ENGLISH | TELUGU  

40 యేళ్ల అపురూప చిత్రం 'గోరింటాకు'

on Oct 19, 2019

 

దాసరి నారాయణరావు కీర్తి కిరీటంలో మకుటాయమైన మణుల్లో 'గోరింటాకు' సినిమా ఒకటి. కఠిన హృదయాల్ని కూడా ద్రవింపజేసే కథకు, శోభన్‌బాబు, సుజాత అద్వితీయ నటన తోడై, 'గోరింటాకు'ను మరపురాని చిత్రాల్లో ఒకటిగా నిలిపింది. అక్టోబర్ 19తో ఆ సినిమా విడుదలై సరిగ్గా నలభై ఏళ్లు. అంటే 1979లో ఆ తేదీన విడుదలైంది. అప్పటి సుప్రసిద్ధ రచయిత్రుల్లో ఒకరైన కె. రామలక్ష్మి అందించిన కథను దాసరి సెల్యులాయిడ్‌పైకి తీసుకొచ్చిన తీరు అమోఘం.

ఉదాత్త హృదయం కలిగిన ఇద్దరు యువతీ యువకులు ఒకరినొకరు ప్రేమించి కూడా, ఆ విషయాన్ని వ్యక్తం చేసుకోకపోవడం వల్ల ఎలాంటి అనర్థాలు జరిగాయి, వాళ్ల జీవితాలు ఏ తీరానికి చేరాయనే కథకు, 'గోరింటాకు' స్వభావాన్ని అద్ది ఈ చిత్రాన్ని దాసరి నారాయణరావు రూపొందించారు. గోరింటాకు ఎదుటివాళ్ల చేతుల్ని పండించి తాను రాలిపోతుంది. అలాంటి స్వభావాన్ని ఈ కథలో స్వప్న చూపిస్తుంది. చిన్నతనంలోనే తాగుబోతు తండ్రి దాష్టీకాల్ని తట్టుకోలేక ఇల్లు విడిచి, ధర్మసత్రంలో ఉంటూ అష్టకష్టాలు పడుతున్న రామును స్వప్న ఆశ్రయం కలిపిస్తుంది. అతడికి చేదొడు వాదోడుగా ఉంటూ, అతడు మెడిసిన్ పూర్తి చేయడానికి తోడ్పడుతుంది. ఈ క్రమంలో ఇద్దరినొకరు ఆరాధించుకుంటారు. కానీ ఇది తెలియని స్వప్న తండ్రి ఆమెకు ఒక పెద్దింటి సంబంధాన్ని చూస్తాడు. రాము కూడా దానికి ఆమోదముద్ర వేయడంతో మనసు చంపుకొని ఆనంద్‌ను పెళ్లాడుతుంది స్వప్న. కానీ అతడింటికి వెళ్లినరోజే, అతడికి అదివరకే పెళ్లయ్యిందనీ, ఒక కూతురు కూడా ఉందనీ తెలిసి హతాశురాలవుతుంది.

ఆ మొదటి భార్యకు అన్యాయం జరగకూడదని ఆమె పక్షాన నిలిచి, వాళ్లిద్దర్నీ కలిపి,  ఆనంద్ కట్టిన తాళి తెంపి, పుట్టింటికి వచ్చేస్తుంది. ఈలోగా విరిగిన మనసుతో ఉన్న రాముకు పొరుగునే ఉన్న పద్మ అనే మానసిక స్థితి సరిగాలేని యువతి పరిచయమవుతుంది. పెళ్లిరోజే, ఆమె చేసుకోబోయిన వరుడు కారు ప్రమాదంలో చనిపోవడంతో ఆమె డిప్రెషన్‌కు గురవుతుంది. ఆమెను మామూలు మనిషిని చేయడమే కాకుండా, ఆమెకు మనసిచ్చి, జీవితాన్ని కూడా పంచుకోవాలనుకుంటాడు రాము. అదే సమయంలో రాము రాసిన డైరీని స్వప్న తండ్రి, స్వప్న ఇద్దరూ చదివి, అతడి మనసేమిటో తెలుసుకుంటారు. స్వప్న ప్రేమ కొత్త చిగుళ్లు వేస్తుంది. క్లాస్‌మేట్ ద్వారా స్వప్న తనను ప్రేమించిందనే సంగతి రాముకూ తెలుస్తుంది. స్వప్నకు జీవితాన్ని ప్రసాదించాల్సిందిగా రాము అర్థిస్తాడు స్వప్న తండ్రి. పద్మకు విషయం వెల్లడించి, ఆమె సూచనతో స్వప్నతో పెళ్లికి సిద్ధపడతాడు రాము. కానీ రాము, పద్మల ఉదంతం తెలుసుకున్న స్వప్న, తన ప్రేమను త్యాగంచేసి, వాళ్లిద్దర్నీ ఒకటిచేస్తుంది. సినిమాలో ఎన్ని సందర్భాల్లో మన కళ్లళ్లో నీళ్లు తిరుగుతాయో! సినిమా పూర్తయ్యేసరికి మన హృదయం బరువెక్కిపోతుంది. స్వప్న పాత్రకు న్యాయం జరిగివుంటే బాగుండుననిపిస్తుంది.

కథ నడిచేది రాము ప్రాత్ర చుట్టూ అయినా, స్వప్న పాత్ర దానికంటే బలమైనది. సొంత వ్యక్తిత్వం ఉన్న స్త్రీగా, తాళికట్టిన భర్త చేసిన మోసాన్ని ప్రశ్నించి, ఆ తాళిని తెంచి, తనలాగే మోసపోయిన అతని మొదటి భార్యకు న్యాయం చేసిన ధీరోదాత్తురాలిగా, తను మనసిచ్చిన వాడిని మరో యువతి కోరుకుతున్నదని తెలిసి, ఆ ఇద్దర్నీ కలపడమే న్యాయమని భావించిన త్యాగశీలిగా స్వప్న పాత్రలో సుజాత నటన అపూర్వం. ఆమె హావభావాలు, ఆమె బాడీ లాంగ్వేజ్, ఆమె పలికే మాటలతో మనం ఆమెకు దాసోహమైపోతాం. చిన్నతనం నుంచే కష్టాల కడలిలో పెరిగి, స్వప్న ఇచ్చిన ఆశ్రయంతో మెడిసిన్ పూర్తిచేసి, డాక్టర్‌గా మారి, స్వప్నపై ప్రేమను వెల్లడించలేక, ఆమె మరొకర్ని మనువాడుతుంటే, మౌనంగా బాధపడి, మానసిక స్థైర్యం లోపించిన మరో యువతిని బాగుచేసి, ఆమెకు తోడుగా నిలవాలని నిర్ణయించుకొనే ఉదాత్తుడు రాము పాత్రలో శోభన్‌బాబూ గొప్పగా రాణించారు. సెకండాఫ్‌లో వచ్చే సెకండ్ హీరోయిన్ పద్మ పాత్రలో వక్కలంక పద్మ ఫర్వాలేదనిపిస్తుంది.

ఈ సినిమాలో శోభన్‌బాబు తల్లిగా మహానటి సావిత్రి నటించారు. అందంతో, తనకే సాధ్యమైన గొప్ప నటనతో మన హృదయాల్లో చిరస్థాయి స్థానం పొందిన మహానటిని ఆ పాత్రలో అలా చూడాల్సి రావడం బాధనిపిస్తుంది. అప్పటికే శారీరకంగా ఆమె దుర్బలురాలైనట్లు ఆమె రూపం తెలియజేస్తుంది. తాగుబోతు భర్తతో నానా అగచాట్లూ పడే స్త్రీగా ఆమ పాత్ర కంటతడి పెట్టిస్తుంది. ఆమె భర్తగా జె.వి. రమణమూర్తి తన పాత్రకు తగ్గ నటన చూపించి, ఆ పాత్రపై మనకు అసహ్యం కలిగేలా చేశారు. స్వప్న తండ్రిగా ప్రభాకరరెడ్డి ఉన్నత స్థాయి నటన కనపరిచారు. సినిమాలో రిలీఫ్ పాయింట్ అనదగ్గ పాత్రలు చలం, రమాప్రభ జోడీది. ఆ ఇద్దరూ తెరపై కనిపించిన ప్రతిసారీ మన ముఖాలపై నవ్వులు పూస్తాయి.

ఈ సినిమాలో రాము చిన్నతనం సన్నివేశాలన్నింటినీ డైరెక్టర్ దాసరి బ్లాక్ అండ్ వైట్‌లో చిత్రీకరించడం గమనార్హం. చిన్నప్పటి రాముగా సాయికుమార్ తమ్ముడు, 'బొమ్మాళీ' రవిశంకర్ కనిపించి మెప్పించాడు. రాము పెద్దవాడయ్యాక కలర్ మూవీ మొదలవుతుంది. సినిమాలో అత్యంత పాపులర్ సాంగ్ అయిన టైటిల్ సాంగ్ 'గోరింట పూచింది కొమ్మా లేకుండా'ను బ్లాక్ అండ్ వైట్‌లో సావిత్రిపైనే దర్శకుడు చిత్రీకరించాడు. ఆ పాటను రాసింది దేవులపల్లి కృష్ణశాస్త్రి. దానితో పాటు 'ఎలా ఎలా దాచావు అలవికాని అనురాగం' పాటనూ ఆయనే రచించారు. 'పాడితే శిలలైనా కరగాలి', 'చెప్పనా సిగ్గు విడిచి చెప్పరానివీ', 'యేటంటావ్ యేటంటావ్' పాటల్ని ఆత్రేయ రాస్తే, 'కొమ్మ కొమ్మకో సన్నాయి' పాటను వేటూరి రచించారు. 'ఇలాగ వచ్చి అలాగ తెచ్చి' పాటను రాసింది శ్రీ శ్రీ. పాటలన్నీ సూపర్ హిట్టే. కె.వి. మహదేవన్ స్వరాలు కూర్చిన ఈ పాటలన్నీ జనాల నాలుకలపై నర్తించినవే.

అప్పటికే అభిరుచి కలిగిన నిర్మాతగా యువ చిత్ర అధినేత కె. మురారికి మంచి పేరు ఉంది. 'గోరింటాకు' సినిమా నిర్మాతగా ఆయనకూ, దర్శకుడిగా దాసరికీ ఎనలేని కీర్తి ప్రతిష్ఠలు తెచ్చిన ఈ మూవీ థియేటర్లలో రజతోత్సవం జరుపుకుంది.

Cinema Galleries

Latest News


Video-Gossips

Disclaimer:
All content on this website—including text, images, videos, graphics, and audio—is the property of ObjectOne Information Systems Ltd. or its associates. Unauthorized reproduction, distribution, modification, or publication of any material is strictly prohibited without prior written consent.