ప్రకాష్ రాజ్ వర్సెస్ విష్ణు.. రసవత్తరంగా 'మా' పోరు
on Jun 21, 2021
'మా'(మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) ఎన్నికల పోరు ఈసారి రసవత్తరంగా మారనుంది. ఇప్పటికే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మా ఎన్నికల బరిలోకి దిగగా.. తాజాగా హీరో మంచు విష్ణు కూడా 'మా' అధ్యక్ష పోరుకి దిగుతున్నట్లుగా ప్రకటించారు. దీంతో 'మా' పోరు ప్రకాష్ రాజ్ వర్సెస్ విష్ణుగా మారింది.
మా ఎన్నికల బరిలో దిగిన ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ.. తాను సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నానని.. అలాగే `మా` అసోసియేషన్ కి అధ్యక్షుడిగా సేవలు అందించగలననే నమ్మకం ఉందని అన్నారు. తెలుగు పరిశ్రమలో ఉన్న సమస్యల గురించి తనకి పూర్తి అవగాహన ఉందని.. వాటిని పరిష్కరించడానికి సరైన ప్రణాళిక కూడా తన దగ్గర ఉందని చెప్పారు. `మా` అసోసియేషన్ కు దేశవ్యాప్తంగా గౌరవం తీసుకొచ్చేందుకు తనవంతు కృషి చేస్తానని ప్రకాష్ రాజ్ అన్నారు.
విష్ణు మాట్లాడుతూ.. కొత్త తరం కొత్త ఆలోచనలతో ముందుకు సాగితే మేలు జరుగుతుందనే అభిప్రాయంతో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. మరోవైపు విష్ణు పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నట్లుగా అర్థమవుతోంది. తండ్రి మోహన్ బాబుతో కలిసి పలువురు టాలీవుడ్ స్టార్స్ మద్దతు కూడగడుతున్నట్టు సమాచారం.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
