నటుడు చిన్నాకి జీవితం మీద విరక్తి కలిగించిన డైరెక్టర్ వంశీ!
on Jun 21, 2021
హైదరాబాద్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో నటనలో శిక్షణ పొందాక చిన్నా (అసలు పేరు జితేందర్ రెడ్డి) వేషాల కోసం మద్రాస్ వెళ్లాడు. అప్పుడాయనకు మద్రాస్‌తో కానీ, తమిళంతో కానీ పెద్దగా పరిచయం లేదు. అక్కడ వాళ్ల పెదనాన్న వాళ్లింట్లో దిగాడు. ఒకసారి వాళ్లున్న రోడ్డు మీద నుంచి పక్కరోడ్డులోకి వచ్చాడు. అక్కడ గోలగోలగా ఉంది. జనం బాగా ఉన్నారు. ఏంటనే క్యూరియాసిటీతో అక్కడకు వెళ్లాడు చిన్నా. అక్కడ జనం తెలుగు మాట్లాడుకుంటున్నారు. ఏంటని ఒకర్ని అడిగాడు చిన్నా.
వంశీ డైరెక్ట్ చేయబోతున్న 'మహర్షి' (1987) సినిమా కోసం ఇంటర్వ్యూలు జరుగుతున్నాయని, వంశీగారు కొత్తవాళ్లను సెలక్ట్ చేస్తున్నాడని అతను చెప్పాడు. ఆమైనే గబగబా ఇంటికి పరిగెత్తుకొని వెళ్లి, తన దగ్గరున్న రెండు ఫొటోలు తీసుకొని వచ్చాడు. ఆఫీసు గేటు తీసుకొని లోపలికి వెళ్లాడు. సరిగ్గా అప్పుడే ఆఫీసులోంచి బయటకు వస్తున్నారు వంశీ.
"సార్.. నమస్తే" అన్నాడు చిన్నా.
ఆయన్ను చూసి, చిరాగ్గా "ఆ.. ఆ.." అన్నారు వంశీ.
"సార్.. నేను ఆర్టిస్టునండీ.." అని పరిచయం చేసుకోబోయాడు చిన్నా.
"ఇప్పుడేం లేవు.. పో పో.." అని చేయి విదిలించారు వంశీ.
ఆయన విదిలించిన విధానానికి జీవితం మీద విరక్తి వచ్చేసింది చిన్నాకు. ఏం చేయాలో అర్థంకాక దిగులుగా నిల్చుండిపోయాడు. అప్పుడు అక్కడ ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకుంటున్న వేమూరి సత్యనారాయణ ఆయనను గమనించి, "బాబూ ఇలారా" అని పిలిచారు. వెళ్లాడు చిన్నా. ఆయన దగ్గర ఫొటోలు తీసుకొని, అడ్రస్ రాసుకొని, "ఏదైనా అవకాశం ఉంటే పిలుస్తా" అని చెప్పి పంపించారు.
ఏదేమైనా చాలా రోజులు ఆ ఇన్సిడెంట్ చిన్నాను వేధిస్తూ వచ్చింది. తిరిగి ఇంటికి వెళ్లిపోదామనే ఆలోచన కలిగించింది. ఈ విషయాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు చిన్నా. తర్వాత కాలంలో ఆయన రామ్‌గోపాల్ వర్మ డైరెక్టర్‌గా పరిచయమైన కల్ట్ మూవీ 'శివ' (1989)లో నాగార్జున ఫ్రెండ్ చిన్నాగా నటించి, ఆ క్యారెక్టర్ పేరుతోటే పాపులర్ అయ్యాడు.