ప్రభాస్ సినీ ప్రస్థానానికి 20 ఏళ్లు
on Nov 11, 2022

20 ఏళ్ళ క్రితం రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా 'ఈశ్వర్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు ప్రభాస్. జయంత్ సి.పరాంజీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నవంబర్ 11, 2002న విడుదలైంది. ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయినప్పటికీ.. ప్రభాస్ మాత్రం మొదటి చిత్రంతోనే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. ఈ 20 ఏళ్ళ సినీ ప్రయాణంలో సినిమా సినిమాకి అభిమానులను పెంచుకుంటూ తెలుగులో స్టార్ గా ఎదగటమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తిరుగులేని గుర్తింపు సొంతం చేసుకున్నాడు.
'ఈశ్వర్' చిత్రంలో మాస్ ని మెప్పించే అంశాలు బాగానే ఉన్నప్పటికీ ఓవరాల్ గా యావరేజ్ సినిమాగానే నిలిచింది. అయితే ప్రభాస్ తన కటౌట్, యాక్షన్ తో మొదటి సినిమాతోనే మాస్ ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. రెండో సినిమా 'రాఘవేంద్ర'తోనూ నిరాశపరిచిన ప్రభాస్ మూడో సినిమా 'వర్షం'తో సంచలన విజయాన్ని అందుకొని ఆకట్టుకున్నాడు. ఇక 2005 లో రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'ఛత్రపతి' సినిమా ప్రభాస్ ని స్టార్ గా నిలబెట్టింది. ఆ తర్వాత 'డార్లింగ్', 'మిస్టర్ పర్ఫెక్ట్', 'మిర్చి' వంటి సినిమాలతో అలరించి టాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకడిగా ఎదిగాడు.
ఇక 'బాహుబలి' సిరీస్ తో ప్రభాస్ క్రేజ్ విశ్వవ్యాప్తమైంది. 20 ఏళ్ళ సినీ ప్రయాణంలో మరే హీరోకి సాధ్యం కాని విధంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే లక్షణమే ప్రభాస్ ని ఇంతటి వాడిని చేసిందని ఆయన ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటారు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో 'ఆదిపురుష్', 'సలార్', 'ప్రాజెక్ట్ కె' పలు భారీ ప్రాజెక్ట్ లు ఉన్నాయి. ముందు ముందు ప్రభాస్ ఇంకెన్ని సంచనాలు సృష్టిస్తాడో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



