మళ్లీ కెమెరా ముందుకు పవన్ కల్యాణ్.. మరి 'జనసేన' పరిస్థితి?
on Oct 19, 2019

జనసేనాని పవన్ కల్యాణ్ మళ్లీ కెమెరా ముందు నటించేందుకు సిద్ధమవుతున్నారు. ఇది ఆయన సినీ అభిమానుల్ని ఆనందడోలికల్లో ముంచెత్తుతోంది. మరోవైపు జనసైనికుల్లో తికమకను కలిగిస్తోంది. అవును. 2018 జనవరిలో వచ్చిన 'అజ్ఞాతవాసి' మూవీ తర్వాత పవన్ కల్యాణ్.. సినిమాలకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చి పూర్తిస్థాయిలో రాజకీయాలకు అంకితమయ్యారు. ఈ ఏడాది జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో తన పార్టీ జనసేనను పోటీలో నిలిపారు. కానీ వైఎస్సార్‌సీపీ ప్రభంజనం ముందు ఆయన పార్టీ దారుణ పరాభవాన్ని మూటగట్టుకుంది.
175 అసెంబ్లీ సీట్లకు గాను కేవలం ఒకే ఒక్క సీటును దక్కించుకొంది. పవన్ కల్యాణ్ స్వయంగా రెండు సీట్లు.. భీమవరం, గాజువాకలో.. పోటీచేయగా, రెండు చోట్లా జనం ఆయనను ఓడించారు. ఇది నిజంగా ఆయనకూ, ఆయనను నమ్ముకొని జనసేనలో భాగమైనవారికీ షాక్ కలిగించింది. క్షేత్ర స్థాయిలో కేడర్‌ను బలోపేతం చెయ్యకపోవడం, ఒక వ్యూహం ప్రకారం ఎన్నికల ప్రచారం నిర్వహించకపోవడం వల్లే.. ఆయనా, ఆయన పార్టీ పరాభవాన్ని ఎదుర్కొన్నాయనేది ఎన్నికల పరిశీలకులు చైప్పిన మాట.
క్రియాశీల రాజకీయాల్లో ఉన్నవాళ్లు నిత్యం జనంతో అనుసంధానమై, వాళ్ల కష్టాల్నీ, వాళ్ల సమస్యల్నీ తమవిగా చేసుకొని, వాళ్ల తరపున నిత్యం గొంతు వినిపిస్తేనే.. ప్రజలు కూడా వాళ్లకు మద్దతుగా నిలుస్తారు. అడపాదడపా, తమకు వీలైనప్పుడు మాత్రమే ప్రజా సమస్యలపై గళమెత్తి, కేవలం విమర్శలకే పరిమితమైతే.. ప్రజలు ఆ నాయకుల పక్షాన నిలవరు. ఎన్నికల్లో ప్రజా తీర్పు వచ్చిన తర్వాతే ఈ విషయం ఆయనకు బాగా అవగతమైంది. అందుకే ఎన్నికల్లో ఓటమి షాక్ నుంచి చాలా త్వరగానే తేరుకున్న ఆయన, జనసేన.. ప్రజల కోసం పనిచేస్తుందనీ, రాజకీయాల నుంచి తను తప్పుకొనే ప్రసక్తే లేదనీ తేల్చి చెప్పారు. అప్పటి నుంచీ ప్రజల సమస్యలమై మరింత ఎక్కువగా మాట్లాడుతూ వస్తున్నారు.
ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాల్లోకి వస్తున్నారనే ప్రచారం కొంత కాలం నుంచే నడుస్తోంది. అదే జరిగితే, 'జనసేన' పరిస్థితి ఏమిటనే ప్రశ్న అప్పట్నుంచే ఉత్పన్నమవుతూ వస్తోంది. 'జనసేన'కు పవన్ తప్ప మరో ఆధారం లేదు. ఆయన నిలిస్తేనే 'జనసేన' పార్టీ ఉంటుందనేది స్పష్టం. అలాంటప్పుడు ఆయన మళ్లీ సినిమాల్లోకి వస్తే, రాజకీయంగా 'జనసేన'కు నష్టం కలుగుతుందని ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాజకీయ నాయకుడికి ఇమేజ్ కూడా ముఖ్యమే. నేరుగా రాజకీయాల్లోకి వెళ్లిన వాళ్ల స్థితి వేరు, సినిమాలు ఇచ్చిన మాస్ ఇమేజ్‌తో రాజకీయాల్లోకి వెళ్లడం వేరు. గతంలో తమిళనాడులో ఎమ్జీఆర్, జయలలిత, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్.. సినిమాలు తెచ్చిన ఇమేజ్‌తో ముఖ్యమంత్రులుగా ఎదిగారు. ఎమ్జీఆర్, జయలలిత.. ముఖ్యమంత్రులయ్యాక సినిమాలకు స్వస్తి చెప్పగా, ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించిన తర్వాత విడుదలైన 'శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర' సినిమా బాక్సాఫీస్ రికార్డుల్ని బద్దలు కొట్టింది. ముఖ్యమంత్రి పీఠం నుంచి దిగిపోయాక ఎన్టీఆర్ 'బ్రహ్మర్షి విశ్వామిత్ర', 'సమ్రాట్ అశోక', 'మేజర్ చంద్రకాంత్', 'శ్రీనాథ కవిసార్వభౌముడు' సినిమాలు చేశారు. తన ఇమేజ్‌ను కాపాడుకున్నారు.
అంతెందుకు.. పవన్‌కు స్వయానా అన్న మెగాస్టార్ చిరంజీవి సైతం 'ప్రజా రాజ్యం' పార్టీని పెట్టి, రాజకీయాలకు విరామమిచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో ఓటమి పాలవడంతో ఆయన 'ప్రజా రాజ్యం' పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేశారు. తర్వాత కాంగ్రెస్ జమానాలో ఒకటిన్నర సంవత్సరం పైగా కేంద్ర పర్యాటక శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. కొన్నాళ్ల క్రితం నుంచి క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ, మళ్లీ ముఖానికి రంగేసుకొని 2017లో 'ఖైదీ నంబర్ 150'తో ప్రేక్షకుల ముందుకు వచ్చి నీరాజనాలు అందుకున్నారు. అంటే.. రాజకీయాల్లో లభించని ఆదరణను నటునిగా ఆయన తిరిగి పొందారు. ఇక ఇటీవల వచ్చిన 'సైరా.. నరసింహారెడ్డి' సినిమాలోనూ ఆయన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు.
ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలనే నిర్ణయంపై పవర్‌స్టార్‌గా ఆయనను అభిమానించే ప్రేక్షకులు స్వాగతిస్తున్నారు. గతంలో ఆయనకు పవర్ స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన 'ఖుషి' సినిమాను నిర్మించిన శ్రీ సూర్యా మూవీస్ అధినేత ఎ.ఎం. రత్నం.. పవన్ రీ ఎంట్రీ మూవీని నిర్మించనున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇక తన కెరీర్‌లో 'గమ్యం', 'వేదం', 'కృష్ణం వందే జగద్గురుం', 'కంచె', 'గౌతమిపుత్ర శాతకర్ణి' వంటి చక్కని సినిమాల్ని రూపొందించిన క్రిష్.. ఆ మూవీని డైరెక్ట్ చేస్తాడని చెబుతున్నారు. అయితే ఈ ఏడాది ఆరంభంలో బాలకృష్ణతో తీసి రెండు భాగాల ఎన్టీఆర్ బయోపిక్.. 'యన్.టి.ఆర్: కథానాయకుడు', 'యన్.టి.ఆర్: మహానాయకుడు' సినిమాలు రెండూ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ కావడంతో.. క్రిష్ డైరెక్షన్ విషయంలో పవన్ ఫ్యాన్స్ ఒకింత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఏదేమైనా క్రిష్ డైరెక్షన్‌లో చేసే మూవీతో పాటు వెంటవెంటనే మరో రెండు సినిమాలు చెయ్యడానికీ పవన్ కల్యాణ్ సుముఖంగా ఉన్నారనేది ఆయన కాంపౌండ్ నుంచి వినిపిస్తున్న మాట. రెండేళ్ల విరామంతో మళ్లీ కెమెరా ముందుకు రానున్న పవన్‌కు ప్రేక్షకులు ఎలాంటి స్వగతాన్ని పలుకుతారో చూడాలి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



