ఐదో రోజు భారీగా పడిపోయిన 'ప్రిన్స్' వసూళ్లు.. అనుదీప్‌కు దెబ్బ మీద దెబ్బ!
on Oct 26, 2022

'డాక్టర్', 'డాన్' మూవీస్‌తో వరుస హిట్ల రుచి చూశాడు తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్. అతని లేటెస్ట్ ఫిల్మ్ 'ప్రిన్స్'.. ఇటు విమర్శకులు, అటు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన పొందింది. బాక్సాఫీస్ దగ్గర ఆ ఫిల్మ్ కలెక్షన్లు 5వ రోజు భారీగా పడిపోయాయి. దీపావళి రోజుతో పోలిస్తే మంగళవారం ఆ సినిమాకు సగం వసూళ్లు మాత్రమే వచ్చాయి. వచ్చే వీకెండ్‌లో కలెక్షన్లు వస్తాయని టీమ్ మెంబర్స్ ఆశిస్తున్నారు కానీ, ఆ అవకాశాలు అత్యల్పమనీ, వచ్చే శుక్రవారం నుంచీ పలు థియేటర్ల నుంచి ఆ సినిమాని తీసివేసే అవకాశాలు ఎక్కువనీ ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.
'జాతిరత్నాలు' ఫేమ్ కేవీ అనుదీప్ డైరెక్ట్ చేసిన 'ప్రిన్స్' మూవీ దీపావళికి ముందస్తు కానుకగా అక్టోబర్ 21న విడుదలైంది. కార్తీ 'సర్దార్' మూవీతో తమిళంలో పోలీపడ్డ ఆ సినిమా తెలుగులో దానితో పాటు 'ఓరి దేవుడా', 'జిన్నా' మూవీస్‌తో క్లాష్‌ను ఎదుర్కొంది.
థియేటర్లలో విడుదలైనప్పట్నుంచీ అన్ని వైపుల నుంచీ 'ప్రిన్స్'కు నెగటివ్ రెస్పాన్స్ లభించింది. మొదటిరోజు మంచి ఓపెనింగ్స్ వచ్చినా, రోజురోజుకూ వసూళ్లు దిగజారుతూ వస్తున్నాయి. ఐదో రోజైతే వసూళ్లు మరీ దారుణంగా వచ్చాయి. దేశవ్యాప్తంగా ఆ సినిమా రూ. 2.5 కోట్ల నుంచి 2.8 కోట్ల (నెట్) మధ్యలో వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. తెలుగులో అయితే ఈ సినిమా వసూళ్లు మరీ తీసికట్టుగా ఉన్నాయి.
రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ మూవీలో ఒక బ్రిటీష్ యువతితో ప్రేమలో పడ్డ స్కూల్ మాస్టారు కథ కనిపిస్తుంది. వాళ్ల ప్రేమకు హీరో తండ్రితో పాటు, ఊరివాళ్లు కూడా అడ్డు చెప్తారు. హీరోయిన్‌గా మరియా ర్యాబోష్ప్‌కా నటించగా, హీరో తండ్రి పాత్రను సత్యరాజ్ చేశారు. తమన్ సంగీతం సమకూర్చాడు.
కాగా 'జాతిరత్నాలు' సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ డైరెక్టర్ అయిపోయిన అనుదీప్‌కు వరుసగా రెండు దెబ్బలు తగిలినట్లయింది. అతను కథ అందించిన 'ఫస్ట్ డే ఫస్ట్ షో' డిజాస్టర్ కాగా, ఇప్పుడు 'ప్రిన్స్' కూడా తెలుగులో డిజాస్టర్ అయ్యింది. తమిళంలోనూ ఫ్లాప్ దిశగా వెళ్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



