సంచలనాలకు చిరునామా.. ఎన్టీఆర్ 'నా దేశం'కి 40 ఏళ్ళు!
on Oct 27, 2022

సినిమాలు, రాజకీయాలు రెండింట్లో రాణించినవారు చాలా అరుదుగా ఉంటారు. అందులో నందమూరి తారక రామారావు ముందు వరుసలో ఉంటారు. 300 కు పైగా సినిమాల్లో నటించి దశాబ్దాల పాటు అగ్ర కథానాయకుడిగా వెలుగొందిన ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం అప్పట్లో ఓ సంచలనం. ఆయన రాజకీయాల్లోకి వచ్చి తమ బతుకులు మారుస్తారని ఎంతమంది సంతోషించారో, ఇక ఆయన సినిమాలు చేయరేమోనని అదేస్థాయిలో విచారం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ రాజకీయ రంగప్రవేశం సమయంలో ఆయన చివరి చిత్రంగా ప్రచారం పొందిన చిత్రం 'నా దేశం'. ఈ చిత్రం విడుదలై నేటికి సరిగ్గా నలభై ఏళ్ళు.
'నా దేశం' చిత్ర ప్రారంభం నుంచి విడుదలై ఘన విజయం సాధించేవరకు అడుగడుగునా సంచలనమే. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్తున్నారని తెలిసి, ఆయన చివరి చిత్రం నిర్మించడానికి నిర్మాతలు పోటీ పడ్డారు. అందరూ కావాల్సిన వారే కావడంతో ఎవరినీ నొప్పించడం ఇష్టంలేని ఎన్టీఆర్.. నిర్మాతలు దేవీవరప్రసాద్, వెంకటరత్నం, కృష్ణంరాజుని పిలిచి ముగ్గురూ కలిసి సినిమా చేసుకోండని చెప్పారు. అయితే నిర్మాణ పరమైన విభేదాల కారణంగా తర్వాత కృష్ణంరాజు తప్పుకున్నారు.
పల్లవీ దేవీ ప్రొడక్షన్స్ పతాకంపై దేవీవరప్రసాద్, వెంకటరత్నం నిర్మాతలుగా ఈ చిత్రం ప్రారంభమైంది. అయితే అప్పుడు పార్టీ పనుల దృష్ట్యా.. కాల్షీట్లు ఇచ్చేముందే పది రోజుల్లో కథ తయారు కావాలి, 18 రోజుల్లో షూటింగ్ పూర్తి చేయాలని ఎన్టీఆర్ చెప్పారట. అందుకే అప్పటికప్పుడు కొత్త కథ సిద్ధం చేయడం అసాధ్యమని భావించి, హిందీ మూవీ 'లావారిస్'ని రీమేక్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్టీఆర్ తొలిచిత్రం 'మన దేశం' కావడంతో, ఇదే ఆఖరి చిత్రమన్న ఉద్దేశంతో దీనికి 'నా దేశం' అనే టైటిల్ పెట్టారు.
కె.బాపయ్య దర్శకత్వంలో 1982 జులై 22న ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. ఎన్టీఆర్ వంటి అగ్ర కథానాయకుడి సినిమా 19 రోజుల్లోనే టాకీ పార్ట్ షూటింగ్ పూర్తి చేసుకోవడం రికార్డు. ఐదు రోజుల్లోనే పాటలను చిత్రీకరించారు. షూటింగ్, డబ్బింగ్ కి కలిపి ఈ చిత్రానికి ఎన్టీఆర్ 25 రోజులు పనిచేయగా.. రోజుకి లక్ష చొప్పున రూ.25 లక్షల పారితోషకం ఆయనకు నిర్మాతలు చెల్లించారు. అప్పట్లో ఇది సంచలన రికార్డు. ఆ వేగంగా చిత్రీకరణ పూర్తి చేసినప్పటికీ క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. సంగీతం పరంగానూ ఈ చిత్రం ఓ సంచలనమే. ఈ చిత్రంలోని ఆరు పాటలను వేటూరి కేవలం రెండు రోజుల్లో రాస్తే, వాటిని ఐదు రోజుల్లోనే రికార్డ్ చేసి సంగీత దర్శకుడు చక్రవర్తి సంచలనం సృష్టించారు.
జయసుధ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో సత్యనారాయణ, జగ్గయ్య, గిరిబాబు, ప్రభాకర్ రెడ్డి, జమున, అల్లు రామలింగయ్య తదితరులు నటించారు. పరుచూరి బ్రదర్స్ సంభాషణలు అందించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా వెంకటరత్నం, ఎడిటర్ గా కోటగిరి వెంకటేశ్వరరావు వ్యవహరించారు.
ఎన్టీఆర్ చివరి చిత్రంగా ప్రచారం పొందిన 'నా దేశం'పై అప్పట్లో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అక్టోబర్ 27, 1982 న విడుదలైన ఈ చిత్రం అంచనాలను అందుకొని ఘన విజయం సాధించింది. 'నా దేశం' తర్వాత కూడా ఎన్టీఆర్ కొన్ని సినిమాల్లో నటించారు. ఆయన నటించిన చివరి చిత్రం 'మేజర్ చంద్రకాంత్' కాగా, విడుదలైన చిత్రం మాత్రం 'శ్రీనాథ కవి సార్వభౌముడు'.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



