'ప్రాజెక్ట్ k' రిలీజ్ డేట్ వచ్చేసింది.. ప్రభాస్ ఫ్యాన్స్ కి పండగే!
on Jul 28, 2022

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరే హీరోకి సాధ్యం కాని విధంగా పలు భారీ ప్రాజెక్ట్స్ లో నటిస్తున్నాడు. అందులో 'ప్రాజెక్ట్ k' ఒకటి. 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటాని నటిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ పై భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ సినిమా గురించి నిర్మాత అశ్వినీదత్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఆయన మాటలు చూస్తుంటే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించడం ఖాయమనిపిస్తోంది.
రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో 'ప్రాజెక్ట్ k' గురించి అశ్వినీదత్ మాట్లాడుతూ.. ఇది అవెంజర్స్ తరహా సినిమా అని, అవుట్ పుట్ చూసి అందరూ సర్ ప్రైజ్ అవుతారని అన్నారు. ఈ చిత్రాన్ని చైనా, అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయనున్నామని తెలిపారు. 2023 జనవరి నాటికి షూటింగ్ పూర్తి అవుతుందని, పోస్ట్ ప్రొడక్షన్ మరియు వీఎఫ్ఎక్స్ వర్క్స్ కి మరో ఎనిమిది నెలలు పడుతుందని అన్నారు. అక్టోబర్ 18, 2023న సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని, కుదరని పక్షంలో 2024 జనవరికి ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెప్పారు.
అశ్వినీదత్ వ్యాఖ్యలతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. జనవరి 12, 2023 న 'ఆదిపురుష్' విడుదల కానుంది. 2023 ఏప్రిల్ లో 'సలార్' విడుదలయ్యే అవకాశముంది. అలాగే 'ప్రాజెక్ట్ k' కూడా అక్టోబర్ 18, 2023 లేదా 2024 జనవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అంటే ఏడాది కాలంలో ప్రభాస్ నటించిన మూడు సినిమాలు విడుదల కానున్నాయి. ఫ్యాన్స్ కి ఇంతకంటే కావాల్సింది ఏముంటుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



