్తూ, మరోవైపు 'పండంటి కాపురం', 'ఇల్లు ఇల్లాలు' లాంటి ఫ్యామిలీ మూవీస్‌లో నటిస్తూ, ఇంకోవైపు 'మహాబలుడు', 'సింహాసనం' లాంటి జానపద చిత్రాలు, 'కురుక్షేత్రం', 'ఏకలవ్య' వంటి పౌరాణిక చిత్రాలు, 'అల్లూరి సీతారామరాజు', 'విశ్వనాథనాయకుడు' లాంటి చారిత్రాత్మక చిత్రాలు చేయడం ఆయనకే సాధ్యమైంది.
కృష్ణతో సినిమాలు తీసిన నిర్మాతల్లో 80 శాతం మంది లాభాలు ఆర్జించారు. రన్ ఎక్కువ లేఅపోయినా, నాలుగు వారాలే ఆడినా, పెట్టిన పెట్టుబడి వచ్చి, ఇంకో సినిమా చేసుకొనేంత డబ్బులు వచ్చేవి. ఆయనతో సినిమాలు చేసిన వాళ్లంతా హ్యాపీ, ఆడియెన్స్ హ్యాపీ, ఆయనా హ్యాపీ. రన్ కాదు ముఖ్యం, షేర్ ఎంత వచ్చిందన్నదే పాయింట్. అది కృష్ణ 'మోసగాళ్లకు మోసగాడు' సినిమా నుంచి మొదలైందని చెప్పాలి.
ఒక రోజు తిరుపతిలో వేంకటేశ్వర స్వామిని దర్శించుకొని, మద్రాస్ వచ్చిన యాత్రికులు కొంతమంది పద్మాలయా ఆఫీస్ ముందు గుమిగూడి ఉంటే, షూటింగ్‌కు వెళ్తూ వాళ్లను విష్ చేశారు కృష్ణ. ఆయన కారెక్కబోతుంటే, "రాత్రి బస్సులో దొంగలుపడి డబ్బంతా ఎత్తుకెళ్లారు. ఖర్చులకు మా దగ్గర డబ్బులు లేవు" అని వాళ్లు చెప్పారు. ఆయన తమ్ముడు ఆదిశేషగిరిరావును పిలిచి, "వాళ్లకెంత కావాలో ఇచ్చి పంపించు" అని కారెక్కారు. "మీరు దేవుడులాంటి మనిషి బాబూ" అని వాళ్లు అంటుంటే.. "ముందు మీరు హ్యాపీగా ఇంటికి వెళ్లండి" అని నవ్వుతూ వెళ్లారు కృష్ణ. వాళ్లు ఆయనకు చేతులెత్తి నమస్కరించారు.
ఒకసారి నిర్మాతలంతా కృష్ణను కలిసి "హీరోలు రెమ్యూనరేషన్ తగ్గించుకోకపోతే ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుంది" అని చెప్పారు. ఆయన నవ్వుతూ, "మీలో ఒకరిద్దరు తప్ప మిగిలినా వాళ్లలో ఎంతమంది నాకు పూర్తి రెమ్యూనరేషన్ ఇచ్చారో చెప్పండి" అన్నారు. "మీరు దేవుడులాంటి మనిషి. నిర్మాతల హీరో. మేం వచ్చింది మిమ్మల్ని రెమ్యూనరేషన్ తగ్గించుకోమని చెప్పడానికి కాదు, మీకు విషయం చెప్పాలని" అన్నారు ఆ నిర్మాతలు. దటీజ్ కృష్ణ!!
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



