పూరి జగన్నాథ్, ఛార్మి చుట్టూ ఉచ్చు బిగుసుకుంటోందా? కవితకూ చిక్కులు?
on Nov 18, 2022

'లైగర్' సినిమా విషయంలో డైరెక్టర్ పూరి జగన్నాథ్ కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. ఇదివరకు డిస్ట్రిబ్యూటర్స్, బయ్యర్స్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్న ఆయనకు తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నుంచి విచారణ రూపంలో కష్టాలు ఎదురవుతున్నాయి. దీంతో ఆయనకు కంటి మీద కునుకు ఉండటం లేదు.
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన 'లైగర్' సినిమా వివాదాలకు కేంద్రంగా మారిన విషయం మనకు తెలుసు. భారీ హైప్‌తో పాన్ ఇండియా మూవీగా రిలీజైన ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ కావడంతో, దానిపై నమ్మకంతో పెట్టుబడులు పెట్టిన బయ్యర్లందరూ తీవ్ర నష్టాలు పాలయ్యారు. తెలంగాణకు చెందిన డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో బయ్యర్లు పూరి జగన్నాథ్ తమ నష్టాల్ని భరించాలని, లేదంటే ఆయన ఇంటిముందు ధర్నా చేస్తామని పిలుపునివ్వడం, దాంతో తనకూ, తన కుటుంబ సభ్యులకూ రక్షణ కల్పించాల్సిందిగా పోలీసుకులకు జగన్ ఫిర్యాదు చేయడం ఫిల్మ్ ఇండస్ట్రీలో కలకలం సృష్టించింది.
ఆ వివాదం అలా ఉండగానే, ఇప్పుడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జగన్, ఛార్మీలను నిన్న ఉదయం నుంచి రాత్రి దాకా ఏకబిగిన విచారించడం సంచలనంగా మారింది. 'లైగర్' నిర్మాణానికి పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయనే కోణంలో ఈడీ అధికారులు ఈ విచారణను చేపట్టారు. తెలుగుతో పాటు హిందీలోనూ ఏక కాలంలో 'లైగర్' మూవీని నిర్మించారు. హిందీ వెర్షన్‌ను కరణ్ జోహార్‌కు చెందిన ధర్మా ప్రొడక్షన్స్ నిర్మించింది. ఈ మూవీలో బాక్సింగ్ లెజెండ్, మాజీ హెవీ వెయిట్ ఛాంపియన్ మైక్ టైసన్ నటించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. టైసన్ అడుగు బయటపెట్టి ఏదైనా ఈవెంట్‌కు హాజరు కావాలంటేనే కోట్లు కుమ్మరించాలి. అట్లాంటిది ఏకంగా ఒక ఇండియన్ మూవీలో ఒక క్యారెక్టర్ చేశాడంటే ఎన్ని కోట్లు ఇచ్చి ఉండాలి?.. ఈ కోణంలోనూ ఈడీ అధికారులు జగన్, ఛార్మీలను ప్రశ్నించారని ప్రచారం జరుగుతోంది. భారీ బడ్జెట్‌తో 'లైగర్'ను నిర్మించడానికి పెట్టుబడులు ఎలా సమకూరాయని అధికారులు వారిని పలు విధాలుగా ప్రశ్నించి, సమాధానాలు రాబట్టారు.
ఇదివరకు 'లైగర్' మూవీలో కేసీఆర్ కుమార్తె కవిత బ్లాక్ మనీని పెట్టుబడులుగా పెట్టారంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన బక్క జడ్సన్ సంచలన ఆరోపణలు చేశారు. అంతటితో ఆగకుండా ఈ విషయంపై విచారణ చేపట్టాలని ఆయన ఈడీకి, సీబీఐకి ఫిర్యాదు చేశారు. "తన దగ్గరున్న బ్లాక్ మనీని వైట్ చేసుకునేందుకు కవిత లైగర్ సినిమాలో భారీగా పెట్టుబడులు పెట్టింది." అని ఆయన ఆరోపించారు. "2017లో డ్రగ్స్ కేసులో పలువురు సినీ సెలబ్రెటీలను పిలిచి విచారించారు. ఇందులో చాలామంది సెలబ్రిటీలతో పాటు పూరీ జగన్నాథ్, ఛార్మి కూడా ఉన్నారు. కొంతకాలానికి వీరందరికి క్లీన్ చిట్ వచ్చింది. అక్కడి నుంచి పూరీ, ఛార్మీకి కవితతో అనుబంధం పెరిగింది. తన దగ్గరున్న బ్లాక్‌మనీతో కవిత వీరితో సినిమాలు తీస్తోంది. అందుకే 'లైగర్' ఫ్లాప్ అయినా కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు" అని జడ్సన్ ఆరోపించారు.
ఇప్పుడు జగన్, ఛార్మీలను ఈడీ విచారించడంతో జడ్సన్ ఫిర్యాదు ఆధారంగానే ఇది జరిగిందని అర్థమవుతోంది. జగన్, చార్మీకి చెందిన బ్యాక్ అకౌంట్లకు ఎక్కడెక్కడి నుంచి డబ్బు జమ అయ్యిందనే కోణంలోనూ ఈడీ ఆధికారులు వారిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మనీ ట్రాన్స్‌ఫర్స్‌కు సంబంధించి ఫెమా ఉల్లంఘనలు జరిగాయని కూడా ఈడీ గుర్తించినట్లు వినిపిస్తోంది. ఒకవేళ అదే నిజమైతే జగన్, ఛార్మి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయినట్లే. ఈడీ అధికారులు జగన్, ఛార్మిలను విచారించడంతో ఆగుతారా, బాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్-డైరెక్టర్ అయిన కరణ్ జోహార్‌ను కూడా విచారిస్తారా?.. అనే విషయంలో త్వరలో మనకు క్లారిటీ వస్తుంది. బక్క జడ్సన్ ఆరోపణల్లో వాస్తవం ఉన్నట్లు తేలితే మాత్రం కల్వకుంట్ల కవిత కూడా ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు.
పూరి జగన్నాథ్, ఛార్మి గతంలో డ్రగ్స్ కుంభకోణంలో తెలంగాణ పోలీసుల విచారణను ఎదుర్కోవడం, క్లీన్ చిట్‌తో బయటకు రావడం మనకు తెలుసు. ఇప్పుడు 'లైగర్' మూవీ పెట్టుబడుల విషయంలోనూ వాళ్లు అలాగే బయట పడతారా, లేదా? లెటజ్ వెయిట్ అండ్ సీ.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



