సమంతా.. నువ్వు అద్భుతమైన అమ్మాయివి.. ఈ సవాలును దాటేస్తావు!
on Oct 30, 2022

మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో తను బాధపడుతున్నట్లు, దాన్నుంచి కోలుకోవడానికి తనకు కొంత సమయం పడుతుందని సమంత వెల్లడించడం ఆమె అభిమానులను షాక్‌కు గురిచేసింది. సినీ రంగానికి చెందిన పలువురు సెలబ్రిటీలు సైతం ఆమె వ్యాధి విషయం తెలిసి బాధపడ్డారు. కొంతమంది ఆమెకు ధైర్యం చెప్తూ సోషల్ మీడియాలో సందేశాలు పోస్ట్ చేశారు. వారిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు.
ఆదివారం ఆయన తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా సమంతకు తామంతా ఉన్నామని ధైర్యం చెప్పారు. ఆమె త్వరగా కోలుకోవాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. "కాలానుగుణంగా మన జీవితాల్లో సవాళ్లు వస్తాయి. బహుశా నీ అంతర్గత శక్తిని తెలుసుకోవడానికి అవి మాకు వీలుకల్పిస్తాయి. నువ్వు అంతకన్నా ఎక్కువ అంతర్గత బలంతో ఉన్న అద్భుతమైన అమ్మాయివి. ఈ ఛాలెంజ్‌ను కూడా త్వరలో నువ్వు కచ్చితంగా దాటేస్తావని నేను అనుకుంటున్నాను. నీకు ధైర్యం, దృఢ సంకల్పం ఉండాలని కోరుకుంటున్నాను. దేవుడు నీకు తోడుగా ఉండుగాక" అని ట్వీట్ చేశారు చిరు.

సమంత టైటిల్ రోల్ పోషిస్తున్న 'యశోద' మూవీ ట్రైలర్ ఇటీవల విడుదలై ఆకట్టుకుంది. నవంబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ మూవీ కోసం ప్రస్తుతం సమంత డబ్బింగ్ చెబుతోంది. దీనికి సంబంధించిన ఫోటోని ఆమె సోషల్ మీడియాలో పంచుకుంది. ఆ ఫొటోలో ఆమె చేతికి సెలైన్ ఉంది. మయోసైటిస్ అనే సమస్యతో బాధపడుతున్న తాను కొద్ది నెలలుగా చికిత్స తీసుకుంటున్నానని, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని సమంత రాసుకొచ్చింది. దీని నుంచి కోలుకోవడానికి తాను అనుకున్నదానికంటే ఎక్కువ సమయమే పడుతుందని, త్వరలోనే నేను పూర్తిగా కోలుకుంటానని వైద్యులు నమ్మకంతో ఉన్నారని చెప్పింది. జీవితంలో శారీరికంగా, మానసికంగా మంచి, చెడులను చూసిన తాను.. దీని నుంచి కూడా త్వరలోనే బయటపెడతానని సమంత చెప్పుకొచ్చింది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



