ముదిరిన 'లైగర్' వివాదం.. పోలీసులకు ఫిర్యాదు చేసిన పూరి!
on Oct 27, 2022

'లైగర్' వివాదం రోజురోజుకి ముదురుతోంది. కొందరు ఎగ్జిబిటర్లు తన ఇంటిని ముట్టడించడానికి ప్రయత్నిస్తున్నారన్న విషయం తెలిసి.. పూరి జగన్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆడియో క్లిప్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తన కుటుంబానికి ప్రాణహాని ఉందంటూ 'లైగర్' ఫైనాన్సియర్ శోభన్ బాబు, డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీనులపై పూరి పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.

ఆగస్టు 25న భారీ అంచనాలతో విడుదలైన 'లైగర్' మూవీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. ఎక్కువ మొత్తానికి థియేట్రికల్ రైట్స్ దక్కించుకున్న బయ్యర్లు తీవ్రంగా నష్టపోవడంతో.. కొంతమేర డబ్బులు తిరిగిస్తామని దర్శక నిర్మాత పూరి జగన్నాథ్ ప్రకటించారు. అయినప్పటికీ కొంతమంది ఎగ్జిబిటర్స్ అక్టోబర్ 27న పూరి ఇంటిని ముట్టడించాలని ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ విషయం పూరి చెవిన పడటంతో ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. "నేను ఎవరికీ డబ్బు ఇవ్వాల్సిన అవసరంలేకపోయినా, వాళ్ళు కూడా నష్టపోయారన్న ఉద్దేశంతో కొంత మొత్తం ఇవ్వడానికి ముందుకొచ్చాను. ఇస్తానని చెప్పాక కూడా ఇలా అతి చేస్తే ఇచ్చేది కూడా ఇవ్వబుద్ధి కాదు" అంటూ పూరి మండిపడిన ఆడియో క్లిప్ ఒకటి లీక్ అయింది.

ఆడియో క్లిప్ వైరల్ గా మారిన కొద్ది గంటల్లోనే పూరి, పోలీసులను ఆశ్రయించడం హాట్ టాపిక్ గా మారింది. తనపైన, తన కుటుంబంపైన దాడి చేయడానికి డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను, ఫైనాన్సియర్ శోభన్ ఇతరులను ప్రేరేపిస్తున్నారని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో పూరి ఫిర్యాదు చేశాడు. తన కుటుంబానికి రక్షణ కల్పించాలని ఆయన కోరారు. ఈ వివాదం ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



