ఈ సినిమా చేయడం నీ అదృష్టమని చిరంజీవి గారు అన్నారు!
on Jun 6, 2023
'ఆదిపురుష్' మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ తిరుపతిలో ఘనంగా జరిగింది. చిన్న జీయర్ స్వామి ముఖ్య అతిథిగా, లక్ష మంది సమక్షంలో అత్యంత వైభవంగా జరిగిన ఈ వేడుకలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ స్పీచ్ ఎంతగానో ఆకట్టుకుంది. జై శ్రీరామ్ అంటూ తన స్పీచ్ ని ప్రారంభించారు ప్రభాస్. రామాయణం ఆధారంగా తెరకెక్కే సినిమాలో నటించే అవకాశం రావడం అదృష్టమని తనతో చిరంజీవి అన్నారని ప్రభాస్ తెలిపారు.
"ఆదిపురుష్ సినిమా చేయడం మా అదృష్టం. ఒకసారి చిరంజీవి గారిని కలిసినప్పుడు.. రామాయణం చేయడం నీ అదృష్టం, ఈ అదృష్టం అందరికీ దక్కదు అన్నారు. నిజంగా ఈ అవకాశం రావడం నా అదృష్టం. అభిమానులు 3డి ట్రైలర్ చూసి ఇచ్చిన ఎంకరేజ్ మెంటే మమ్మల్ని ఇంతదూరం నడిపించింది. ఈ సినిమా కోసం ఓం రౌత్ అండ్ టీం సరిగా నిద్ర కూడా పోకుండా ఎంతగానో కష్టపడ్డారు. నిద్ర కూడా పోకుండా ఓం రౌత్ లా కష్టపడే వ్యక్తిని నా కెరీర్ లో చూడలేదు. చిన్న జీయర్ స్వామి గారు రావడం ఈ వేడుకకు మరింత గౌరవం తీసుకొచ్చింది. లక్ష్మణుడు లేకపోతే రామాయణం లేదు. సన్నీ సింగ్ అద్భుతంగా నటించాడు. సీత పాత్రకు కృతి సనన్ ప్రాణం పోసింది. దేవదత్త నాగే తో కలిసి పనిచేసేటప్పుడు నిజంగా హనుమంతుడితో ఉన్నట్లు అనిపించింది. అభిమానులు ఇచ్చిన మద్దతు, ఉత్సాహంతోనే సినిమా ఇంత బాగా తీయగలిగాం. నేను స్టేజ్ మీద తక్కువ మాట్లాడి, ఎక్కువ సినిమాలు తీయడానికి ఇష్టపడతాను. ఏడాదికి రెండు-మూడు సినిమాలు అందించడానికి ప్రయత్నిస్తాను" అని ప్రభాస్ అన్నారు.
పెళ్లి ఎప్పుడు అని అభిమానులు అడగగా.. "పెళ్లా.. తిరుపతిలోనే చేసుకుంటానులే ఎప్పుడైనా" అంటూ నవ్వుతూ చెప్పారు ప్రభాస్.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
