పవన్ కల్యాణ్ 'వకీల్ సాబ్'!
on Feb 1, 2020
బాలీవుడ్ హిట్ ఫిల్మ్ 'పింక్' ఆధారంగా తెలుగులో ఓ సినిమా తయారవుతున్న విషయం తెలిసిందే. ఒరిజినల్‌లో అమితాబ్ బచ్చన్ చేసిన లాయర్ క్యారెక్టర్‌ను పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ చేస్తున్నారు. శ్రీరామ్ వేణు డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇటీవలే పవన్‌పై వారం రోజుల పాటు సన్నివేశాలు చిత్రీకరించారు. ఆయనకు సంబంధించి నిర్మాతల వద్ద మరో రెండు వారాల కాల్షీట్లు ఉన్నాయి.
కాగా ఈ సినిమాకు 'వకీల్ సాబ్' అనే టైటిల్‌ను నిర్మాతలు రిజిస్టర్ చేయించారు. ఇప్పటిదాకా ఈ మూవీకి 'లాయర్ సాబ్' అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతూ వస్తోంది. ఫిల్మ్ చాంబర్ దగ్గర ఇప్పుడు 'వకీల్ సాబ్' టైటిల్‌ను రిజిస్టర్ చేయించడంతో.. అదే ఈ మూవీ టైటిల్‌గా ఖరారు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల హీరోయిన్లుగా నటిస్తున్నారు. కొంతమంది ఆకతాయిల చేతుల్లో లైంగిక హింసకు గురైన హీరోయిన్ల తరపున కోర్టులో వాదించే వకీలుగా పవన్ కల్యాణ్ నటిస్తున్నారు. అందరూ ఆయనను వకీల్ సాబ్ అని పిలుస్తుంటారు. అందుకే సినిమా టైటిల్‌గా దాన్నే పెట్టాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు. త్వరలోనే ప్రొడక్షన్ కంపెనీ నుంచి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.

Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
