కట్టిపడేస్తున్న 'ఆదిపురుష్' ఫైనల్ ట్రైలర్!
on Jun 6, 2023
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో కనువిందు చేయనున్న చిత్రం 'ఆదిపురుష్'. టి.సిరీస్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకుడు. ఇందులో సీతగా కృతి సనన్, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఈ చిత్రం జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ కి, పాటలకి విశేష స్పందన లభించింది. తాజాగా ఈ చిత్రం నుంచి ఫైనల్ ట్రైలర్ ను విడుదల చేశారు.
'ఆదిపురుష్' మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ స్టేడియంలో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు చిన్న జీయర్ స్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభాస్, కృతి సనన్, ఓం రౌత్ తో పాటు ఇతర చిత్ర బృందం పాల్గొన్న ఈ కార్యక్రమానికి ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. లక్షమందికి పైగా ఈ వేడుకకు హాజరయ్యారనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ప్రీ రిలీజ్ వేడుక సందర్భంగా కొత్త ట్రైలర్ ను విడుదల చేశారు. ఫైనల్ ట్రైలర్ పేరుతో విడుదల చేసిన ఈ ట్రైలర్ కట్టిపడేస్తోంది.
రావణాసురుడు మారువేషంలో వచ్చి సీతను అపహరించే సన్నివేశంతో ట్రైలర్ ప్రారంభమైంది. సీతను బంధించి రావణుడి పాత్రను క్రూరుడిగా పరిచయం తీరు ఆకట్టుకుంది. "వస్తున్నా రావణ. న్యాయం రెండు పాదాలతో, నీ పది తలల అన్యాయాన్ని అణిచివేయడానికి. వస్తున్నా నా జానకిని తీసుకువెళ్ళడానికి" అంటూ రాముడిగా ప్రభాస్ ను చూపించిన తీరు కట్టిపడేసింది. భారీ యుద్ధ సన్నివేశాలు, పవర్ ఫుల్ డైలాగ్స్ తో ట్రైలర్ మెప్పిస్తోంది. ''ఈ దశకంఠుడు పదిమంది రాఘవులు కన్నా ఎక్కువ" అని రావణుడు అనగా.. "పాపం ఎంత బలమైనదైనా.. అంతిమ విజయం సత్యానిదే" అంటూ రాముడి మాటతో ట్రైలర్ ని ముగించిన తీరు బాగుంది. మొత్తానికి ఈ ఫైనల్ ట్రైలర్ సినిమాపై అంచనాలను మరోస్థాయికి తీసుకెళ్లేలా ఉంది.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
