'లైగర్' కాంట్రవర్సీ నేపథ్యం.. పూరి చెప్పిన జీవిత పాఠం!
on Oct 30, 2022

పూరి జగన్నాథ్ చివరగా డైరెక్ట్ చేసిన 'లైగర్' మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ కావడంతో పాటు వివాదాలకు కూడా తావిచ్చిన విషయం మనకు తెలుసు. ఆ సినిమా వల్ల తీవ్రంగా నష్టపోయామంటూ, దాన్ని కొన్న బయ్యర్లు పూరి ఇంటి దగ్గర ధర్నాకు ప్రయత్నించడం, దానిపై పూరి వెలువరించిన ఆడియో సంచలనం సృష్టించాయి. ఆ తర్వాత ఆయన ఇదే విషయమై పోలీసులను సైతం ఆశ్రయించి, తనకూ, తన కుటుంబానికీ భద్రత కల్పించాల్సిందిగా కోరడం వివాదం తీవ్రతను తెలియజేసింది.
తాజాగా పూరి వెలువరించిన ఓ లెటర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మన జీవితాల్లో ఏదీ శాశ్వతం కాదనీ, జీవితంలో జరిగే ప్రతి ఘటనను ఒక అనుభవంలాగా చూడాలే కానీ, జయాపజయాలుగా చూడకూడదనీ ఆయన ఆ ఉత్తరంలో రాశాడు. జీవితంలో ఖాళీగా ఉండకూడదనీ, రిస్క్ చెయ్యాలనీ, రిస్క్ లేని లైఫ్ లైఫే కాదనీ పూరి అభిప్రాయం వ్యక్తం చేశాడు.
హీరోలా బతకాలనీ, అలా బతకాలంటే నిజాయితీగా ఉండాలన్న ఆయన, నిజాన్ని నిజమే కాపాడుకుంటుందన్నాడు. తను ఇంతదాకా ఎవరినైనా మోసం చేశానంటే అది తనను నమ్మి సినిమా టికెట్ కొన్న ప్రేక్షకులనే తప్ప ఇంకెవరినీ మోసం చెయ్యలేదనీ ఆయన అన్నాడు. చివరగా చచ్చిపోయాక తనతో ఒక్క రూపాయి తీసుకెళ్లిన వారి పేరు ఒక్కటి చెప్పమనీ, అలా చెబితే తనూ డబ్బు దాచుకుంటాననీ.. చివరగా అందరం కలిసేది శ్మశానంలోనేననీ , మధ్యలో జరిగేదంతా డ్రామా అనీ తత్వం చెప్పాడు. ఈ ఉత్తరం ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్ చేస్తోంది.
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'లైగర్' సినిమా తెలుగు, హిందీ భాషల్లో ఏక కాలంలో నిర్మాణమై, పాన్ ఇండియా మూవీగా రిలీజైంది. కానీ బాక్సాఫీస్ దగ్గర భారీ నష్టాలను చవిచూసి, బయ్యర్లకు తీవ్ర నష్టాన్ని చేకూర్చింది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



